అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి సునీత
ఒంగోలు సబర్బన్: బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ సమీక్షలో సంతనూతలపాడు పార్టీ ఇన్‌చార్జి వ్యవహారంలో అంతర్గత పోరు బట్టబయలైంది. పార్టీకి సంబంధించి ఆదివారం స్థానిక ఎన్‌ఎస్‌పీ అతిథి గృహంలో రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి, పార్టీ బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి పరిటాల సునీత సమీక్ష నిర్వహించారు. సంతనూతలపాడు ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉండటం లేదంటూ ఓ వర్గం నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆయనను ఇన్‌చార్జి బాధ్యతల నుంచి మార్చాల్సిందేనంటూ పట్టుబట్టారు. ఇదిలా ఉంటే విజయకుమార్‌కు అనుకూలంగా కొందరు నాయకులు మాట్లాడారు. విజయకుమార్‌ను కొనసాగించాల్సిందేనంటూ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో గుంటూరు జిల్లాలోని అసెంబ్లీ స్థానాలపై తొలుత సమీక్షించారు. అనంతరం చీరాల, పర్చూరు, అద్దంకి స్థానాలు, చివరగా సంతనూతలపాడు నియోజకవర్గ నాయకులతో రాత్రి పొద్దుపోయేవరకు మాట్లాడారు. సమీక్షకు చీరాల నుంచి ఎమ్మెల్సీ పోతుల సునీత, అద్దంకి నుంచి ఎమ్మెల్సీ కరణం బలరామ కృష్ణమూర్తి హాజరుకాలేదు. సంతనూతలపాడుపై సోమవారం కూడా మరోసారి సమీక్ష నిర్వహిద్దామని నాయకులకు చెప్పి పంపారు. సమీక్షకు పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, ముఖ్య నాయకులు హాజరయ్యారు.
అంగన్‌వాడీ భవనాల నిర్మాణం త్వరగా పూర్తి చేయండి
ఒంగోలు టౌన్: జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల భవనాలను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి పి.సునీత ఆదేశించారు. ఆదివారం స్థానిక ఎన్‌ఎస్‌పీ అతిథి గృహంలో ఐసీడీఎస్, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు నిర్మాణం ప్రారంభించని భవనాలను, అసంఫూర్తిగా ఉన్న వాటిని త్వరగా నిర్మించాలని ఆదేశించారు. అన్న అమృతహస్తం, బాలామృతం పథకాల అమలు తీరు గురించి ఐసీడీఎస్ పీడీ సరోజినిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో న్యూట్రి గార్డెన్స్‌కు అవసరమైన స్థలాలు, వన్ స్టాప్ సెంటర్‌పై పీడీతో చర్చించారు. డీఆర్‌డీఏ, వెలుగు లక్ష్యాలను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని డీఆర్‌డీఏ పీడీ ఎంఎస్ మురళిని మంత్రి ఆదేశించారు. మున్సిపాలిటీల పరిధిలో ఎనిమిది స్త్రీ శక్తి భవన నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రికి పీడీ వివరించారు. జిల్లాలో 35 కుటుంబాలకు ఒక సాధికార మిత్రను నియమించి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment