నేరడ మోడల్ స్కూల్‌లో గ్యాస్ సిలిండర్ లీక్
చెలరేగిన మంటలు
పదో తరగతి విద్యార్థినికి స్వల్ప గాయాలు
మంటలను ఆర్పిన విద్యుత్ సబ్‌స్టేషన్ సిబ్బంది
నేరడ(కురవి) : మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని నేరడ గ్రామంలో ఉన్న మోడల్ స్కూల్ ఆవరణలోని బాలికల వసతిగృహంలో గురువారం రాత్రి గ్యాస్ సిలిండర్‌కు ఉన్న పైప్ లీకై మంటలు చెలరేగిన సంఘటన చోటుచేసుకుంది. కురవి ఎస్సై తీగల అశోక్, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.... నేరడ మోడల్ స్కూల్ ఆవరణలో బాలికల వసతిగృహం ఉంది. గురువారం రాత్రి బాలికలకు భోజనాల కోసం వంట మనుషులు వంటలను వండుతున్న క్రమంలో సిలిండర్, స్టౌకు ఉన్న పైప్ లీకైంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్కూల్ ఎదురుగా ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్‌లో పనిచేసే సిబ్బంది పరుగున చేరుకుని మంటలను ఆర్పివేశారు.
ఈ ఘటనలో పదో తరగతి విద్యార్థిని ఝాన్సీకి స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన విషయం తెలుసుకున్న కురవి ఎస్సై తీగల అశోక్ హుటాహుటిన వసతిగృహం వద్దకు చేరుకుని విద్యార్థులకు మనోధైర్యం చెప్పారు. ఎంఈఓ ఇస్లావత్ లచ్చిరాంనాయక్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గ్యాస్ పైప్ లీకై మంటలు చెలరేగినప్పటికీ విద్యుత్ సిబ్బంది సకాలంలో వచ్చి మంటలను ఆర్పి వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.