నెల్లిమర్ల రూరల్: విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఉద్యోగాలు అమ్మబడును...ఒక్కో ఉద్యోగం రూ.ఆరు లక్షలు మాత్రమే అంటూ ప్లకార్డులను ప్రదర్శించి విన్నూత నిరసనకు దిగారు నెల్లిమర్ల మండలం రామతీర్థం పంచాయతీ డి.నెలివాడకు చెందిన యువత. విషయంలోకి వెళితే.. గ్రామంలో ఇటీవలే సబ్‌స్టేషన్‌ను కొత్తగా నిర్మించారు. స్థల సేకరణ చేసేటప్పుడు గ్రామానికి చెందిన చందక అప్పలనాయుడు అనే రైతు కుటుంబంలో ఒకరికి సబ్‌స్టేషన్‌లో ఉద్యోగం ఇప్పించేలా చూస్తామని.. అలాగే ఐటీఐ చేసిన స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగాల భర్తీలో ప్రాధాన్యం కల్పిస్తామని కొంతమంది టీడీపీ నాయకులు అప్పటిలో నమ్మబలికి స్థలాన్ని తీసుకున్నారు.
అయితే కొద్ది రోజుల కిందట సబ్‌స్టేషన్‌లోని పోస్టులు అమ్ముకున్నారన్న వార్తలు రావడంతో యువత గురువారం స్థానిక సబ్‌స్టేషన్ వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్థలం ఇచ్చిన అప్పలనాయుడు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పిన నాయకులు మాటతప్పారన్నారు. అలాగే పోస్టుల భర్తీలో యువతకు ప్రాధాన్యం ఇవ్వకుండా అమ్ముకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. అధికార పార్టీకి చెందిన ఓ నియోజకవర్గ నాయకుడు పోస్టులు అమ్ముకున్నారని ఆరోపించారు. అధికారులు స్పం దించి నిరుద్యోగులకు న్యాయం చేయకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక యువత నరేష్, సంతోష్, ధనుంజయ, సురేష్, రామునాయుడు, అప్పలనాయుడు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment