‘మెట్రో రైలు’ కదిలింది | 'Metro' moved | Sakshi
Sakshi News home page

‘మెట్రో రైలు’ కదిలింది

Published Wed, Aug 20 2014 2:42 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

‘మెట్రో రైలు’ కదిలింది - Sakshi

‘మెట్రో రైలు’ కదిలింది

  •    డీపీఆర్ కోసం రూ.25 కోట్లు  
  •    ఉడాకు బాధ్యతలు
  •    కేంద్రప్రభుత్వ నిధులు మంజూరు
  •    టెండర్లు ఆహ్వానించిన ఉడా
  •    సెప్టెంబర్ తుదిగడువు
  • సాక్షి, విజయవాడ :   మెట్రో రైలు ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది. దీనికి సంబంధించి డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్) తయారీ బాధ్యతలను వీజీటీఎం ఉడాకు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ క్రమంలో ఉడా అధికారులు టెండర్లు ఆహ్వానించారు. ఇప్పటికే ఉడా అధికారులు మెట్రో రైలుకు ఇక్కడ అనుకూలంగా ఉందని.. నాలుగు ప్రాంతాల్లో మెట్రో రైలు మార్గం నిర్మిస్తే రాకపోకలు మరింత సులువు కావడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నివేదిక పంపారు.

    ఈ క్రమంలోనే డీపీఆర్ తయారీకి ఉడా టెండర్లను ఆహ్వానించింది. సెప్టెంబర్ 1వ తేదీన టెండర్ల దాఖలుకు తుది గడువుగా నిర్ణయించారు. విజయవాడను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక రాజధానిగా ప్రకటించిన క్రమంలో  విశేష ప్రాధాన్యం పెరిగింది. ఈ క్రమంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు విజయవాడకు తరలి రానున్నాయి.  ఈ నెలాఖరు నాటికి 11 ప్రభుత్వ శాఖలు గన్నవరం కేంద్రంగా కార్యకలాపాలు మొదలుపెట్టే అవకాశం ఉంది. దీంతో మెట్రో ప్రాజెక్టుకు ప్రాధాన్యత పెరిగింది.

    గతంలో కేంద్ర ప్రభుత్వం వీజీటీఎం ఉడా పరిధిలో మెట్రో రైలు నడిపేందుకు సుముఖత వ్యక్తం చేసింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ  మంత్రి వెంకయ్యనాయుడు మెట్రో ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తామని ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర   పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సుధీర్‌కృష్ణ ఉడా పరిధిలోని విజయవాడ, గుంటూరు జిల్లాల్లో పర్యటించడంతో పాటు ఉడా కార్యాలయంలో  రెండు జిల్లాల అధికారులతో పాటు విశాఖపట్నం జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత వీజీటీఎం ఉడాను మెట్రో వ్యవహరంపై నివేదిక పంపాల్సిందిగా ఆదేశించారు. ఉడా అధికారులు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆదేశాలకు అనుగుణంగా  నివేదిక పంపారు.

    ఈ పరిణామాల క్రమంలో గత వారంలో మెట్రోను ఖరారు చేస్తూ కేంద్రం ఆమోదముద్ర వేసి డీపీఆర్ తయారీ బాధ్యతలను ఉడాకు కేటాయించి దీని కోసం రూ.25 కోట్లు నిధులు మంజూరు చేసింది. తొలిదశలో 49 కిలోమీటర్లు మెట్రో నిర్మించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో గతంలో ఉడా అధికారులు నాలుగు మార్గాలను నిర్ణయించి ప్రతిపాదనల్లో సూచించారు.  
     
    డీపీఆర్ తయారీకి ఏడాది...
     
    డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారీకి ఏడాది కాలవ్యవధి నిర్ణయించారు. ఉడా నేతృత్వంలో డీపీఆర్ కోసం మూడు రోజుల కిత్రం టెండర్లు ఆహ్వానించారు. అయితే తొలిదశలో టెండర్ల ప్రకియ ద్వారా కంపెనీ ప్రొఫైల్‌ను సమర్పించాలని కోరారు. డీపీఆర్‌ను తయారు చేయటానికి టెండర్లు దాఖలు చేసే కంపెనీలు ముందుగా తమ ప్రొఫైల్‌ను ఉడాకు సెప్టెంబర్ 1 వతేదీ సాయంత్రం 5 గంటల లోపుగా సమర్పించాలని దానికి అనుగుణంగా అర్హత ఉన్న కంపెనీలు సెప్టెంబర్ 1  సాయంత్రం 5 గంటల లోపుగా టెండరు దారులు దరఖాస్తులు దాఖలు చేయాలని టెండర్ ప్రకటన జారీ చేశారు. దీనికి అనుగుణంగా రెండో విడత టెండర్లును ఆహ్వానించి తక్కువ ధరకు టెండర్లు దాఖలు చేసిన కంపెనీకి డీపీఆర్ తయారీ బాధ్యతలను అప్పగించనున్నారు.
     
    259 కిలోమీటర్ల మార్గాన్ని ప్రతిపాదించిన ఉడా
     
    ఉడా పరిధిలో మొత్తం 259 కి.మీ పరిధిలో మెట్రోను దశల వారీగా నిర్మించాలని ఉడా అధికారులు నాలుగు మార్గాలు, ఒక సర్క్యులర్ కారిడార్‌ను ప్రతిపాదించారు. ఈ మొత్తం 259 కిలోమీటర్లుగా ఉంది. హనుమాన్ జంక్షన్ నుంచి గన్నవరం, విజయవాడ, ఇబ్రహీంపట్నం మీదుగా కంచికచర్ల వరకు మొత్తం 80 కి.మీ పరిధిలో ఒక మార్గంను ప్రతిపాదించారు. హనుమాన్‌జంక్షన్ నుంచి మరో 15 కిలోమీటర్లు లైన్ వేస్తే ఏలూరు వరకు మెట్రో విస్తరిస్తుం ది. అలాగే పామర్రు నుంచి విజయవాడ వరకు 40 కిలోమీటర్లు రెండో ప్రతిపాదన చేశారు. విజయవాడ నగరం నుంచి గుంటూరు మీదుగా యడ్లపాడు వరకు 68 కి.మీతో మూడో ప్రతిపాదన చేశారు.

    ఇది కాకుండా విజయవాడ, మంగళగిరి గుంటూరు తెనాలి మధ్య సర్క్యులర్ కారిడర్‌కు ప్రతిపాదన  సిద్ధంచేసి పంపారు.  దీంతోపాటు గన్నవరం నుంచి గొల్లపూడి వరకు 34 కిలోమీటర్లు ఒక మార్గం, కంకిపాడు నుంచి విజయవాడ వరకు 15 కిలోమీటర్లు మరో మార్గాన్ని సూచించగా తొలివిడతలో 49 కిలోమీటర్ల మేరకు గన్నవరం నుంచి కంకిపాడు, విజయవాడ గొల్లపూడి వరకు మెట్రోను ఖరారు చేశారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement