సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నిలకు పోలింగ్ సమీపిస్తున్న వేళ ట్రబుల్ షూటర్, మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కరెంట్ కావాలో కాంగ్రెస్ కావాలో తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలన్నారు. కర్ణాటక మాదిరిగా తెలంగాణ ఆగం అవకూడదు అని ప్రజలను కోరారు.
కాగా, మంత్రి హరీశ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో రాహుల్ గాంధీ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ గ్యారంటీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కేసీఆర్ అంటే ఒక నమ్మకం. రైతుబంధు సృష్టికర్త కేసీఆర్. కర్ణాటక మోడల్ అంటే 24 గంటల కరెంట్ బదులు మూడు గంటల కరెంట్ ఇవ్వడమా?. 69 లక్షల మంది రైతులకు రైతుబంధు నిధులు ఇస్తున్నాం. రైతుబంధు డబ్బులు జమకాలేదని ఎవరన్నా రోడ్లమీదకు వచ్చారా?. ధరణితో 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది. ధరణితో బీఆర్‌ఎస్‌కు మంచి పేరు వస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఓట్ల కోసం దళిత బంధును బీఆర్‌ఎస్ తీసుకురాలేదు. అలజడిని సృష్టించి బీఆర్‌ఎస్ ఓటు బ్యాంక్‌ను కొల్లగొట్టాలని చూస్తున్నారు. దళిత వర్గాల అభివృద్ధి కోసమే దశలవారీగా దళితబంధు అమలు చేస్తాం.
పేపర్ లీక్ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇలాంటివి పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వాన్ని విమర్శించడం చేతగాకే ప్రతిపక్ష నాయకులు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ప్రతిపక్షాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో లక్షా 32వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ప్రస్తుత కేసీఆర్ ప్రభుత్వంలో 80వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. నీళ్లు, నిధులు, నియామకాలే బీఆర్‌ఎస్ విధానం. బీఆర్‌ఎస్ అత్యుత్తమ పారిశ్రామిక విధానాల ద్వారా పదేళ్లలో ప్రైవేటు రంగంలో 24 లక్షల ఉద్యోగాల కల్పన చేశాం.
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే గడ్డం తీయనని ఉత్తమ్ కుమార్ అన్నారు. రేవంత్ రాజకీయ సన్యాసం చేస్తానని అన్నారు. దేశంలో ప్రతీ ఎమ్మెల్యేకు క్యాంప్ ఆఫీస్ పెట్టిందే బీఆర్‌ఎస్ ప్రభుత్వం. బీఆర్‌ఎస్ 80కిపైగా సీట్లు గెలుస్తుంది. కేసీఆర్ కచ్చితంగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు. తెలంగాణలో అతి తక్కువ ఫీజుతో విద్యార్థులు డాక్టర్ కోర్సు చదవచ్చు. బీజేపీ నాయకుల మాదిరిగా మేము పూటకో మాట మాట్లాడం’ అని కౌంటరిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment