
చెల్లించాల్సిన పారిశ్రామిక ప్రోత్సాహకాలు రూ.11,000 కోట్లు
బడ్జెట్‌లో ఊసేలేని ప్రోత్సాహకాల కార్పస్ ఫండ్
కానీ, కేటాయింపులు రూ.1,000 కోట్లు మాత్రమే
కడప స్టీల్‌ప్లాంట్‌కు ఈ ఏడాదీ ఒక్క రూపాయీ విదల్చని సర్కారు
వచ్చే ఏడాదికి నామమాత్రంగా రూ.25 కోట్లు కేటాయింపు
ఫిషింగ్ హార్బర్లు, ఫిష్‌ల్యాండ్ సెంటర్లకు రూ.4 వేలే..
పోర్టుల వద్ద అదనపు భూసేకరణకు నిధుల కేటాయింపులో ప్రాధాన్యం
సాక్షి, అమరావతి: ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై దృష్టిసారించాం.. ఇక నుంచి ఏ ఏడాది పారిశ్రామిక రాయితీలు ఆ ఏడాదే విడుదల చేస్తాం. పారిశ్రామికవేత్తలకు నమ్మకం కలిగించడం కోసం ఒక ఎస్క్రో ఖాతా తెరిచి అందులో ప్రోత్సాహక నిధులు వేస్తాం’.. అని సీఎం చంద్రబాబునాయుడు పారిశ్రామిక పాలసీల విడుదల సందర్భంగా ఘనంగా ప్రకటించుకున్నారు. కానీ, ఈ మాటలు ఆరి్థకమంత్రి పయ్యావుల కేశవ్ విన్నట్లు, చూసినట్లు లేరు.
ఎందుకంటే.. సీఎం చెప్పిన మాటలకు, బడ్జెట్‌లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు చేసిన కేటాయింపులకు ఎక్కడా పొంతనలేదు. 2025–26 బడ్జెట్‌లో స్పీడ్ ఆఫ్ బిజినెస్‌లో భాగంగా ప్రోత్సాహకాల కోసం ఎటువంటి కార్పస్ ఫండ్‌ను ఏర్పాటుచేయలేదు. పైగా.. చెల్లించాల్సిన పారిశ్రామిక ప్రోత్సాహకాలు రూ.11,000 కోట్లు ఉన్నాయని స్వయంగా బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న ఆరి్థకమంత్రి దానికి అనుగుణంగా కేటాయింపులు చేయకపోవడం గమనార్హం. పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద మొక్కుబడిగా రూ.1,000 కోట్లు మాత్రమే కేటాయించడంపై పారిశ్రామికవేత్తలు రగిలిపోతున్నారు.
గత బడ్జెట్ కేటాయింపుల్లో భారీగా కోత..
ఇక 2024–25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో పరిశ్రమల రంగానికి బడ్జెట్‌లో రూ.2,270.78 కోట్లు కేటాయిస్తే సవరించిన అంచనాల్లో ఈ మొత్తాన్ని రూ.822.81 కోట్లకు తగ్గించేశారంటే పారిశ్రామిక రంగంపై కూటమి సర్కారుకున్న ప్రాధాన్యత స్పష్టమైంది. అలాగే, వచ్చే ఆర్థిక సంవత్సరానికీ రూ.2,418.57 కోట్లు కేటాయించారు.
పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ.1,000.24 కోట్లు, ఎంఎస్‌ఎంఈల ప్రోత్సహకానికి రూ.200 కోట్లు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ.200 కోట్లు, ఫుడ్ ప్రాసెసింగ్‌కు రూ.75 కోట్లు, ఐటీ, ఎల్రక్టానిక్స్ రంగంలో రూ.3,000 కోట్లు కేటాయించారు. కడప స్టీల్ ప్లాంట్‌కు గత బడ్జెట్‌లో రూ.25 కోట్లు కేటాయించగా ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయలేదు. మళ్లీ ఇప్పుడు వచ్చే సంవత్సరానికి రూ.25 కోట్లు కేటాయించారు.
పోర్టులు, ఎయిర్‌పోర్టుల వద్ద స్థల సేకరణపై దృష్టి..
ఇదిలా ఉంటే.. మచిలీపట్నం పోర్టు వద్ద 10,070 ఎకరాల సేకరణకు రూ.150 కోట్లు, భావనపాడు (మూలపేట) పోర్టు వద్ద 6,410 ఎకరాలు సేకరించడానికి రూ.100 కోట్లు, రామాయపట్నం పోర్టు వద్ద 506 ఎకరాల సేకరణకు రూ.100 కోట్లు కేటాయిస్తూ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అలాగే..
» భోగాపురం ఎయిర్‌పోర్టు వద్ద 40 ఎకరాల భూసేకరణతో పాటు రహదారులు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడానికి రూ.190 కోట్లు కేటాయించారు.
» అదే విధంగా కుప్పం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 444 ఎకరాలు, దగదర్తి ఎయిర్‌పోర్టు వద్ద 418 ఎకరాల సేకరణకు రూ.30 కోట్లు కేటాయించారు.
» విజయవాడ ఎయిర్‌పోర్టుకు రూ.29.88 కోట్లు, కర్నూలు ఎయిర్‌పోర్టు నిర్వహణకు రూ.15.29 కోట్లు, వీజీఎఫ్ కింద విమాన సర్వీసులు నిర్వహించడానికి రూ.30 కోట్లు కేటాయించారు.
» ఇక విశాఖ–చెన్నై కారిడార్‌లో భాగంగా ఏడీబీ నిధులతో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు నామమాత్రపు కేటాయింపులు చేశారు.
» ఐటీ రంగానికి రూ.533.72 కోట్లు, నైపుణ్య శిక్షణకు రూ.462.68 కోట్లు కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment