♦ జిల్లాలో పెరిగిన విద్యుత్ కోతలు
♦ షెడ్యూలు ప్రకటించకుండా ఎడాపెడా కరెంటు షాక్!
♦ బుధవారం నాలుగు గంటలకు పైగా సరఫరా నిలిపివేత
♦ మున్సిపల్ పట్టణాలు మినహా జిల్లా అంతటా కోతలు
♦ రైతులకు రాత్రి పూటే వ్యవసాయ విద్యుత్
♦ కావాల్సింది 1.20కోట్ల యూనిట్లు.. వచ్చింది కోటి లోపే
కర్నూలు(రాజ్‌విహార్) : జిల్లాలో కరెంట్ కష్టాలు తీవ్రమయ్యాయి. ఉత్పత్తి కేంద్రాల్లో ఏర్పడిన సాంకేతిక సమస్య, ఎండలు తీవ్రంగా ఉండడంతో వినియోగం కూడా పెరుగడం వంటి కారణాలతో నాలుగు రోజుల క్రితం ప్రారంభమైన ఈ సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. అవసరాలకు సరిపడా విద్యుత్ రాకపోవడంతో వినియోగదారులకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ కష్టాలు సామాన్యుల నుంచి రైతుల వరకు, వ్యాపారులు మొదలు వాణిజ్య పరిశ్రమల యజమానుల వరకు అన్ని వర్గాల ప్రజలకు తాకుతున్నాయి.
ప్రాజెక్టుల్లో నీటి కొరత, థర్మల్ పవర్ ప్లాంట్లలో సాంకేతిక సమస్య ఏర్పడడంతో లోటుకు దారితీస్తోంది. ఎమర్జేన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో నాలుగు రోజులుగా జిల్లాలో విద్యుత్ కోతలు విధిస్తున్నారు. సమస్య ఉన్నప్పటికీ కోతల వేళలు (షెడ్యూల్) ప్రకటించకపోవడంతో కరెంటు ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. లోటు కారణంగా బుధవారం నాలుగు గంటలకు పైగా కోతలు విధించారు. మధ్యాహ్నం నుంచి జిల్లాలోని అన్ని డివిజన్లల్లో విడతల వారీగా కోతలు విధించడం మొదలు పెట్టారు. తిరుపతిలోని ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు చేపట్టిన కోతలు సాయంత్రం వరకు కొనసాగాయి. రైతులకు ఇచ్చే వ్యవసాయ విద్యుత్‌లో భారీగా కోతలు విధించడంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎర్కొంటున్నారు.
కృష్ణపట్నం ఎఫెక్ట్..
మూడు రోజుల క్రితం కృష్ణపట్నం పవర్ ప్లాంట్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా జనరేటర్ల నుంచి ఉత్పత్తి పడిపోయింది. ఫలితంగా 800 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది. ఇటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటాలో కూడా 500 మెగావాట్ల విద్యుత్‌కు గండి పడింది. ఈ సమస్యల కారణంగా ఏర్పడిన లోటును సరిదిద్దేందుకు కోతలు విధిస్తున్నారు.
తుస్సుమన్న 24గంటల విద్యుత్ హామీ
తాను అధికారంలోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో సైతం 24గంటల (నిరంతరం) విద్యుత్ సరఫరా అందిస్తామని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన అధికారంలోకి వచ్చాక వెంటనే అమలు చేయకుండా అక్టోబరు 2 నుంచి రాష్ట్రమంతా అమలు చేస్తామని ప్రకటించారు. ఆతరువాత వెనక్కి తగ్గిన ఆయన కేవలం 9 మున్సిపాలిటీలు, 39 మండలాలతో సరిపెట్టి జిల్లా ప్రజల ఆశలపై నీళ్లు చల్లారు. చివరకు ఫిబ్రవరి నుంచి అడపాదడపా అనధికారికంగా విద్యుత్ కోతలు అమలు చేస్తూ వచ్చారు. ఇప్పుటు లోటు కారణంగా నాలుగు రోజుల నుంచి విద్యుత్ కోత వేళలు పెంచారు.
ఏడు గంటలు ఉత్తిమాటే..
జిల్లాకు రోజుకు 1.20కోట్ల యూనిట్ల విద్యుత్ అవసరం కాగా కోటి యూనిట్లలోపు వస్తోంది. ఇందులో మరో 14లక్షల యూనిట్లు లైన్‌లాస్ అవుతోంది. దీంతో కర్నూలు నగరం, మున్సిపాలిటీ పట్టణాలు మినహా మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు గంటలకు పైగా కోతలు విధించారు. వ్యవసాయానికి నిబంధన ప్రకారం రోజుకు ఇస్తున్న 7గంటల త్రీఫేజ్ విద్యుత్ సరఫరాను రెండు విడతల్లో ఇవ్వాలి. లోటు సమస్య కారణంగా ఇది సాధ్య పడడం లేదు. జిల్లా వ్యాప్తంగా 450 ఫీడర్లు ఉండగా బుధవారం కేవలం నాలుగైదు గంటలు తప్ప ఏడు గంటలు ఇవ్వలేదని రైతులు వాపోతున్నారు.
‘కట్’ కట!
Published Thu, May 28 2015 4:07 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement