సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కేంద్రంలోని రెండు యూపీఏ ప్రభుత్వాల్లో మంత్రి పదవులను అనుభవించిన పురందేశ్వరి, బీజేపీలో పోటీ చేయడానికి నియోజకవర్గం లేక మదనపడ్డారు. ఆమె కోరుకున్న సీటు దక్కించుకోలేకపోయారు. చివరకు రాజంపేట నియోజకవర్గాన్ని కేటాయించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుట్ర వల్ల ఆమె కోరుకున్న స్థానాలు వయా ఒంగోలు దక్కలేదని తెలిసింది. పురందేశ్వరి కాంగ్రెస్ తరఫున 2009లో విశాఖపట్నం నుంచి పోటీ చేశారు. ఆమెకే తిరిగి ఆ సీటు ఇవ్వడానిక న్నట్లు విశాఖపట్నం స్థానాన్ని చంద్రబాబు బీజేపీకి కేటాయిస్తూ డ్రామాకు తెరలేపారు.
అయితే ఆ స్థానంలో తాను పోటీ చేయాలని బీజేపీ రాష్ట్ర నేత కంభంపాటి హరిబాబు పట్టుబట్టడంతో, ఆ స్థానాన్ని పురందేశ్వరి వదులుకోవాల్సి వచ్చింది. తన సతీమణి పురందేశ్వరికి ఒంగోలు స్థానమైనా ఇవ్వాలని కోరిన దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు భంగపాటే ఎదురైంది. రెండు సార్లు లోక్‌సభకు వరుసగా గెలుపొందిన పురందేశ్వరికి ఈ ఎన్నికల్లో ఆమె కోరుకున్న సీటు దక్కకపోవడానికి కారణమేమిటని ఆరా తీస్తే దీని వెనుక చంద్రబాబు హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్‌టి రామారావు మనుమలు ఇటీవల సమావేశమై, దగ్గుబాటి దంపతులను కూడా తెలుగుదేశంలోకి తీసుకుని రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దగ్గుబాటి దంపతులు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, వారి కుమారుడు హితేష్ యుఎస్‌లో ఉంటూ, తన మామయ్యల సంతానంతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. తాజాగా వీరు కలుసుకున్నప్పుడు దగ్గుబాటి దంపతులను కూడా తెలుగుదేశంలోకి తీసుకుని రావాలని భావించారు. తమ కుటుంబం అంతా ఒకే పార్టీలో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి అటు లోకేష్‌తోను, ఇటు దగ్గుబాటి కుమారుడు హితేష్ తో మాట్లాడుకున్నారు.
హితేష్ కూడా తల్లిదండ్రులతో మాట్లాడి, కాంగ్రెస్‌ను వీడేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా పర్చూరు నియోజకవర్గంలో రాత్రికి రాత్రి దగ్గుబాటి తెలుగుదేశంలోకి వస్తున్నట్లు పోస్టర్లు వెలిశాయి. మాతృసంస్థలోకి పునర్‌స్వాగతం అంటూ పోస్టర్లు ఏర్పాటు చేశారు. వీటిని ఆ నియోజకవర్గం తెలుగుదేశం నేతలు చింపి వేసి, ఆయన రాకను ఖండించారు.అంతేకాక ఆయనను పార్టీలోకి ఆహ్వానించడం లేదని తెలిపారు. దీంతో దగ్గుబాటి కొన్నాళ్ల తరువాత తెలుగుదేశంలోకి రావచ్చని, తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. అక్కడ నుంచి ఈ కథలోకి ప్రవేశించిన చంద్రబాబు నేరుగా తెలుగుదేశం పార్టీలో చేరడం వల్ల ప్రజల నుంచి వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉందని, తాము పొత్తు పెట్టుకోబోతున్న బీజేపీలో చేరాలని స్వయంగా సూచించినట్లు తెలిసింది.
దీనికి దగ్గుబాటి దంపతులు అంగీకరించారు. దీనిలో భాగంగానే తొలుత పురందేశ్వరి బీజేపీలో చేరారు. తనకు విశాఖపట్నం సీటు ఇస్తారని పురందేశ్వరి భావించారు. అయితే చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర నేత కంభంపాటి హరిబాబుపై ఒత్తిడి తెచ్చి, ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసేలా చేయగలిగారు. తరువాత విజయవాడ కోరుకున్న పురందేశ్వరికి ఆ స్థానం బీజేపీకి ఇవ్వకుండా చేయగలిగారు. దీంతో ఒంగోలు నియోజకవర్గమైనా కేటాయిస్తారని ఎదురు చూసిన పురందేశ్వరికి చుక్కెదురైంది. అప్పటి వరకు మాగుంట శ్రీనివాసుల రెడ్డిని దూరంగా పెట్టిన చంద్రబాబు అకస్మాత్తుగా పిలిపించి పార్టీలో చేర్చుకుని ఒంగోలు స్థానం కేటాయించారు.
ఇక బీజేపీకి మిగిలింది కేవలం రాజంపేట సీటు మాత్రమే. అక్కడా తిరుపతి బీజే పీ నాయకురాలు శాంతారెడ్డి పోటీ చేయాలని భావిస్తుండటంతో పాటు, అక్కడ రాజకీయాలు తనకు పడవని పురందేశ్వరి ఆ సీటును వ్యతిరేకించినట్లు తెలిసింది. అయితే మరో దారి లేక ఆమె రాజంపేట నుంచి పోటీ చేయడానికి సిద్ధ పడినట్టు సమాచారం.
రాజంపేట.. వయా ఒంగోలు
Published Thu, Apr 17 2014 4:38 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement