దర్శి : తమ ప్రాణాలు పోయినా సరే స్థలాలను వదిలేది లేదని తహశీల్దార్ కార్యాలయంలో రాజంపల్లికి చెందిన దళితులు మంగళవారం తహశీల్దార్ సిద్ధయ్య వద్ద ఆవేదన వెళ్లగక్కారు. ‘గ్రామ సర్వే నెంబర్ 227లో 4.73 ఎకరాల భూమిలో 97 మందికి 3 సెంట్ల చొప్పున 1998 నవంబర్ 4న తమకు ఇళ్ల పట్టాలు ఇచ్చినా పొజిషన్ చూపలేదని, 2011లో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం స్థలాలను రివైజ్ చేసి తమకు మరోసారి రెండు సెంట్ల చొప్పున స్థలాలను కేటాయించారని, దీనిపై హైకోర్టు కూడా తమకు అనుకూలంగానే స్పందించిందని, గతంలో ఆ స్థలాలను ఆక్రమించిన రైతులు ఆగ్రహించి తమను మూడు నెలల పాటు గ్రామం నుంచి బహిష్కరించారని, ఆ రెండు సెంట్ల స్థలానికైనా పట్టాలిచ్చి పొజిషన్ చూపించాలని’ సోమవారం ఒంగోలులో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో కలెక్టర్‌కు అందజేసిన అర్జీలో తెలిపారు.
ఆ విషయాన్ని పత్రికల్లో చూసిన ఆ గ్రామ టీడీపీ నాయకులు వెంటనే ‘ఈ స్థలం ప్రభుత్వానిది, ఆక్రమించిన వారు శిక్షార్హులు’ అని ఓ బోర్డును తలారీతో పాతించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంగళవారం ఉదయం దళితులు ఆ స్థలాల వద్ద ఆందోళనకు దిగారు. తమకు పంపిణీ చేసిన స్థలంలో పొజిషన్ చూపకపోగా 16 ఏళ్ల నుంచి పెట్టని బోర్డు కలెక్టర్‌కు అర్జీ ఇచ్చిన తెల్లవారుజామున 8గంటల్లోపే పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఆ బోర్డును పీకేశారు. అనంతరం 97 మంది మండల కార్యాలయానికి వెళ్లి తహశీల్దార్‌ను ప్రశ్నించారు. ఈ సర్వే నెంబర్‌లోనే టీడీపీ నాయకుడు వరిగడ్డి వాములు వేసుకొని అరెకరా ఆక్రమించుకున్నా బోర్డు ందుకు పెట్టలేదన్నారు. సుమారు 570 ఎకరాలు అన్యాక్రాంతమైనా నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
దళితులకు ఒక న్యాయం, టీడీపీ నాయకులకు మరో న్యాయమా అని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తహశీల్దార్ దళితులతో మాట్లాడుతూ ఆ స్థలాల్లో గుడిసెలు వేయవద్దని, రెండు రోజుల్లో తాము వచ్చి పరిశీలించి అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగారు. తహశీల్దార్ వద్ద దళితులు తమ గోడు వెళ్లబోసుకుంటున్న సమయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు అక్కడే కూర్చున్నా చాలాసేపు నోరు మెదపకపోవడం గమనార్హం.
ఆ స్థలాలను వదిలేది లేదు
Published Wed, Aug 13 2014 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 11:47 AM
Advertisement
Advertisement