అదుపులోకి తీసుకున్న నిందితులతో పోలీసులు
బొబ్బిలి రూరల్: మండలంలోని పారాది గ్రామంలో గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కలిశెట్టి వెంకటరమణ కేసు మిస్టరీ వీడింది. వెంకటరమణను భార్య లలితకుమారి, ఆమె ప్రియుడు రసిల్లి నరసింగరావు(బాలు) కలిసి హతమార్చినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరిని అరెస్టు చేసి శనివారం బొబ్బిలి పోలీసుస్టేçషన్ ఆవరణలో మీడియా ముందు ప్రవేశపెట్టి, కోర్టుకు తరలించారు. పట్టణ సీఐ ఎం.నాగేశ్వరరావు తెలిపిన వివరాలు.. లలితకుమారికి వెంకటరమణతో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది.
గ్రామానికి చెందిన నరసింగరావుతో కొద్ది సంవత్సరాలుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య వివాదం గతంలో రేగింది. ఘటన జరిగిన గురువారం రాత్రి 10గంటల సమయంలో భర్త నిద్రిస్తున్న సమయంలో లలితకుమారి సెల్‌కు ప్రియుడు మెసేజ్ పెట్టాడు. కలుసుకుందామని మెసేజ్ చేయడంతో లలితకుమారి వీడియోకాల్ చేసి మాట్లాడుకుని అనుకున్న మేరకు ఇంట్లో కలిశారు. వంటగదిలో వీరు ఉన్న సమయంలో భర్తకు మెలుకువ వచ్చి చూడడంతో ఈ సమయంలో ఏం చేస్తున్నావని ప్రశ్నించాడు. తరువాత నరసింగరావును గుర్తించి, భార్య, ఆమె ప్రియుడుని ఆగ్రహంతో కొట్టాడు.
వారు ప్రతిదాడి చేసి వెంకటరమణను గాయపరిచి, గోడకు గుద్దారు. అనంతరం భార్య చున్నీతో భర్త వెంకటరమణను ఉరి తీసి చంపేసారు. మృతదేహాన్ని ఇంట్లో ముందర గదిలో ఉంచేసి, ప్రియుడు పరారీ అయ్యాడు. రాత్రి సమయంలో లలితకుమారి తన బావ అప్పలనాయుడుకు తన భర్త గుండెపోటుతో చనిపోయాడని బుకాయించింది. రెండు ట్యాబ్లెట్లు ఇచ్చానని చెప్పడంతో అప్పలనాయుడు, స్థానికులతో కలిసి వచ్చి చూసి ఉదయం దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు.
మృతదేహానికి స్నానం చేయిస్తున్న సమయంలో గాయాలు గమనించిన బంధువులు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ నాగేశ్వరరావు సిబ్బందితో గ్రామంలో విచారణ చేపట్టారు. దీంతో లలితకుమారి, నరసింగరావులను శనివారంఅరెస్టు చేసి కోర్టుకు తరలించారు. కోర్టు వీరికి రిమాండ్ విధించింది.
ఇదిలా ఉండగా నరసింగరావు సీతానగరం, పార్వతీపురం ప్రాంతాల్లో ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. వీరి ప్రేమ వ్యవహారంలో లలితకుమారి, వెంకటరమణ తరచూ గొడవలు పడి లలితకుమారి పలుసార్లు పుట్టింటికి వెళ్లినట్టు గ్రామస్తులు తెలిపారు. నరసింగరావు, లలితకుమారి ఎక్కడికైనా వెళ్లిపోదామని ప్రతిపాదనలు చేసినట్టు పోలీసులు తెలిపారు.
రోడ్డున పడ్డ పిల్లలు
వెంకటరమణ హత్యకు గురి కాగా, లలితకుమారి అరెస్టు కావడంతో అభం శుభం తెలియని ఐదేళ్ల బాబు హర్షవర్దన్, ఏడాదిన్నర పాప యశస్విని రోడ్డున పడ్డారు. వీరిని బంధువుల పర్యవేక్షణలో ఉంచారు. వీరి పరిస్థితి ఏమిటన్నదీ అందరినీ కలచివేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment