పొత్తు పెటాకులు | general election nominations | Sakshi
Sakshi News home page

పొత్తు పెటాకులు

Published Sun, Apr 20 2014 4:11 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

general election nominations

సంతనూతలపాడులో ‘దేశం’ రగడ
 బీజేపీ స్థానంలో టీడీపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు
 బీఫారం పంపిన రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి
 బాపట్ల ఎంపీ అభ్యర్థి  చ్చరికతో ‘ధర్మం’తప్పిన అధిష్టానం
 చంద్రబాబు వైఖరితో బీజేపీ నాయకుల ఆవేదన
 
 సాక్షి ప్రతినిధి, ఒంగోలు  తెలుగుదేశం, బీజేపీల మధ్య కుదిరిన పొత్తు సంతనూతలపాడులో పెటాకులయ్యింది.  బీజేపీకి ఈ స్థానాన్ని కేటాయించిన నాటి నుంచి సంతనూతలపాడు తెలుగుదేశం పార్టీలో రగడ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఈ సీటు బీజేపీదేనని అంటూ వచ్చిన తెలుగుదేశం, పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించింది.  సంతనూతలపాడులో తెలుగుదేశం పార్టీ కూడా నామినేషను దాఖలు చేసింది. దీనికి బీ ఫారం కూడా ఆగమేఘాల మీద శనివారం హైదరాబాద్ నుంచి పంపించింది.

ఈ వ్యవహారంలో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కీలక పాత్ర పోషించారు. తెలుగుదేశం తరఫున నామినేషన్ వేసిన బీఎన్.విజయకుమార్  తాను స్వతంత్రంగానే పోటీ చేస్తానని భీష్మించుకుని కూర్చోవడంతో, సుజనా చౌదరి మధ్యవర్తిత్వం వహించినట్లు తెలిసింది.  శనివారం ఉదయం టెలిఫోన్‌లో మాట్లాడిన సుజనా చౌదరి, బీఫారంను విమానంలో పంపినట్లు తెలుస్తోంది.

విజయకుమార్‌కు సీటు ఇవ్వకపోతే, తెలుగుదేశం పార్టీకి చెందిన సంతనూతలపాడు ఓట్లు తనకు రావని,  ఆ పార్టీ బాపట్ల ఎంపీ అభ్యర్థి శ్రీరామ్ మాల్యాద్రి హెచ్చరించినట్లు తెలిసింది. ఒక దశలో విజయకుమార్‌కు బీ ఫారం ఇవ్వకపోతే, తాను పోటీ నుంచి విరమించుకుంటానని  కూడా బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో  బీఫారం పంపినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు కూడా తెలియజేయలేదని సమాచారం.

 తెలుగుదేశం పార్టీ పొత్తు ధర్మాన్ని పాటించకపోవడంపై, బీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొత్తుపెట్టుకున్న తరువాత, విధిగా తమకు రావాల్సిన స్థానాలను తమకు ఇవ్వాలని అంటున్నారు. ఇప్పటికే శ్రీకాకుళంలో ఒక స్థానాన్ని వారికి తిరిగి ఇచ్చామని అంటున్నారు.  అంత చేసినా, సంతనూతలపాడును కూడా వారు తీసేసుకుని, బీజేపీని తీవ్రంగా మోసం చేశారని అన్నారు.

దీనిపై సంతనూతలపాడు బీజేపీ అభ్యర్థి దారా సాంబయ్య మాట్లాడుతూ  పొత్తు ధర్మానికి తిలోదకాలిచ్చిన విషయం అందరికీ తెలుసని, ప్రజలే వారికి గుణపాఠం చెబుతారని అన్నారు. బీజేపీ అగ్రనాయకులకు తెలియజేయలేదా అనే ప్రశ్నకు ఇప్పటికే అన్ని టీవీ చానళ్లలో ఈ విషయం వచ్చిందని, అందరికీ తెలిసినా, మౌనంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తాను మాత్రం యథావిధిగా ప్రచారం చేసుకుంటున్నానని, అంతిమ తీర్పు ప్రజలు ఇస్తారని అన్నారు. అయితే బీజేపీకి ఇచ్చిన మాట తప్పిన చంద్రబాబు, ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలుస్తాడా అనే సందేహాన్ని పలువురు నేతలు వ్యక్తం చేయడం గమనార్హం.

 బీజేపీ నాయకుల మండిపాటు
 సాక్షి, ఒంగోలు :స్థానిక ఆంధ్రకేసరి కళాశాలలో శనివారం సాయంత్రం బీజేపీ నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి టీడీపీపై మండిపడ్డారు.  విజయ్‌కుమార్‌కు పార్టీ తరఫున బీఫారం ఇవ్వడం అంత తేలికైన విషయంగా భా వించడం లేదన్నారు.ఆ పార్టీ నమ్మకద్రోహంపై అధిష్టానానికి ఫిర్యాదు చేశామన్నారు. రాష్ట్రపార్టీ నేతలు బత్తుల నరసింహారావు, బొద్దులూరి ఆంజనేయులు, ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి దారా సాంబయ్య మాట్లాడుతూ  సంతనూతలపాడు, చీమకుర్తి మండలాల్లో స్థానికంగా ఉన్న కొందరు పారిశ్రామికవేత్తలు తెర వెనుక చక్రం తిప్పి బీఎన్ విజయ్‌కుమార్‌ను బరిలోకి దింపుతున్నట్లు అనుమానం వ్యక్తంచేశారు.

టీడీపీ బీఫారం ఇచ్చిన సంగతి అధినేత చంద్రబాబుకు తెలియదని భావిస్తున్నామని, ఆయనతోనే ఈవిషయంపై తాడోపేడో తేల్చుకునే ప్రణాళికలో ఉన్నామన్నారు. తక్షణమే బీఎన్ విజయ్‌కుమార్ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

 ఒకవేళ టీడీపీ అభ్యర్థి బరిలోనే ఉన్నప్పటికీ తాము వెనుకంజవేసే ప్రసక్తేలేదన్నారు. ఆరునూరైనా పోటీ చేస్తానంటూ దారా సాంబయ్య స్పష్టం చేశారు. ప్రత్యర్థి పార్టీ గెలుపునకు టీడీ పీ సహకరిస్తోం దని చెప్పారు. చీరాలలో శనివారం చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో తాము పాల్గొనడం లేదని వెల్లడించారు. విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా నాయకులు మువ్వల వెంకటరమణ, సీవీ రామకృష్ణ  పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement