santhanuthalapadu
-
తల్లీబిడ్డల సజీవ దహనం: వీడిన మిస్టరీ
సాక్షి, ప్రకాశం: జిల్లాలోని మద్దిపాడు మండలం పేర్లమెట్ట- లింగంగుట్ల వద్ద తల్లీబిడ్డ హత్య కేసును ప్రకాశం పోలీసులు ఛేదించారు. భార్యపై అనుమానంతో వివాహిత భర్తే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు గుర్తించారు. వివరాలు... ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం పేర్లమెట్ట శివారులో బురదతో ఉన్న డొంక దారిలో ఈ నెల మూడో తేదీ సాయంత్రం ఐదు గంటల సమయంలో ఓ మహిళ, ఏడాది వయసున్న బిడ్డ మంటల్లో తగులబడుతున్న దృశ్యాన్ని సమీపంలో ఉన్న కొందరు రైతులు చూశారు. ఆ సమాచారాన్ని గ్రామస్తులకు అందజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆ రెండు మృతదేహాలూ దాదాపు కాలిపోయాయి. ఈ క్రమంలో ఘటన జరిగిన సమయంలో అటుగా వెళ్లిన కొందరిని పోలీసులు విచారించారు. అయ్యప్ప దీక్షలో ఉన్న ఇద్దరు ఇచ్చిన సమాచారంతో దర్యాప్తును వేగవంతం చేశారు. తాము ఆ బురద దారిలో వెళుతున్నప్పుడు ఓ యువకుడు, ఓ యువతి, ఓ చంటిబిడ్డతో మోటారు సైకిల్‌పై వస్తూ ఆగి కోపంతో వాదించుకుంటున్నారని ఆ స్వాములు పోలీసులకు తెలిపారు. ‘‘ఈ బురద దారిలో గొడవేమిటి? మీరెవరు?’’ అని తాము అడగగా.. తాము భార్యాభర్తలమని, అటుగా పనుండి వెళ్తున్నామని వారు చెప్పారని స్వాములు వివరించారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన పోలీసులు.. యువతి భర్తే తల్లీబిడ్డలను సజీవ దహనం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని కోటేశ్వరరావుగా గుర్తించారు. అతడు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడని.. అతడిది అద్దంకి మండలం దామావారిపాలెం అని పేర్కొన్నారు. కోటేశ్వరరావు చేతులకు కాలిన గాయాల ఆధారంగా దర్యాప్తు చేయడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయి. భార్యపై అనుమానంతో అతడు భార్యాబిడ్డలను చంపేసినట్లు తమ విచారణలో వెల్లడైందని పోలీసులు వెల్లడించారు. -
బైక్ మీద బాలికను వెంటాడి...అఘాయిత్యం
సాక్షి, చీమకుర్తి: ముగ్గురు కలిసి బైకుపై ఓ బాలికపై వెంటపడ్డారు. వారి బైకు బాలిక సమీపానికి చేరుకోగానే నిందితుడికి సహకరించే వ్యూహంలో భాగంగా మిగిలిన ఇద్దరు వెళ్లిపోయారు. నిందితుడు మాయమాటలు చెప్పి బాలికను బైకుపై ఎక్కించుకున్నాడు. సంతనూతలపాడు జిల్లా పరిషత్ హైసూ్కల్ వెనుక ఉన్న పాత కొష్టాల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు 13 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి సంతనూతలపాడు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన గురువారం రాత్రి 9 గంటల సమయంలో సంతనూతలపాడులో జరిగింది. నిందితుడిపై ఫోక్సా చట్టం, 376 యాక్ట్ (లైంగిక దాడి, అపహరణ) నేరం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. స్థానికంగా నివాసం ఉండే 7వ తరగతి చదువుతున్న బాలిక గురువారం రాత్రి 8 గంటల సమయంలో సంతనూతలపాడు గానుగపాలెంలోని తన స్నేహితురాలి వద్దకు పుస్తకాల కోసం వెళ్లి తిరిగి ఇంటికొస్తోంది. గమనించిన ముగ్గురు యువకులు బైకుపై బాలిక వెంటపడ్డారు. బాలిక వద్దకు చేరగానే బైకుపై ఉన్న ఇద్దరు దిగి వెళ్లిపోయారు. బైకుపై ఉన్న 23 ఏళ్ల యువకుడు మాయమాటలతో బాలికను బైకుపై ఎక్కించుకున్నాడు. సమీపంలో నున్న సంతనూతలపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ వెనుక భాగంలో పొదలు, పాత కొష్టం ఉంటే దానిలోకి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఇంటికి వెళ్లి గుర్తు తెలియని వ్యక్తి తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు తల్లిదండ్రులకు చెప్పుకుని కన్నీటిపర్యంతమైంది. రాత్రి 10 గంటల సమయంలో బాలిక, తల్లిదండ్రులు కలిసి పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలికను వైద్య పరీక్షల కోసం రిమ్స్‌కు తరలించారు. శుక్రవారం విషయం తెలుసుకున్న డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్, సీఐ పి.సుబ్బారావు, చీమకుర్తి టౌన్ ఎస్ఐ షేక్ రజియా సుల్తానాబేగం సంతనూతలపాడు పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. ఘటన జరిగిన హైసూ్కల్ వెనుక ప్రాంతాన్ని డీఎస్పీతో పాటు ఇతర పోలీస్ అధికారులు పరిశీలించారు. వారితో పాటు సంతనూతలపాడు నియోజకవర్గంలోని జియో సిబ్బంది వచ్చి లైంగిక దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఇంతలో బాలిక ఫిర్యాదు చేసిన అనుమానితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. దీనిపై డీఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ కేసు దర్యాప్తు చేస్తున్నామని,పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. -
కొందరివాడు బీఎన్.. అందరివాడు టీజేఆర్
సాక్షి, చీమకుర్తి (ప్రకాశం): సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైన వైఎస్సార్కాంగ్రెస్పార్టీ తరపున టీజేఆర్ సుధాకర్‌బాబు, టీడీపీ తరపున బీఎన్.విజయ్‌కుమార్ ప్రధానంగా పోటీపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఇరుపార్టీల నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం అసెంబ్లీకి గత ఎన్నికలలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి గణాంకాలను పరిశీలించినట్లయితే సంతనూతలపాడు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్నట్లు విధితమవుతుంది. నామినేషన్లను వేసినప్పటి నుంచి నియోజకవర్గంలోని చీమకుర్తి, సంతనూతలపాడు, మద్దిపాడు, నాగులుప్పలపాడు మండలాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం అనంతరం వైఎస్సార్సీపీ వైపే గాలివాటం ఉన్నట్లు విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఇరుపార్టీలు, అభ్యర్థుల బలాబలాలను అంచాని వేసినట్లయితే ఈవిధంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. సమస్యల మీద అలుపెరుగని పోరాటం .. ♦ కొత్తగా పోటీచేస్తుండటం వలన నియోజకవర్గంలో ఎలాంటి వ్యతిరేక ఓటు ప్రభావం లేకపోవడం కలిసొచ్చే అంశం. ♦ 9 సంవత్సరాల నుంచి ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలనే జనాభిప్రాయం అభ్యర్థికి బలాన్నిస్తుంది. ♦ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టో అన్ని రకాల ప్రజల మనోభావాలకు దగ్గరగా ఉండటం కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ♦ నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో ఎలాంటి అసమ్మతి వర్గాలు లేకపోవడం శుభపరిణామం ♦ టిక్కెట్టు ఖరారు కాకుముందే సమన్వయకర్తగా ఏడాదికి పైగా నియోజకవర్గంలో తిరుగుతూ గ్రామాల్లో పట్టు సాధించటం అనుకూలం. ♦ సుధాకర్‌బాబు వాగ్దాటి కలిగిన ప్రసంగాలతో ఓటర్లను ఆకర్షించటం. ♦ నియోజకవర్గంలో బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న బూచేపల్లి కుటుంబం అండదండలు సుధాకర్‌బాబుకు పుష్కలంగా లభించటం మరో ప్రధాన బలంగా చెప్పవచ్చు ♦ నాలుగు మండలాల కన్వీనర్లు, ప్రధాన నాయకులతో పాటు గ్రామస్థాయి నాయకులతో చొరవగా కలుపుగోలుగా కలిసిపోవడం మరింత బలం. ♦ స్థానిక సమస్యలను ఎక్కువుగా ప్రజలలోకి తీసుకుపోయేందుకు తగిన సమయం లేకపోవడం ప్రతికూలతలుగా చెప్పుకోవచ్చు. వ్యతిరేక వర్గంతో ఉక్కిరిబిక్కిరి.. ♦ నియోజకవర్గంలో పదేళ్ల నుంచి పనిచేస్తున్నందున దానికి సంబంధించిన అనుభవం ఉపయోగపడే అవకాశం ఉంది ♦ ఎస్సీ, బీసీలను ఆకట్టుకున్నా ఓసీ సామాజికవర్గంలో వ్యతిరేకత ఉంది. ♦ ఐదేళ్ల పాటు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక ప్రభావం అభ్యర్థిపై చూపడం ప్రతికూలాంశం. ♦ ఆది నుంచి అసమ్మతి నాయకుల తారస్థాయి వ్యతిరేక ప్రచారం అభ్యర్థికి ఇబ్బందికరంగా మారటం. ♦ కలిసిపోయినట్లు నటిస్తున్న అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉండి వ్యతిరేకంగా పనిచేసే ప్రమాదం. ♦ పదేళ్ల క్రితం ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉపయోగపడినా ఐదేళ్ల క్రితం నుంచి ఇన్చార్జిగా పనిచేసినా అధికార పార్టీలోనే వ్యతిరేక పవనాలు ఆందోళన కలిగించే అంశం. -
సంతనుతలపాడు ఎన్నికల ప్రచార సభలో వైఎస్ జగన్
-
‘అమరావతి పేరుతో అమరేశ్వరుని భూములు కొల్లగొట్టారు’
సాక్షి, ప్రకాశం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి పేరుతో అమరేశ్వర స్వామి భూములు కొల్లగొట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. చంద్రబాబును రాజధాని గురించి అడిగితే గ్రాఫిక్స్ పేరుతో భ్రమలు కల్పిస్తున్నారని మండిపడ్డారు. రాజధాని అంటే సినిమా చూపెడతారు, కట్టు కథలు చెబుతారని విమర్శించారు. రాజధాని పేరుతో నలభై దేవాలయాలు కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా సంతనుతలపాడులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన అక్రమాలను ప్రజల దృష్టికి తీసుకువచ్చిన ఆయన.. తన కోసం ఎండను కూడా లెక్క చేయకుండా వచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు రైతలును పట్టించుకున్న పాపాన పోలేదు.. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ నియోజకవర్గంలో సాగునీరుకే కాకుండా తాగునీరుకు ఇబ్బందే. గతంలో ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి పట్టించుకుని విధంగా ఈ నియోజకవర్గానికి సాగునీరు, తాగునీరు అందించేందుకు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రామతీర్థం, గుండ్లకమ్మ ప్రాజెక్టులను తెచ్చారు. కనీసం సాగర్ నుంచి నీరు ఇప్పించుకోలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందంటే ఇంతకంటే అన్యాయమైన పాలన ఉంటుందా?. వెలిగొండ ప్రాజెక్టు కింద పంట కాల్వలు కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. ఇవన్నీ చూస్తుంటే ఈ జిల్లా మీద, ప్రజల మీద చంద్రబాబుకు ఉన్న ప్రేమ ఏ పాటిదో తెలుస్తుంది. ఈ ఐదేళ్లలో పొగాకు రైతులు పెట్టుబడులు రాక, బతుకు కష్టమై ఆత్మహత్యలు చేసుకున్నారు. రమణారెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే కనీసం పరిహారం కూడా ఇవ్వలేదు. పరిహారం కోసం పోరాటం చేస్తే కేసులు పెట్టిన ఘనత ఈ ప్రభుత్వానిది. జగన్ అనే వ్యక్తి వచ్చి పోరాటం చేస్తే తప్ప పొగాకుకు కనీస పెట్టుబడి ధర పెరగలేదు. కంది రైతులకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వలేదు. వైఎస్సార్ హయంలో సుబాబుల్ కనీస ధర 4వేల రూపాయలు పలికితే నేడు కనీసం 2500 రూపాయలు కూడా పలకడం లేదు. శనగ రైతలకు కూడా కనీస ధర లేకుండా పోయింది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఒక్కరోజు కూడా రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా? ఇదే నియోజకవర్గంలో చీమకుర్తి గుండా నా పాదయాత్ర సాగింది. చీమకుర్తిలో క్వారీలు, పాలిషింగ్ యూనిట్లు మూతపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా నాలుగైదు వందల పాలిషింగ్ యూనిట్లు మూతపడిన పరిస్థితి నెలకొంది. పరిస్థితులు ఇలా ఉంటే చంద్రబాబు మాత్రం 20లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి.. 40లక్షల ఉద్యోగాలు వచ్చాయని గొప్పలు చెబుతున్నారు. ఉద్యోగాలు దొరక్క యువత బాధపడుతుంటే.. పరిశ్రమలు మూతపడుతుంటే చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా?. పెద్ద సైజు గ్రానైటు రాయల్టీ రూ. 1980 ఉంటే 5వేల రూపాయలు చేశారు. రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది. రైతుల అప్పులు లక్షా 50 వేల కోట్లకు చేరాయి. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయరు. చంద్రబాబు హయంలో కరెంట్ చార్జీలు పెరిగి పరిశ్రమలు మూతపడుతున్నాయి. బాబు వచ్చాడు ఉన్న జాబులన్నీ ఉడగొడుతు పోతున్నారు. నిరుద్యోగ భృతి రెండు వేల రూపాయలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు ప్రతి నిరుద్యోగికి లక్షా 20వేల రూపాయలు ఎగ్గొట్టారు. డ్వాక్రా రుణాలు భారం వడ్డీలతో కలిపి 26వేల కోట్లకు పెరిగింది. పొదుపు సంఘాల అక్కాచెల్లమ్మలకు సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే పద్దతి లేకుండా పోయింది. పక్క రాష్ట్రాల్లో చికిత్స చేయించుకున బిల్లులు ఇవ్వరు.. ఎన్నికలకు ముందు మహిళ భద్రత అని చెప్పిన చంద్రబాబు.. మహిళ ఎమ్మార్వోను జుట్టు పట్టుకుని లాక్కుని వెళ్లిన, విజయవాడలో కాల్ మనీ రాకెట్టు యథేచ్ఛగా జరిగిన ఆయన చర్యలు తీసుకోరు. బీసీ పిల్లలు కనీసం ఫీజు రీయింర్స్‌మెంట్ కూడా అందక అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో గవర్నమెంట్ బడులు తగ్గిపోయాయి.. మద్యం షాపులు పెరిగిపోయాయి. నారాయణ స్కూళ్లలో ఫీజులు గుంజడానికి 6 వేల స్కూళ్లను మూసివేశారు. చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసిన బెల్ట్ షాపులే కనబడుతున్నాయి. పోలీసు స్టేషన్లు పెరగకపోయినా.. ప్రతి గ్రామంలో జన్మభూమి కమిటీల మాఫియా మాత్రం పెరిగిపోతుంది. బాబు ప్రత్యేక విమానంలో తిరగుతారు.. కానీ 108కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు. మంత్రి యనమల రామకృష్ణుడు పంటి నొప్పి వస్తే విదేశాల్లో చికిత్స చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పేదవారు పక్క రాష్ట్రంలో చికిత్స చేసుకుంటే బిల్లులు ఆపేస్తారు. చంద్రబాబు హయంలో ఆర్టీసీ ఛార్జీలు, ఇంటి పన్నులు, పెట్రోలు ఇలా అన్ని రెట్లు పెరిగిపోయాయి. ఢిల్లీ నాయకులను వెంట తీసుకుని వస్తున్నారు.. రాజధాని గురించి అడిగితే రోజుకో డ్రామా చూపెడతారు. గ్రాఫిక్స్ పేరుతో భ్రమలు కల్పిస్తారు. రాజధానిలో నలభై దేవాలయాలను కూలగొట్టారు. రియల్ ఎస్టేట్ కోసం రాజధాని ఉపయోగించుకుంటున్నారు. లక్షల కోట్లతో లోకేశ్ స్థిరీకరణ నిధి తీసుకొచ్చారు. ప్రతిపక్ష పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబు.. నేడు ప్రజల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. ఒంటరిగా ప్రచారానికి వెళ్లలేక ఢిల్లీ నుంచి నాయకులను వెంట తీసకుపోయే పరిస్థితి నెలకొంది. 600 వాగ్ధానాలు చేసిన చంద్రబాబు.. వాటిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు మీ భవిష్యత్తు నా భరోసా అంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది చంద్రబాబు చేయని మోసం, చెప్పని అబద్దం ఉండదు. రానున్న రోజుల్లో ఈ కుట్రలు ఇంకా పెరుగుతాయి. ప్రతి ఊరికి మూటలు, మూటలు డబ్బులు తీసుకోస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో మూడు వేల రూపాయల నగదును పెడతారు. మీరందరు గ్రామాలకు వెళ్లి ప్రతి ఒక్కరికి చంద్రబాబు మోసాల గురించి చెప్పాలి. గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం.. చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోకండని గ్రామాల్లోని అక్కాచెల్లమ్మలకు, అవ్వ తాతలకు చెప్పండి. ఇరవై రోజులు ఓపిక పట్టమని చెప్పండి. జగనన్న చెప్పకపోయి ఉంటే పించన్ రెండు వేలకు పెరిగేదా అని గుర్తుచేయండి. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న ఏటా రూ. 15 వేల రూపాయలు ఇస్తాడని ప్రతి అక్కాచెల్లమ్మకు చెప్పండి. ఏ చదువైనా అన్న చదివిస్తాడని.. ఎన్ని లక్షలైనా కూడా భరిస్తాడని ప్రతి ఇంట్లో చెప్పండి. గతంలో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు వచ్చేవి. ఇప్పుడు అది కనిపించని పరిస్థితి. ఎన్నికల తేదీ వరకు ఎంతైతే అప్పు ఉంటుందో ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా మీ చేతికే అందిస్తాం. అంతేకాకుండా మళ్లీ బ్యాంకుల వద్ద నుంచి సున్నా వడ్డీకే రుణాలు వస్తాయని చెప్పండి. మహిళలను లక్షాధికారులను చేయాలనే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్ చేయూత కింద 75 వేల రూపాయలు నాలు దఫాలుగా చెల్లిస్తాం. పసుపు కంకుమ డ్రామాకు మోసపోవద్దని ప్రతి అక్కకు చెప్పండి. చంద్రబాబు చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితి. రైతలకు గిట్టుబాటు ధర ఇవ్వడమే కాకుండా.. గిట్టుబాటు ధరలకు గ్యారెంటీ కూడా ఇస్తాం. ప్రతి రైతన్నకు మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తాం. నవరత్నాల గురించి ప్రతి అవ్వకు, తాతకు చెప్పిండి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధాకర్‌ని, ఎంపీ అభ్యర్థి సురేశ్‌ని ఆశీర్వదించమ’ని కోరారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పోలింగ్ బూత్‌లలో జర భద్రం
సాక్షి, చీమకుర్తి(ప్రకాశం): ఎన్నికల్లో ఎలాగైనా గెలావాలి.. పోటీ చేసేవారైనా, వారి తరఫున వారి అభిమాన కార్యకర్తలైనా సరే.. ప్రత్యర్థిని ఓడించి గెలిచేందుకు, లేక గెలిపించేందుకు ఎంతకైనా సిద్ధమే. అందుకే పోలింగ్ జరిగే నాడు గ్రామాల్లో హోరాహోరీగా ఎన్నికలు జరిగే క్రమంలో ఎన్నికల విధులు నిర్వహించాలంటే అధికారులు భయాందోళనలు చెందుతుంటారు. అలాంటి వివాదాస్పద గ్రామాలలో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పోలీసులకు తల ప్రాణం తోకకొచ్చినంత పనవుతుందని ఆందోళన చెందుతుంటారు. అలాంటి పోలింగ్ కేంద్రాలను ఎన్నికల పరిభాషలో పోలీసులు సమస్యాత్మక గ్రామాలుగాను, సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా పోలీస్ రికార్డులలో ప్రత్యేకంగా నమోదై ఉంటుంది. పోలింగ్ రోజున జరిగే గొడవలతో పాటు పోలింగ్ ఏకపక్షంగా జరిగినా, పోటీలో ఉన్న ఒకే వ్యక్తికి 90 శాతానికి పైగా ఓట్లు పోలైనా అలాంటి పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా పోలీసులు ప్రత్యేక ముద్ర వేస్తారు. అత్యధికంగా సంతనూతలపాడు మండలంలో ఉన్నదే 60 పోలింగ్ స్టేషన్లు అయితే వాటిలో 54 క్రిటికల్ బూత్‌లే ఉండటం విశేషం. తర్వాత స్థానం నాగులుప్పలపాడు మండలంలో 74 బూత్‌లకు గాను 53 క్రిటికల్ బూత్‌లే ఉన్నాయి. అన్నిటికంటే తక్కువుగా మద్దిపాడు మండలంలో 54కి 24 బూత్‌లు మాత్రమే క్రిటికల్ గా నమోదై ఉన్నాయి. ఇక చీమకుర్తి పట్టణంలో 23 పోలింగ్ బూత్‌లు ఉంటే వాటిలో 21 పోలింగ్ బూత్‌లు క్రిటికల్‌గా నమోదై ఉన్నాయి. ఇక చీమకుర్తి మండలం మొత్తం మీద 68 బూత్‌లకు గాను 42 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లుగా నమోదై ఉన్నాయి. మండలం క్రిటికల్ నార్మల్ మొత్తం చీమకుర్తి 42 26 68 సంతనూతలపాడు 54 6 60 మద్దిపాడు 24 30 54 నాగులుప్పలపాడు 53 21 74 మొత్తం 173 83 256 కేటగిరీలుగా విభజన.. చీమకుర్తి మండలంలోని కూనంనేనివారిపాలెం, గాడిపర్తివారిపాలెం, ఎర్రగుడిపాడు, ఇలపావులూరు, పల్లామల్లి వంటి గ్రామాలను ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. సమస్యాత్మక పోలింగ్‌కేంద్రాలను పోలీసులు మూడు రకాల కేటగిరీలుగా విభజించారు. నేర చరిత్ర, రిగ్గింగ్ స్వభావం ఎక్కువుగా ఉన్న పోలింగ్ కేంద్రాలను హైపర్ క్రిటికల్ గాను, మీడియం స్టేజిలో ఉన్న వాటిని క్రిటికల్ విభాగంలోను, సాధారణ స్థాయిలో ఉన్న వాటిని నార్మల్ పోలింగ్ స్టేషన్లుగాను విభజించారు. సంతనూతలపాడు నియోజకవర్గలోని నాలుగు మండలాల్లో మొత్తం 256 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. వాటిలో హైపర్ క్రిటికల్ కేటగిరీలో ఒక్కటి కూడా లేదని, పోలీస్ రికార్డులు ధ్రువీకరిస్తున్నాయి. క్రిటికల్ విభాగంలో 173, నార్మల్ విభాగంలో 83 ఉన్నాయి. నియోజకవర్గంలో 173 బూత్‌లు సమస్యాత్మకంగా ఉన్నాయి సంతనూతలపాడు నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో కలిపి 256 పోలింగ్ బూత్‌లు ఉంటే వాటిలో 173 బూత్‌లు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లుగా నమోదు చేయబడ్డాయి. 86 మాత్రమే నార్మల్ కండిషన్లో ఉన్నాయి. ఎన్నికలప్పుడు ఆయా గ్రామాలలో గతంలో జరిగిన నేరాలు, ఓటింగ్ సరళి ఒకే వ్యక్తికి ఏక పక్షంగా ఓట్లు పోలైనా క్రిటికల్ పోలింగ్ స్టేషన్లుగా నమోదు చేయటమైనది. - ఓ.దుర్గా ప్రసాద్, సీఐ, ఒంగోలు రూరల్ -
మంత్రి సునీత సమక్షంలో బట్టబయలైన వర్గపోరు
ఒంగోలు సబర్బన్: బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ సమీక్షలో సంతనూతలపాడు పార్టీ ఇన్చార్జి వ్యవహారంలో అంతర్గత పోరు బట్టబయలైంది. పార్టీకి సంబంధించి ఆదివారం స్థానిక ఎన్ఎస్పీ అతిథి గృహంలో రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి, పార్టీ బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల సునీత సమీక్ష నిర్వహించారు. సంతనూతలపాడు ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉండటం లేదంటూ ఓ వర్గం నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆయనను ఇన్చార్జి బాధ్యతల నుంచి మార్చాల్సిందేనంటూ పట్టుబట్టారు. ఇదిలా ఉంటే విజయకుమార్‌కు అనుకూలంగా కొందరు నాయకులు మాట్లాడారు. విజయకుమార్‌ను కొనసాగించాల్సిందేనంటూ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో గుంటూరు జిల్లాలోని అసెంబ్లీ స్థానాలపై తొలుత సమీక్షించారు. అనంతరం చీరాల, పర్చూరు, అద్దంకి స్థానాలు, చివరగా సంతనూతలపాడు నియోజకవర్గ నాయకులతో రాత్రి పొద్దుపోయేవరకు మాట్లాడారు. సమీక్షకు చీరాల నుంచి ఎమ్మెల్సీ పోతుల సునీత, అద్దంకి నుంచి ఎమ్మెల్సీ కరణం బలరామ కృష్ణమూర్తి హాజరుకాలేదు. సంతనూతలపాడుపై సోమవారం కూడా మరోసారి సమీక్ష నిర్వహిద్దామని నాయకులకు చెప్పి పంపారు. సమీక్షకు పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. అంగన్వాడీ భవనాల నిర్మాణం త్వరగా పూర్తి చేయండి ఒంగోలు టౌన్: జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల భవనాలను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి పి.సునీత ఆదేశించారు. ఆదివారం స్థానిక ఎన్ఎస్పీ అతిథి గృహంలో ఐసీడీఎస్, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు నిర్మాణం ప్రారంభించని భవనాలను, అసంఫూర్తిగా ఉన్న వాటిని త్వరగా నిర్మించాలని ఆదేశించారు. అన్న అమృతహస్తం, బాలామృతం పథకాల అమలు తీరు గురించి ఐసీడీఎస్ పీడీ సరోజినిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో న్యూట్రి గార్డెన్స్‌కు అవసరమైన స్థలాలు, వన్ స్టాప్ సెంటర్‌పై పీడీతో చర్చించారు. డీఆర్డీఏ, వెలుగు లక్ష్యాలను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని డీఆర్డీఏ పీడీ ఎంఎస్ మురళిని మంత్రి ఆదేశించారు. మున్సిపాలిటీల పరిధిలో ఎనిమిది స్త్రీ శక్తి భవన నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రికి పీడీ వివరించారు. జిల్లాలో 35 కుటుంబాలకు ఒక సాధికార మిత్రను నియమించి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. -
అదనపు సమన్వయకర్తగా సామాన్య కిరణ్
హైదరాబాద్: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గ అదనపు సమన్వయకర్తగా శ్రీమతి సామాన్య కిరణ్‌ను నియమిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం పార్టీ వర్గాలు వెల్లడిచాయి. -
బస్సు బోల్తా : ప్రయాణికులకు గాయాలు
ఒంగోలు : ప్రకాశం జిల్లా సంతనూతలపాడు చెరువుకట్ట వద్ద ఆదివారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది.ఈ ప్రమాదంలో ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని రహదారిపై నుంచి బస్సును పక్కకు తీశారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
20 ఏళ్లుగా నిద్రపోతున్నారా ?
సంతనూతలపాడు: ‘కాలనీలో 20 ఏళ్ల నుంచి 50 కుటుంబాల వారు నివాసం ఉంటున్నారు. క్రమం తప్పకుండా గతంలో పంచాయతీకి..ఇప్పుడు కార్పొరేషన్‌కు ఇంటి పన్నులు, నీటి పన్నులు కడుతున్నారు. ఇప్పటికిప్పుడు కాలనీని ఖాళీ చేయమని అధికారులు నోటీసులు ఇవ్వడం ఏంటి. ఇన్నేళ్లుగా నిద్రపోతున్నారా..కాలనీకి వైఎస్సార్ పేరు బదులు ఎన్టీఆర్ పేరు పెట్టుకుంటే ఓకేనా’ అని ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పేర్నమిట్ట పంచాయతీ పరిధిలో..ప్రస్తుతం ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో ఉన్న వైఎస్సార్ కాలనీలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 50 కుటుంబాల వారు 20 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నారు. కాలనీలోని స్థలాలు ఎన్ఎస్పీ కాలువకు చెందినవని..డిసెంబర్ 1వ తేదీనాటికి ఖాళీ చేయకుంటే ఇళ్లను కూల్చేస్తామని ఎన్ఎస్పీ అధికారులు నోటీసులిచ్చారు. అయితే ఆ నోటీసుల్లో ఎక్కడా సర్వే నంబర్లను పేర్కొనలేదు. ఇదే కాలనీలో పలు రైస్ మిల్లులు, కార్పొరేట్ స్కూళ్లు ఉంటే వాటికి నోటీసులు ఇవ్వకుండా కేవలం వైఎస్సార్ కాలనీలోని ఇళ్ల వారికే పంపడం గమనార్హం. ఈ క్రమంలో కాలనీవాసులు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే బుధవారం కాలనీని సందర్శించారు. కాలనీలోని గృహాలను, వాటి డోర్ నంబర్లు, కరెంటు మీటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీవాసుల నుంచి ఓ పక్క ఇంటి పన్నులు, నీటి పన్నులు చెల్లించుకుంటూ ఇప్పుడు అవి ఎన్ఎస్పీ కాలువ స్థలాలన్న సాకు చూపి అధికారులు వారిని వీధులపాలు చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల మెప్పుకోసమే ఈ పనిచేస్తున్నారా అని మండిపడ్డారు. దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడి కాలనీవాసుల తరఫున న్యాయపోరాటం చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి దిగజారుడు రాజకీయాలు ఎప్పుడూ చూడలేదన్నారు. పేర్నమిట్ట మాజీ సర్పంచ్, వైఎస్సార్ సీపీ నాయకుడు రావూరి లింగారెడ్డి మాట్లాడుతూ ‘అసలిక్కడ కాలువ ఉందా..అధికారం చేతిలో ఉందికదా అని అధికారుల్ని చెప్పుచేతల్లో పెట్టుకుని అవసరమైతే గాలిలో కూడా మేడలు కట్టాం అంటారు. అసలు కాలనీకి వైఎస్సార్ పేరు పెట్టడం వల్లే కదా ఇదంతా..ఎన్టీఆర్ పేరు పెడితే అధికారుల కళ్లు చల్లబడతాయా..’ అని అన్నారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్ సీపీ నాయకుడు ఓబుల్‌రెడ్డి, కండే రమణాయాదవ్, ఈశ్వరరావు, ఎమ్ ఆంజనేయులు, టీ గోపి, కృష్ణారెడ్డి, చిరంజీవి తదితరులున్నారు. -
‘మమ్మల్నీ బతకనీయండి!’
సంతనూతలపాడు, (ఫొటోలు- ఎం.ప్రసాద్): గ్రామసీమల్లో పాడి ఉన్న కుటుంబాలకు ప్రత్యేక గౌరవం. ఆ ఇంట సిరులు పండుతాయని ప్రతి ఒక్కరూ నమ్మేవారు. వ్యవసాయం కలిసిరాకున్నా రెండు మూడు గేదెలు పెంచుతూ వచ్చే ఆదాయంతో ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడేవి. వేకువనే లేచి వాటికి దాణా కలిపి.. పాలు పితికి, తర్వాత మైదానాల్లోకి తోలుకుపోయి పచ్చగ్రాసం మేత గా వేసేవారు. అక్కడే చెరువుల్లో దించి శుభ్రంగా తోమి తిరిగి సాయంత్రం పాలు సేకరిస్తూ.. వాటిని కంటికి రెప్పలా కాపాడేవారు. పల్లెల్లో పచ్చని బైళ్లున్నంతకాలం.. వర్షాలు సమృద్ధిగా కురిసినంతకాలం పాల సేకరణతో జిల్లా వ్యాప్తంగా వేలాది కుటుంబాలు ఉపాధి పొందాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు తల్లకిందులయ్యాయి. కరువు కోరలు చాచింది. ఎండు గడ్డికీ దిక్కులేదు. దాణా ధరలు అందనంత ఎత్తుకు పెరిగాయి. చెరువులు, కుంటలు ఎండిపోవడంతో గేదెలకు కనీసం తాగు నీరు కూడా దొరకని దుస్థితి. ఇలాంటి వాతావరణంలో పశుపోషకులు తల్లడిల్లిపోక ఏం చేయగలరు? ఇల్లు గడవడమే గగనమైతే.. ఇక గేదెలను ఎలా పోషించగలరు? సరైన ఆహారం లేకుంటే గేదెలు పాలివ్వవు.. అలాంటప్పుడు వాటిని మేపి ఉపయోగం ఏంటి? అందుకే వాటిని సంతలో తెగనమ్ముకుంటున్నారు. -
అమీతుమీ
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయడంతో, రెండవ జాబితాలో తమ పేర్లు ఉంటాయా లేదా అనే అనుమానంతో అధిష్టానంపై యుద్ధం ప్రకటించేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమవుతున్నారు. తొలి జాబితాలో వివాద రహితంగా ఉన్న నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. మిగిలినవన్నీ వివాదాస్పదం కావడంతో, ఆ అభ్యర్థుల పేర్లు ప్రకటించే విషయంలో అధిష్టానం సంశయిస్తోందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఇప్పటికే సంతనూతలపాడు నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించిన విషయం తెలిసిందే. దీనిపై ఆగ్రహం చెందిన నాయకులు ఒంగోలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. అదే పరిస్థితి పునరావృతమైతే పార్టీ పరువు పోతుందని భావిస్తున్నారు. దీంతో అధిష్టానం ముందుగా నాయకులను బుజ్జగించే పనిలో పడింది. తమకు సీటు ఖరారవుతుందా లేదోననే మీమాంసతో కొందరు ఆశావహులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తనకు ఎట్టి పరిస్థితిల్లోనూ రెండవ జాబితాలో అవకాశం కల్పిస్తారని భావిస్తున్నారు. అయినా ఎందుకైనా మంచిదని ఆయన హైదరాబాద్ చేరుకుని పైరవీలు చేసుకుంటున్నారు. తనకు స్థానం దక్కకపోతే స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానని అంటున్నట్లు తెలిసింది. కందుకూరు సీటు ఆశిస్తున్న దివి శివరాం ఈ సారీ తనకే టికెట్ కేటాయించాలని అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే తనకు 60 ఏళ్లు నిండాయని, ఇకపై తాను ఎన్నికల్లో పోటీచేసే అవకాశం లేదని, తనకు ఈ స్థానం కేటాయించకపోతే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అంటున్నట్లు తెలిసింది. కందుకూరును తనకే కేటాయించాలని జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ కూడా కోరుతున్నారు. శివరాం ఇప్పటికీ అదే నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారని, ఈ సారి తనకు కేటాయించాలని కోరుతున్నట్లు తెలిసింది. దామచర్లను ఒంగోలు నుంచి పోటీ చేయాలని కోరుతున్నట్లు తెలిసింది. ఒంగోలులో పోటీ చేస్తే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డిని తటు ్టకోవడం తనకు సాధ్యం కాదని ఆయన వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. గిద్దలూరు నుంచి పిడతల సాయికల్పన రెడ్డి టీడీపీ టికెట్ కోరుతుండగా, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం కాంగ్రెసునాయకుడిని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అయితే తనకు సీటు దక్కని పక్షంలో పార్టీకి పని చేయనని సాయికల్పన తేల్చిచెబుతున్నట్టు సమాచారం. ఈ తరహా పరిణామాలతో జిల్లాలో సీట్ల కేటాయింపు చంద్రబాబు నాయుడుకు పెద్ద తలనొప్పిగా మారినట్లు తెలిసింది. ఏది ఏమైనా తమకు సీట్లు దక్కకపోతే, అధిష్టానంతో యుద్ధం చేయక తప్పదని చెపుతున్న కొందరు నాయకులు ఆ మేరకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. -
పేదల గుడిసెలపై ఖాకీ ప్రతాపం
సంతనూతలపాడు, న్యూస్‌లైన్ : పేర్నమిట్ట సమీపంలోని కందరగుంట వద్ద ఉన్న ప్రభుత్వ భూమిలో 120 మంది పేదలు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. గుడిసెలు అక్రమంగా వేశారని పోలీసులకు రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. ఒంగోలు డీఎస్పీ పి.జాషువా ఆధ్వర్యంలో శనివారం ఉదయం గుడిసెలు కూల్చి వేశారు. వివరాలు.. కందరగుంట ప్రభుత్వ భూమిలో సుమారు 25 సంవత్సరాల క్రితం పేర్నమిట్ట గ్రామానికి చెందిన దళితులకు పట్టాలిచ్చారు. కాలక్రమంలో వారి వద్ద నుంచి అదే గ్రామానికి చెందిన బొడ్డు వెంకయ్య ఆ భూమిని కొనుగోలు చేశాడు. అతని నుంచి ఒంగోలుకు చెందిన టీవీ శ్రీరామమూర్తి కొనుగొలు చేసి ఆ భూమిలో ప్లాట్లు వేసి అమ్ముకున్నాడు. ఒంగోలుకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా ప్లాట్లు కొనుగోలు చేశారు. పది రోజుల నుంచి మళ్లీ గుడిసెలు వేస్తున్నారని అధికారులకు సమాచారం అందింది. నగరపాలక సంస్థ, తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది సహకారంతో పోలీసులు గుడిసెలు తొలగించారు. దళితులకు కేటాయించిన ప్రభుత్వ భూమిపై ఇతరులకు హక్కు ఉండదని అధికారులు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమి ఆక్రమించుకోవడం నేరమని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గుడిసెలు వేసుకున్న కొందరు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దళారులను నమ్మి మోసపోయామంటున్నారు. ఒక్కో గుడిసెకు * 3 నుంచి 5 వేల వరకు దళారులు వసూలు చేశారని ఆరోపించారు. పేర్నమిట్ట పరి శర ప్రాంతాల్లో అద్దెలు చెల్లించలేక ఇక్కడ గుడిసెలు వేసుకుని దళారుల ను నమ్మి మోసపోయారు. గుడిసెల తొలగింపు కార్యక్రమంలో తహసీల్దార్ ఎం.గాంధీ, ఆర్ఐ కె.కాశీయ్య, సర్వేయర్ నందయ్య, వీఆర్ఓలు మోహన్‌రెడ్డి, శ్రీరాములు, ఒంగోలు తాలుకా సీఐ శ్రీవాసన్, సీసీఎస్ సీఐ బీటీ నాయక్, మద్దిపాడు ఎస్సై భక్తవత్సలరెడ్డితో పాటు 70 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.