సాక్షి,తాడేపల్లి : కరెంటు ఛార్జీల బాదుడుపై వైఎస్సార్‌సీపీ పోరుబాట పట్టింది. ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్రం కార్యాలయంలో ‘విద్యుత్ చార్జీల బాదుడుపై వైఎస్సార్‌సీపీ పోరుబాట’ పేరుతో పోస్టర్‌ను ఆవిష్కరించారు. వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన వైఎస్సార్‌సీపీ పోరుబాట కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి తదితరులు ఆవిష్కరించారు. ఆ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పాలనను ఎండగట్టారు.
రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర చంద్రబాబుది : మాజీ మంత్రి జోగి రమేష్
ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రజలకు అనేక హామీలు ఇచ్చాడు. దీనిలో భాగంగా తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీల పెంపుదల ఉండదు అని ప్రజలను నమ్మించాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే వేల కోట్ల రూపాయల విద్యుత్ చార్జీల భారంను ప్రజలపై మోపుతున్నాడు. గతంలోనూ విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రజలను అనేక కష్టాలకు గురి చేసిన చరిత్ర చంద్రబాబుకు ఉంది. ఆనాడు విద్యుత్ చార్జీలతో నలిగిపోతున్న ప్రజలకు, రైతులకు అండగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పెద్ద ఎత్తున ఉద్యమించారు. చంద్రబాబు ఆ ఉద్యమాన్ని కర్కశంగా అణిచివేసేందుకు ఏకంగా రైతులపై పోలీసులతో కాల్పులు చేయించి, రక్తపాతానికి కారణమయ్యాడు. నేడు రాష్ట్రంలో మరోసారి చంద్రబాబు వల్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోయలేక ప్రజల నడ్డి విరుగుతోంది. ప్రజలకు అండగా వైఎస్సార్‌సీపీ ఈనెల 27న తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలపడంతో పాటు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాం.
ప్రజలపై చంద్రబాదుడు : మాజీ మంత్రి మేరుగు నాగార్జున
ప్రజలపై చంద్రబాదుడు కార్యక్రమాన్ని వైఎస్సార్‌సీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడమే కాదు, వారి కష్టాలను కూడా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. వర్షాల వల్ల ధాన్యం తడిచిపోయి, కొనేవారు లేక మద్దతుధర లభించక అల్లాడుతున్న రైతులకు అండగా వైయస్ జగన్ చేసిన ఆందోళనలతో ప్రభుత్వం కళ్ళు తెరిచింది. ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున విద్యుత్ చార్జీలను పెంచడం, గతంలో వైయస్ జగన్ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కు మంగళం పాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు సరైన గుణపాఠం నేర్పుతాం. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈనెల 27న విద్యుత్ కార్యాలయాల వద్ద జరిగే ఆందోళన కార్యక్రమాలకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరైన ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి.
ప్రజలను నమ్మించిన చరిత్ర చంద్రబాబుది : మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు
ఎన్నిలకు ముందు విద్యుత్ చార్జీల మోత ఉండదూ అని ప్రజలను నమ్మించిన చంద్రబాబు నేడు దానికి విరుద్దంగా కరెంట్ చార్జీలను పెంచాడు. చంద్రబాబు దిగివచ్చి, కరెంట్ చార్జీల భారంను ఉపసంహరించుకునే వరకు వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ ఉద్యమిస్తూనే ఉంటుంది. ప్రజల గళంగా ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంది. ప్రజల ఆవేదనకు అండగా నిలుస్తుంది. అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాం.
ప్రజలపై రూ.15,485 కోట్ల విద్యుత్ సర్దుబాటు చార్జీల భారం
కనీవినీ ఎరుగని రీతిలో.. మునుపెన్నడూ ఏ ప్రభుత్వంలో, ఏ సీఎం హయాంలోనూ లేని విధంగా ఆరు నెలల్లోనే ప్రజలపై రూ.15,485 కోట్ల విద్యుత్ సర్దుబాటు చార్జీల భారం మోపిని చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు అసలు చార్జీల వడ్డింపునకు సిద్ధమైంది.
ప్రత్యక్షంగానో, కుదరకపోతే దొంగ దారిలో శ్లాబుల విధానంలోనే కరెంటు చార్జీలు పెంచడం ద్వారా ప్రజలపై మరికొన్ని వేల కోట్ల రూపాయల భారం వేసేలా విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంల)తో కసరత్తు పూర్తి చేయించింది.
ఈ మేరకు 2025–26 సంవత్సరానికి ఆదాయ అవసరాల నివేదిక (అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్‌మెంట్)ను ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి అందజేశాయి. దాని ప్రకారం వచ్చే ఏడాది (2025) ఏప్రిల్ 1 నుంచి కొత్త విద్యుత్ చార్జీలు అమలులోకి రానున్నాయి.
ప్రజలపై చార్జీల భారం వేయని వైఎస్ జగన్
విద్యుత్ చార్జీల భారంతో ప్రజల నడ్డివిరిచే ప్రభుత్వాలను గతంలో చూశాం. కానీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో సామాన్యులకు ఎలాంటి విద్యుత్ చార్జీలు పెంచని ప్రభుత్వం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వమే. ఇదే కాకుండా, రైతులకు 9 గంటల పాటు వ్యవసాయానికి పగటిపూట ఉచిత విద్యుత్‌ను అందించింది కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమే.
వివిధ వర్గాల పేదలకు సైతం ఉచితంగా, రాయితీతో విద్యుత్‌ను ఇచ్చింది వైఎస్ జగన్ హయాంలోనే. ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే విధానాన్ని కొనసాగిస్తూ.. రాష్ట్రంలోని దాదాపు 2 కోట్ల కుటుంబాలపై ఎలాంటి విద్యుత్ చార్జీల భారం లేకుండా టారిఫ్ ఆర్డర్‌ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆమోదించేలా నాటి పాలకులు చేశారు.
2024–25 సంవత్సరానికి మూడు డిస్కంలకు ప్రభుత్వం నుండి అవసరమైన సబ్సిడీ రూ.13,589.18 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వమే భరించింది. తద్వారా విద్యుత్ చార్జీలను పెంచాల్సిన అవసరం లేకుండా చేసింది.
Comments
Please login to add a commentAdd a comment