కరెంట్ కోతలపై రైతుల కన్నెర్ర
ఇద్దరు ఆత్మహత్యాయత్నం
చింతకాని/ నెల్లికుదురు/ మహబూబాబాద్ రూరల్/పెద్దేముల్: వ్యవసాయానికి సరఫరా చేస్తున్న కరెంట్‌లో అంతరాయంపై రైతన్నలు ఆగ్రహించారు. ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో ఆందోళనలు, రాస్తారోకోలకు దిగారు. ఇద్దరు రైతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట మంగళవారం రైతులు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. పదిరోజుల నుంచి వ్యవసాయానికి పగటి పూట ఇచ్చే ఆరు గంటల విద్యుత్ సరఫరాను సక్రమంగా ఇవ్వటం లేదని అధికారులపై ధ్వజమెత్తారు. సబ్‌స్టేషన్ ఆపరేటర్లను బయటకు పం పించి గేటుకు తాళాలు వేసి బైఠాయించారు. సీతంపేట గ్రామానికి చెందిన కౌలురైతు షేక్ ఇమామ్ సాహెబ్ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడంతో రైతులు అడ్డుకున్నారు.
కూసుమంచి సబ్‌స్టేషన్‌లో మరమ్మతులు జరుగుతుండటంతో విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయని, ఇకనుంచి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు చేపడతామని ఏఈ హామీ ఇవ్వటంతో రైతులు ధర్నా విరమించారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలంలోని వివిధ గ్రామాల రైతులు మంగళవారం నెల్లికుదురు మండలం ఆలేరు విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట సుమారు నాలుగు గంటల పాటు రాస్తారోకో జరిగింది. రంగారెడ్డి జిల్లా పెద్దేముల్‌కు చెందిన రైతు బ్యాగరి నర్సప్ప మండలంలోని బుద్దారం పంచాయతీ గ్రామశివార్లలో తనకు ఉన్న 8 ఎకరాల పొలం లో అరటి పంటతో పాటు ఎకరా పొలాన్ని కౌలుకు తీసుకొని అందులో ఉల్లి పంట సాగుచేశాడు. ఈ క్రమంలో 20 రోజులుగా కరెంటు సమస్య వేధిస్తోంది.
సాగు చేసిన అరటి, ఉల్లి పంటలు ఎండిపోతుండటంతో ఆందోళనకు గురయ్యాడు. పెద్దేముల్ తండా మార్గంలోని ఓ ప్రైవేట్ సెల్ టవర్ పైకి ఎక్కాడు. ఆత్మహత్య చేసుకుంటానంటూ చెప్పాడు. రూ.4 లక్షల అప్పులు చేసి అరటి, ఉల్లి పంటలు సాగుచేశానని, కరెంటు సక్రమంగా లేకపోవడంతో పంటలు ఎండిపోయాయన్నాడు. సెల్‌టవర్‌పైనుంచి దూకి చచ్చిపోతానంటూ వాపోయాడు. వెంటనే పెద్దేముల్‌కు చెందిన నాయకుడు ప్రకాష్‌రెడ్డి, నర్సప్ప సోదరుడు వెంకటయ్యతోపాటు పలువురు కిందికి దిగాలంటూ రైతుకు సూచించారు. గంటసేపు తర్వాత రైతు నర్సప్ప సెల్‌టవర్ పైనుంచి కిందికి దిగివచ్చాడు.