శోభ హైమావతి, ఆమె కుమార్తె స్వాతి
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతికి పుత్రికా వాత్సల్యం పట్టుకుంది. నేనూ, నా కూతురు తప్ప మరెవరూ బరిలో ఉండరని ఇటు పార్టీ కేడర్‌తోనూ... మా ఇద్దరికే టిక్కెట్లు ఇవ్వాలని అటు అధిష్టానం వద్ద గట్టిగా ఆమె చెబుతున్నారు. తనకు ఎస్.కోట అసెంబ్లీ , కుమార్తెకు అరకులోయ ఎంపీ టిక్కెట్లను కేటాయించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. దీంతో అధిష్టానానికి ఏమీ పాలుపోవడం లేదు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: తనతో పాటు కుమార్తెను కూడా నాయకురాలిగా చేయాలని శోభా హైమవతి తపిస్తున్నారు. దీనికోసం పావులు కదుపుతున్నారు. ఎవరేమనుకున్నా, పోటీలో ఇతర నేతలున్నా తన పంతం నెగ్గించుకోవడానికి వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ఈ మేరకు అధిష్టానం వద్ద పై రెండు డిమాండ్ పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో టీడీపీలో గందరగోళం చోటు చేసుకుంది. ఇప్పుడా చిక్కుముడిని విప్పలేక అధినేత చంద్రబాబునాయుడు తీవ్రంగా సతమతమవుతున్న పరిస్థితి ఏర్పడింది.
గత ఎన్నికల్లో ఎస్.కోట టిక్కెట్ దక్కకపోయినా శోభా హైమావతి పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ అధినేత దృష్టిలో పడ్డారు. అధిష్టానం వద్ద పలుకుబడి పెరిగిందనో, మరేంటో తెలియదు గానీ తన కుమార్తె స్వాతిని ప్రమోట్ చేసేందుకు ఇదే మంచి అవకాశంగా ఆమె ఎంచుకున్నారు. పార్టీకి అందించిన సేవల్ని, గతంలో జరిగిన అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎస్.కోట ఎమ్మెల్యే టిక్కెట్‌ను తనకివ్వాలని, అరకు పార్లమెంట్ సీటును తన కుమార్తెకివ్వాలని చంద్రబాబును డిమాండ్ చేసినట్టు తెలిసింది. దీంతో అధినేత ఇరకాటంలో పడ్డట్టు సమాచారం.
కోళ్లకు ఎసరు
ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడా రెండు సీట్లపై ఆశలు పెట్టుకున్న నేతలు అభద్రతా భావంలో పడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మరోసారి ఎస్.కోట నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆ మేరకు తనకంటూ కేడర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. తమ కుటుంబం మొదటి నుంచి టీడీపీని అంటి పెట్టుకుని ఉందని, తమను కాదని వేరొకరికి టిక్కెట్ వద్దని అధిష్టానం వద్ద గట్టిగానే పట్టుబడుతున్నట్టు సమాచారం. కాదూ కూడదంటే భవిష్యత్ పరిణామాలు వేరొక విధంగా ఉంటాయని హెచ్చరికలు కూడా పంపించినట్టు తెలిసింది. కానీ శోభా హైమావతి పూర్తి నమ్మకంతో ఉన్నారు. అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడితో ఎలాగైనా తనకే ఎమ్మెల్యే టిక్కెట్ దక్కుతుందని నియోజకవర్గంలో ఇప్పటికే విసృ్తతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యం లో కోళ్ల, శోభా మధ్య అంతర్యుద్ధం కొనసాగుతోంది.
శంకరరావుకు
ఇదిలా ఉండగా శోభా తన కుమార్తె స్వాతి రాజకీయ ప్రవేశానికి ఇదే మంచి తరుణమని ఆలోచించి అరకు పార్లమెంట్‌పై కన్నేశారు. గిరిజనుల్లో మంచి పట్టు, బంధుత్వం ఉన్న దృష్ట్యా పార్లమెంట్ సీటును తన కుమార్తెకు ఇవ్వాలని చంద్రబాబును గట్టిగా కోరినట్టు తెలిసింది. అయితే ఇదే సీటుపై మాజీ ఎంపీ డీవీజీ శంకరరావు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అదే ఆలోచనతో గత ఐదేళ్లుగా పనిచేస్తూ వస్తున్నారు. కానీ హఠాత్తుగా శోభా హైమావతి తన కుమార్తెను తెరపైకి తీసుకురావడంతో డీవీజీలో అసహనం మొదలైనట్టు తెలుస్తోంది. దీంతో పార్టీ కేడర్‌లో కూడా చీలిక వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా ఇటు ఎస్.కోట అసెంబ్లీ, అటు అరకు పార్లమెంట్‌పై కన్నేయడంతో టీడీపీ రాజకీయమంతా శోభా హైమావతి చుట్టూ తిరుగుతోంది. ఇప్పటికే రేసులో ఉన్న నేతలు ఆందోళనకు లోనవుతుండగా, టిక్కెట్ల పంచాయతీని పరిష్కరించుకోలేక చంద్రబాబు సతమతమవుతున్నట్టు తెలిసింది.