పట్టాలెక్కని మెట్రో ప్రాజెకు
విజయవాడ నగరంలో మెట్రోరైలు ప్రాజెక్టు పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. టెండర్లు ఖరారు చేసేలోగా భూసేకరణ పూర్తి చేయాలని జిల్లా అధికార యంత్రాంగం భావించింది. అయితే సేకరణ ప్రక్రియకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీంతో సకాలంలో మెట్రో పనులు పూర్తి అవుతాయా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సాక్షి, విజయవాడ : విజయవాడలో బందరురోడ్డు, ఏలూరు రోడ్డులో మెట్రో రైలు మార్గం నిర్మాణానికి 75 ఎకరాల భూమి అవసరం అవుతుందని తొలుత అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్(ఏఎంఆర్‌సీ)అధికారులు భావించారు. చివరకు 68.32 ఎకరాలకు కుదించారు. ఇందులో 61.23 ఎకరాలు నిడమానూరులో కోచ్ డిపోల కోసం, 2.57 ఎకరాలు పెనమలూరులో ఎలక్ట్రికల్ స్టేషన్ కోసం సేకరిస్తారు. మిగిలిన 4.52 ఎకరాలు నగరంలో సేకరించాల్సి ఉంది.
భూ సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చి, ఇటీవల ప్రజాభిప్రాయసేకరణకు సమావేశాలు నిర్వహిస్తే భూ యజమానులు అధికారుల ఎదుట ఆత్మహత్మలకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా అధికారపార్టీ నేతకు చెందిన బహుళ అంతస్తుల సముదాయాన్ని కాపాడేందుకు చిన్న వ్యాపారస్తుల కడుపు కొడుతున్నారంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. నగరంలో మెట్రో రైలు అవసరం లేదని వాదించారు. అంతేకాక భూసేకరణపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అధికారులు అమ్ముడు పోయారంటూ బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. మరి కొంతమంది దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని భావిస్తున్నారు. దీంతో భూసేకరణ రెవెన్యూ అధికారులకు ఇబ్బందిగానే మారింది.
అప్పులతోనే నిధులు సేకరణ....
మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి రూ.7,200 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ మొత్తంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 20 శాతం భరిస్తాయి. మిగిలిన 60 శాతం ఏఎంఆర్‌సీ అప్పుగా సేకరించుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తమ వాటాగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. భూసేకరణ పూర్తయి పనులు ప్రారంభించిన తరువాత ఆ సొమ్ము వచ్చే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం తన వాటాలో ఇప్పటి వరకు కేవలం రూ.300 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. మిగిలిన సొమ్మును ఆర్థిక సంస్థల నుంచి అప్పుగా తీసుకొనేందుకు జీవో జారీ చేసింది. ఏఎంఆర్‌సీ వాటా 60శాతం నిధులు కోసం జపాన్, జర్మనీ, ఫ్రాన్స్‌లోని ఆర్థిక సంస్థల ప్రతినిధులతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. టెండర్లు పూర్తయ్యేనాటికి ఆర్థిక సంస్థలతో ఒప్పందాలు పూర్తయి నిధులు ఎంతమేరకు వస్తాయనేది అనుమానమే. భూ సేకరణకు సుమారు రూ.450 కోట్లు అవసరం. ప్రస్తుతం ఉన్న సొమ్ము భూసేకరణకు సరిపోదు. దీంతో ఆర్థిక సంస్థల నుంచి అప్పు తీసుకుంటే కానీ ప్రాజెక్టు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
నిర్ణీత సమయానికి పూర్తయ్యేనా!
మెట్రో ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2018 ఫిబ్రవరి నాటికి మెట్రో రైలు ట్రయల్‌రన్ నడపాలనే ఉద్దేశంతో 2015 ఏప్రిల్‌లో పనులు ప్రారంభించారు. ఇప్పటివరకు టెండర్లు ఖరారు కాలేదు. ఫిబ్రవరి నెలాఖరుకు ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ లోగా భూసేకరణ చేసి భూమి అప్పగించే నాటికి కనీసం మరో మూడు, నాలుగు నెలలు పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మెట్రో రైలు నిర్మాణానికి కేవలం 10 నెలలే వ్యవధి ఉంటుంది. ఆ తరువాత కనీసం నాలుగేళ్లకు పనులు పూర్తవుతాయని ఏఎంఆర్‌సీ అధికారులు చెబుతున్నారు. దాంతో మెట్రో రైలు నిర్మాణ వ్యయం పెరిగిందని తిరిగి ప్రాజెక్టు అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచే అవకాశం లేకపోలేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.