మీడియాతో మాట్లాడుతున్న హరీశ్
సాక్షి, సిద్దిపేట/గజ్వేల్: ‘కరువుతో అల్లాడిన తెలంగాణ రైతులు.. మీరు చేసే పనులు త్వరగా పూర్తయితే సాగుజలాలు తమ పొలాల్లోకి వస్తాయని ఆశగా చూస్తున్నారు. అన్నదాత ఆశలను త్వరగా తీర్చేందుకు మీరు పనుల్లో వేగం పెంచాలి’అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఇంజనీరింగ్ అధికారులు, రంగనాయకసాగర్ ప్రాజెక్టు కాంట్రాక్టర్లను ఆదేశించారు. బుధవారం సిద్దిపేట జిల్లా చంద్లాపూర్‌లో నిర్మిస్తున్న రంగనాయకసాగర్ రిజర్వాయర్, టన్నెల్, విద్యుత్ సబ్‌స్టేషన్ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అక్కడ పనిచేసే కార్మికులు, అ«ధికారులు, కాంట్రాక్టర్లతో మాట్లాడారు. 90 కిలోమీటర్ల దూరం నుంచి టన్నెల్ పనులు వేగంగా చేస్తున్నారని, చివరగా ఉన్న పనులను వేగవంతం చేయాలని సూచించారు. రిజర్వాయర్ కట్ట పనుల్లో వేగం పెంచాలని, రాతి కట్టడం పనుల్లో జాప్యం జరుగుతోందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సబ్‌స్టేషన్ పనులు పరిశీలించారు.
ప్రభుత్వ పనితీరుకు మార్కెట్‌లే నిదర్శనం
రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు రాష్ట్రంలో ఉన్న మార్కెట్‌లు, వాటి పనితీరు, ఉత్పత్తుల కొనుగోళ్లే నిదర్శనమని మంత్రి అన్నారు. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్‌కు ఐఎస్‌ఓ–9001 అవార్డు రావడంపై మంత్రి విలేకరులతో మాట్లాడుతూ హర్షం వ్యక్తంచేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నూతన గోదాంలు నిర్మించామని, దీంతో రైతుల ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు, మద్దతు ధరకు అమ్ముకునేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈనామ్ పద్ధతిని అమలు చేయడంలో దేశంలో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ ముందు వరుసలో ఉండటం తెలంగాణకే గర్వకారణమన్నారు.
కాంగ్రెసోళ్లు ఉంటే ఇన్ని పనులు జరిగేవా?
‘ఇన్నేండ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీలు.. ఏ ఒక్క రోజు కూడా రైతుల గురించి ఆలోచించలే. ఇయ్యాల కేసీఆర్ అన్నదాతల కోసం నిరంతరం పరితపిస్తూ సాహసోపేతంగా ‘రైతుబంధు’పేరిట పెట్టుబడి సాయం పథకం తీసుకొచ్చిండు. ఈ పథకం చూసి దేశమంతా ముక్కున వేలేసుకుంటోంది’అంటూ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. బుధవారం సాయంత్రం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిర్వహించిన ‘రైతు బంధు’అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో కరెంటు, నీళ్ల కోసం రైతులు పడ్డ కష్టాలు శాశ్వతంగా తీరిపోయాయన్నారు. 70 ఏళ్లలో జరగని పనులెన్నో ఈ మూడేళ్లలో చేసి చూపించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 58 లక్షల మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలతో పాటు పెట్టుబడి సాయం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మే 10 నుంచి 17 వరకు పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ భూంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment