ఏసీబీ వలలో విద్యుత్ ఏఈ
రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వీరాస్వామి
కొయ్యలగూడెం, న్యూస్‌లైన్ : ఏసీబీ వలకు శుక్రవారం గవరవరం విద్యుత్ సబ్‌స్టేషన్ ఏఈ వీరాస్వామి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ ఐ.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గవరవరానికి చెందిన రైతు గారపాటి శ్రీనివాసరావు పొలంలో ఈ నెల 22న తాడిచెట్టు కొడుతుండగా అది విరిగి 11 కేవీ విద్యుత్ వైర్లపై పడింది. దీంతో విద్యుత్ స్తంభం విరిగిపోయింది.
దానిని సరిచేయటం కోసం గవరవరం సబ్‌స్టేషన్ ఏఈ వీరాస్వామి రైతను రూ.25 వేలు లంచం అడిగాడు. రూ.5 వేలకు మించి ఇచ్చుకోలేనని శ్రీనివాసరావు బతిమాలినా ఏఈ పట్టు వీడలేదు. దీంతో శుక్రవారం అతను ఏలూరులోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు ఏఈపై వల పన్నారు. వారు రైతుకు రూ.10వేలు ఇచ్చి గవరవరంలో ఏఈ చాంబర్‌కు పంపించారు. లుంగీలు ధరించిన ఏసీబీ అధికారులు సబ్‌స్టేషన్ ఎదురుగా ఉన్న బడ్డీ కొట్టులో కూర్చున్నారు.
శ్రీనివాసరావు సెల్‌ఫోన్ ఆన్‌చేసి ఏఈతో మాట్లాడుతూ ఏసీబీ అధికారులు రసాయనం పూసి ఇచ్చిన రూ.10వేలు ఆయనకు ఇచ్చి లెక్క చూసుకోండి అని అన్నాడు. సెల్ ఫోన్‌లో వారి సంభాషణ వింటున్న ఏసీబీ అధికారులు వెంటనే సబ్‌స్టేషన్‌లోకి వచ్చారు. అప్పటికి ఏఈ చేతిలో రైతు ఇచ్చిన నోట్లు ఉన్నాయి. వాటిని ఏసీబీ అధికారలు స్వాధీనం చేసుకున్నారు.
రైతు శ్రీనివాసరావు, ఏఈ వీరాస్వామిలను డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ విల్సన్ విచారించారు. అనంతరం తాడిచెట్టు పడిన ప్రదేశం వద్దకు వారిద్దరినీ తీసుకెళ్లారు. స్థానిక రైతులను కూడా వివరాలు అడిగారు. అరెస్ట్ చేసిన ఏఈ వీరాస్వామిని శనివారం విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. తనతోపాటు అనేక మంది రైతులను ఏఈ వీరాస్వామి పీడించుకు తింటున్నారని శ్రీనివాసరావు చెప్పాడు. ట్రాన్స్‌ఫార్మర్ల మార్పు, విద్యుత్‌లైన్ల వేసే విషయంలో ఆయన చాలా మంది రైతులను లంచాల కోసం పీడించారని తెలిపాడు.