రాజంపేట వద్దు.. ఒంగోలు ఇవ్వండి
టీడీపీని కోరుతున్న బీజేపీ
హైదరాబాద్: సీమాంధ్రలో బీజేపీ, టీడీపీల పొత్తులో సీట్ల సంఖ్యపై అవగాహన కుదిరినప్పటికీ, ఏ స్థానం నుంచి ఏ పార్టీ పోటీ చేయాలన్న అంశం పీటముడిగా మారింది. తమకు కేటాయించిన అరకు లోక్‌సభ స్థానం కాకుండా కాకినాడ, రాజంపేట స్థానంలో ఒంగోలు కేటాయించాలని టీడీపీకి బీజేపీ ప్రతిపాదించింది. కనీసం ఈ రెండింటిలో ఒక్కచోట అయినా మార్పు చేయాలని కోరుతోంది. పొత్తుల్లో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులను ఖరారు చేయడానికి బీజేపీ సీమాంధ్ర శాఖ ముఖ్య నేతలు సోమవారం విజయవాడలో సమావేశమయ్యారు.
పార్టీ సీమాంధ్ర శాఖ ప్రతిపాదనలపై పార్టీ జాతీయ నేత ఎం.వెంకయ్యనాయుడు టీడీపీ నేతలు సీఎం రమేష్, సుజనా చౌదరిలతో హైదరాబాద్‌లో చర్చలు జరిపారు. ఇటీవలే పార్టీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరిని ఎక్కడి నుంచి బరిలోకి దించాలన్న విషయంపై పార్టీ నేతలు తర్జనభర్జన పడుతున్నారు. ఆమె కోసం ఒంగోలు సీటు కావాలని బీజేపీ ప్రతిపాదించింది. అందుకు రాజంపేట స్థానాన్ని వదులుకుంటామని చెబుతోంది.