అన్నదాతకు షాక్!
పరిగి: అన్నదాతకు అర్ధరాత్రి కరెంట్ కష్టాలు షురువయ్యాయి. ఇటీవలి వరకు తెల్లవారుజామున ఓ దఫా.. మరో దఫా పగలు సరఫరా చేస్తూ వచ్చిన విద్యుత్ అధికారులు సోమవారం నుంచి కరెంట్ వేళలు మార్చేశారు. గతంలో తెల్లవారు జామున సరఫరా చేసే కరెంట్‌ను ప్రస్తుతం అర్ధరాత్రి 12 గంటలకు సరఫరా చేయనున్నారు. ఇదేమంటే ఉన్నతాధికారుల సూచనల మేరకు ఓ దఫా సమయాన్ని అర్ధరాత్రికి మార్చామని అధికారులు పేర్కొంటున్నారు.
రైతులకు 7 గంటల కరెంట్ ఇవ్వలేం ఆరు గంటలు మాత్రం ఇస్తామని కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం ప్రకటించింది. సర్కారు ప్రకటన వాస్తవ విరుద్ధంగా ఉందని రైతులు అవస్థలు చూసిన వారెవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఆయా విద్యుత్ సబ్‌స్టేషన్లకు చెందిన ఫీడర్లలో ఇటీవలి వరకు కొన్నింటిలో ఉదయం 3 నుంచి 6 గంటల వరకు, తిరిగి మ్యధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు, మరో వారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తిరిగి రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు రోజుకు ఆరు గంటల విద్యుత్ సరఫరా చేస్తూ వచ్చారు.
ప్రస్తుతం మారిన వేళల ప్రకారం అర్ధరాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు తిరిగి ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు సరఫరా చేయనున్నారు. దీంతో రైతులు అర్ధరాత్రి కష్టాలు మొదలయ్యాయి. కరెంట్ కోసం రాత్రిపూట వ్యవసాయ పొలాల వద్ద
కంటిమీద కునుకు లేకుండా ఉండాల్సిందే. అర్ధరాత్రి విష కీటకాల బారిన పడటంతో పాటు విద్యుత్ ప్రమాదాల భయంతో రైతులు వణికే పరిస్థితులు దాపురించాయి.
సరఫరా చేస్తోంది 3 నుంచి 4 గంటల కరెంటే
ప్రభుత్వం రైతులకు ఆరు గంటల కరెంటు సరఫరా చేస్తున్నామని చెబుతున్నప్పటికీ వాస్తవంగా 3 నుంచి 4 గంటల కరెంటే సరఫరా అవుతోంది. సరఫరా అయ్యే సమయంలో ఐదు నుంచి పదిసార్లు కరెంట్ పోయి వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. సరఫరా అవుతున్న కరెంటు కూడా లో ఓల్టేజితో రావడంతో మోటార్లు, స్టార్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయి. కరెంటు కూడా వచ్చీ పోతుండడంతో పొలానికి నీళ్లు పారించడం రైతులకు గగనంగా మారుతోంది. పదే పదే కరెంటు పోతుండడంతో పారించిన పొలాన్నే తిరిగి పారించాల్సి వస్తుందని దీంతో రోజులో నాలుగు గుంటల భూమికంటే ఎక్కువ పారించలేకపోతున్నామని పరిగికి చెందిన ఓ రైతు ఆవేదన వ్యక్తంచేశాడు. కరెంట్‌ను నమ్ముకుంటే వ్యవసాయం చేయలేమని కనీసం జనరేటరైనా కొందామని వికారాబాద్‌లోని ఓ దుకాణానికి వెళితే రూ. 80 వేలు ధర చెప్పడంతో చేసేదిలేక తిరిగి వచ్చానని మరో రైతు తన ఆందోళన వ్యక్తం చేశాడు.
ఆయిల్ ఇంజిన్లు, జనరేటర్లను ఆశ్రయిస్తున్న రైతులు
కరెంటు కోతల కారణంగా రైతులు ఆయిల్ ఇంజిన్లను ఆశ్రయించాల్సి వస్తోంది. కొంత డబ్బు వెచ్చించే స్థోమత ఉన్న రైతులు జనరేటర్లను ఆశ్రయిస్తున్నారు. అయినప్పటికీ పొలం బాగా బీటలు వారి ఉండడంతో ఒక్కో ఎకరం నీరు పారించడానికి రెండు రోజులు ఆయిల్ ఇంజిన్‌ను నడిపించాల్సివస్తోంది. గంటసేపు వీటిని నడిపించాలంటే డీజిల్‌కు రూ. 130 ఖర్చవుతోందని పరిగికి చెందిన ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎకరా పొలానికి నీరు పారించడం కోసం రైతులు వేల రూపాయలు వెచ్చించాల్సి వ స్తోంది. కరెంటు వస్తూ పోతూ ఉండడంతో ఓ వ్యక్తి స్టార్టర్ వద్దే పట్టుకొని ఉండాల్సి వస్తుందని మల్లెమోనిగూడకు చెందిన ఓ రైతు వాపోయాడు.
ట్రాన్స్‌ఫార్మర్ కాలితే పంట ఎండాల్సిందే..
ఇటీవల కరెంటు వస్తూ పోతూ (ట్రిప్ అవుతుండటం)ఉండడంతో పాటు వచ్చిన కరెంటు కూడా లో ఓల్జేజితో వస్తుండడంతో స్టార్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు కాలిపోతున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయిన వెంటనే అధికారులు స్పందించకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. మరోవైపు మోటార్లు పదే పదే కాలిపోతుండడంతో వాటి మరమ్మతులకు వేలకు వేలు ఖర్చుచే యాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో అధికారులు స్పందించకపోవడంతో రైతులే చందాలు వేసుకొని బాగు చేయించుకుంటున్నారు.