చంద్రబాబు సర్కారు బిల్లుల బాదుడు, నయవంచక పాలనపై సర్వత్రా మండిపాటు
పెంచిన కరెంట్ చార్జీలను తక్షణం రద్దు చేయాల్సిందే
ఇప్పటికే మోపిన రూ.6,072.86 కోట్ల చార్జీల భారాన్ని వెనక్కి చెల్లించాలి
జనవరి నుంచి మరో రూ.9,412.50 కోట్ల బాదుడును రద్దు చేయాలి
ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను పునరుద్ధరించాలి
ప్రభుత్వ వేధింపులు.. పోలీసుల బెదిరింపులకు వెరవకుండా ఉవ్వెత్తున ఉద్యమం
చార్జీల భారంతో అల్లాడుతున్న ప్రజలకు మద్దతుగా నిలిచిన వైఎస్సార్‌సీపీ నేతలు
రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలకు ఉప్పెనలా కదలివచ్చిన జనం
ప్రజలతో కలిసి ఎక్కడికక్కడ విద్యుత్ అధికారులకు డిమాండ్ పత్రాలను అందజేసిన నేతలు
కరెంటు చార్జీల బాదుడును నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన పోరుబాట విజయవంతం
బాబు పాలనపై ప్రజా వ్యతిరేకతను నిరసన ర్యాలీలు ప్రతిబింబించాయన్న రాజకీయ పరిశీలకులు
రైతు పోరు తరహాలో విద్యుత్ ఉద్యమం విజయవంతమవడంతో పార్టీ శ్రేణుల్లో కదనోత్సాహం
సాక్షి, అమరావతి: కరెంట్ చార్జీలను పెంచబోమని... ఇంకా తగ్గిస్తామని ఎన్నికల్లో నమ్మించి అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలోనే రూ.15,485.36 కోట్ల షాకులిచ్చిన సీఎం చంద్రబాబు మోసాలపై ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. టీడీపీ కూటమి సర్కారు విద్యుత్తు చార్జీల బాదుడుపై నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. ప్రభుత్వ వేధింపులు.. పోలీసుల బెదిరింపులకు వెరవకుండా.. నయవంచన పాలనను నిరసిస్తూ కిరోసిన్ లాంతర్లతో జన వాహిని కదం తొక్కింది. కరెంటు చార్జీలు పెంచి ఇప్పటికే వసూలు చేస్తున్న రూ.6,072.86 కోట్లను తిరిగి వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జనవరి నుంచి మోపనున్న రూ.9,412.50 కోట్ల భారాన్ని రద్దు చేయకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కూటమి సర్కారు మంగళం పాడిన ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని తక్షణమే పునరుద్ధరించాలని నినదించారు. ‘ఓటు’ దాటాక హామీలను తగలేయడాన్ని నరనరాన జీర్ణించుకున్న చంద్రబాబు మోసాలను ఎండగడుతూ విద్యుత్తు బిల్లుల బాదుడుకు నిరసనగా వైఎస్సార్ సీపీ శుక్రవారం నిర్వహించిన పోరుబాటకు ప్రజలు ఉప్పెనలా కదలివచ్చారు.
పోలీసుల ఆంక్షలకు వెరవకుండా కిరోసిన్ లాంతర్లు చేతబట్టి కూటమి ప్రభుత్వం చేసిన దగాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంట్ చార్జీల పెంపును వెంటనే రద్దు చేయాలి.. నయవంచక చంద్రబాబు డౌన్ డౌన్.. అంటూ గర్జించారు. దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తూ వేలాది మంది కిలోమీటర్ల తరబడి విద్యుత్ శాఖ కార్యాలయాల వరకూ ర్యాలీగా కదిలి వచ్చారు. విద్యుత్ కార్యాలయాల వద్ద నిరసనలు నిర్వహించి అధికారులకు డిమాండ్ పత్రాలను అందజేశారు. ఈనెల 13న నిర్వహించిన రైతు పోరును మించి కరెంటు చార్జీల బాదుడుపై పోరుబాటలో జనం ఉద్యమించడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో కదనోత్సాహం నెలకొంది.
» కృష్ణా జిల్లాలో విద్యుత్‌చార్జీల పెంపుపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లాలో భారీ స్పందన లభించింది.
» విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాలు హోరెత్తాయి.
» శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ‘పోరుబాట’కు జనం పోటెత్తారు. బుచ్చిరెడ్డిపాళెంలో రెండు కిలోమీటర్ల మేర నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై వేలాది మందితో ర్యాలీ నిర్వహించారు.
» ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పోరుబాట నిరసన కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. ఏలూరు జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి.
» తూర్పు గోదావరి జిల్లాలో కోటిపల్లి బస్టాండ్ నుంచి విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ కార్యాలయం వరకు భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.
» పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాల్లో నిరసన ప్రదర్శనల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీలు, పాదయాత్రలు, విద్యుత్ సబ్‌స్టేషన్ల వద్ద ధర్నాలు నిర్వహించారు.
» వైఎస్సార్ జిల్లా కడపలో పార్టీ కార్యాలయం నుంచి విద్యుత్ భవన్ వరకూ ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. పులివెందులలో ఎంపీ అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లాలో విద్యుత్ పోరు కొనసాగింది.
» కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు.
» తిరుపతి నగరంలో నిరసన ర్యాలీ పద్మావతిపురంలోని భూమన కార్యాలయం నుంచి ఏపీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వరకూ సాగింది. నాయుడుపేట, చంద్రగిరి, శ్రీకాళహస్తి, గూడూరు, నాగలాపురంలో ర్యాలీలు నిర్వహించారు.
» కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నేతలు ర్యాలీగా విద్యుత్ కార్యాలయానికి చేరుకుని అధికారులకు డిమాండ్ పత్రాన్ని అందచేశాయి.
» చిత్తూరు జిల్లా పుంగనూరులో మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కూడలి నుంచి ర్యాలీగా పీఎల్‌ఆర్ రోడ్డులోని ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయానికి చేరుకుని విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలంటూ నినదించారు. చిత్తూరు, నగరి, పూతలపట్టు, కార్వేటి నగరం, పలమనేరులో నిరసన ప్రదర్శనలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment