సాక్షి ప్రతినిధి, ఒంగోలు : తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయడంతో, రెండవ జాబితాలో తమ పేర్లు ఉంటాయా లేదా అనే అనుమానంతో అధిష్టానంపై యుద్ధం ప్రకటించేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమవుతున్నారు. తొలి జాబితాలో వివాద రహితంగా ఉన్న నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. మిగిలినవన్నీ వివాదాస్పదం కావడంతో, ఆ అభ్యర్థుల పేర్లు ప్రకటించే విషయంలో అధిష్టానం సంశయిస్తోందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.
ఇప్పటికే సంతనూతలపాడు నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించిన విషయం తెలిసిందే. దీనిపై ఆగ్రహం చెందిన నాయకులు ఒంగోలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. అదే పరిస్థితి పునరావృతమైతే పార్టీ పరువు పోతుందని భావిస్తున్నారు. దీంతో అధిష్టానం ముందుగా నాయకులను బుజ్జగించే పనిలో పడింది. తమకు సీటు ఖరారవుతుందా లేదోననే మీమాంసతో కొందరు ఆశావహులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తనకు ఎట్టి పరిస్థితిల్లోనూ రెండవ జాబితాలో అవకాశం కల్పిస్తారని భావిస్తున్నారు. అయినా ఎందుకైనా మంచిదని ఆయన హైదరాబాద్ చేరుకుని పైరవీలు చేసుకుంటున్నారు. తనకు స్థానం దక్కకపోతే స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానని అంటున్నట్లు తెలిసింది.
కందుకూరు సీటు ఆశిస్తున్న దివి శివరాం ఈ సారీ తనకే టికెట్ కేటాయించాలని అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే తనకు 60 ఏళ్లు నిండాయని, ఇకపై తాను ఎన్నికల్లో పోటీచేసే అవకాశం లేదని, తనకు ఈ స్థానం కేటాయించకపోతే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అంటున్నట్లు తెలిసింది.
కందుకూరును తనకే కేటాయించాలని జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ కూడా కోరుతున్నారు. శివరాం ఇప్పటికీ అదే నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారని, ఈ సారి తనకు కేటాయించాలని కోరుతున్నట్లు తెలిసింది.
దామచర్లను ఒంగోలు నుంచి పోటీ చేయాలని కోరుతున్నట్లు తెలిసింది. ఒంగోలులో పోటీ చేస్తే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డిని తటు ్టకోవడం తనకు సాధ్యం కాదని ఆయన వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం.
గిద్దలూరు నుంచి పిడతల సాయికల్పన రెడ్డి టీడీపీ టికెట్ కోరుతుండగా, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం కాంగ్రెసునాయకుడిని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అయితే తనకు సీటు దక్కని పక్షంలో పార్టీకి పని చేయనని సాయికల్పన తేల్చిచెబుతున్నట్టు సమాచారం.
ఈ తరహా పరిణామాలతో జిల్లాలో సీట్ల కేటాయింపు చంద్రబాబు నాయుడుకు పెద్ద తలనొప్పిగా మారినట్లు తెలిసింది.
ఏది ఏమైనా తమకు సీట్లు దక్కకపోతే, అధిష్టానంతో యుద్ధం చేయక తప్పదని చెపుతున్న కొందరు నాయకులు ఆ మేరకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
అమీతుమీ
Published Fri, Apr 11 2014 3:40 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement