సాక్షి, ప్రకాశం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి పేరుతో అమరేశ్వర స్వామి భూములు కొల్లగొట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. చంద్రబాబును రాజధాని గురించి అడిగితే గ్రాఫిక్స్ పేరుతో భ్రమలు కల్పిస్తున్నారని మండిపడ్డారు. రాజధాని అంటే సినిమా చూపెడతారు, కట్టు కథలు చెబుతారని విమర్శించారు. రాజధాని పేరుతో నలభై దేవాలయాలు కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా సంతనుతలపాడులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన అక్రమాలను ప్రజల దృష్టికి తీసుకువచ్చిన ఆయన.. తన కోసం ఎండను కూడా లెక్క చేయకుండా వచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
చంద్రబాబు రైతలును పట్టించుకున్న పాపాన పోలేదు..
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ నియోజకవర్గంలో సాగునీరుకే కాకుండా తాగునీరుకు ఇబ్బందే. గతంలో ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి పట్టించుకుని విధంగా ఈ నియోజకవర్గానికి సాగునీరు, తాగునీరు అందించేందుకు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రామతీర్థం, గుండ్లకమ్మ ప్రాజెక్టులను తెచ్చారు. కనీసం సాగర్ నుంచి నీరు ఇప్పించుకోలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందంటే ఇంతకంటే అన్యాయమైన పాలన ఉంటుందా?. వెలిగొండ ప్రాజెక్టు కింద పంట కాల్వలు కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. ఇవన్నీ చూస్తుంటే ఈ జిల్లా మీద, ప్రజల మీద చంద్రబాబుకు ఉన్న ప్రేమ ఏ పాటిదో తెలుస్తుంది. ఈ ఐదేళ్లలో పొగాకు రైతులు పెట్టుబడులు రాక, బతుకు కష్టమై ఆత్మహత్యలు చేసుకున్నారు. రమణారెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే కనీసం పరిహారం కూడా ఇవ్వలేదు. పరిహారం కోసం పోరాటం చేస్తే కేసులు పెట్టిన ఘనత ఈ ప్రభుత్వానిది. జగన్ అనే వ్యక్తి వచ్చి పోరాటం చేస్తే తప్ప పొగాకుకు కనీస పెట్టుబడి ధర పెరగలేదు. కంది రైతులకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వలేదు. వైఎస్సార్ హయంలో సుబాబుల్ కనీస ధర 4వేల రూపాయలు పలికితే నేడు కనీసం 2500 రూపాయలు కూడా పలకడం లేదు. శనగ రైతలకు కూడా కనీస ధర లేకుండా పోయింది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఒక్కరోజు కూడా రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు.
చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా?
ఇదే నియోజకవర్గంలో చీమకుర్తి గుండా నా పాదయాత్ర సాగింది. చీమకుర్తిలో క్వారీలు, పాలిషింగ్ యూనిట్లు మూతపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా నాలుగైదు వందల పాలిషింగ్ యూనిట్లు మూతపడిన పరిస్థితి నెలకొంది. పరిస్థితులు ఇలా ఉంటే చంద్రబాబు మాత్రం 20లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి.. 40లక్షల ఉద్యోగాలు వచ్చాయని గొప్పలు చెబుతున్నారు. ఉద్యోగాలు దొరక్క యువత బాధపడుతుంటే.. పరిశ్రమలు మూతపడుతుంటే చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా?. పెద్ద సైజు గ్రానైటు రాయల్టీ రూ. 1980 ఉంటే 5వేల రూపాయలు చేశారు. రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది. రైతుల అప్పులు లక్షా 50 వేల కోట్లకు చేరాయి. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయరు. చంద్రబాబు హయంలో కరెంట్ చార్జీలు పెరిగి పరిశ్రమలు మూతపడుతున్నాయి. బాబు వచ్చాడు ఉన్న జాబులన్నీ ఉడగొడుతు పోతున్నారు. నిరుద్యోగ భృతి రెండు వేల రూపాయలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు ప్రతి నిరుద్యోగికి లక్షా 20వేల రూపాయలు ఎగ్గొట్టారు. డ్వాక్రా రుణాలు భారం వడ్డీలతో కలిపి 26వేల కోట్లకు పెరిగింది. పొదుపు సంఘాల అక్కాచెల్లమ్మలకు సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే పద్దతి లేకుండా పోయింది.
పక్క రాష్ట్రాల్లో చికిత్స చేయించుకున బిల్లులు ఇవ్వరు..
ఎన్నికలకు ముందు మహిళ భద్రత అని చెప్పిన చంద్రబాబు.. మహిళ ఎమ్మార్వోను జుట్టు పట్టుకుని లాక్కుని వెళ్లిన, విజయవాడలో కాల్ మనీ రాకెట్టు యథేచ్ఛగా జరిగిన ఆయన చర్యలు తీసుకోరు. బీసీ పిల్లలు కనీసం ఫీజు రీయింర్స్‌మెంట్ కూడా అందక అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో గవర్నమెంట్ బడులు తగ్గిపోయాయి.. మద్యం షాపులు పెరిగిపోయాయి. నారాయణ స్కూళ్లలో ఫీజులు గుంజడానికి 6 వేల స్కూళ్లను మూసివేశారు. చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసిన బెల్ట్ షాపులే కనబడుతున్నాయి. పోలీసు స్టేషన్‌లు పెరగకపోయినా.. ప్రతి గ్రామంలో జన్మభూమి కమిటీల మాఫియా మాత్రం పెరిగిపోతుంది. బాబు ప్రత్యేక విమానంలో తిరగుతారు.. కానీ 108కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు. మంత్రి యనమల రామకృష్ణుడు పంటి నొప్పి వస్తే విదేశాల్లో చికిత్స చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పేదవారు పక్క రాష్ట్రంలో చికిత్స చేసుకుంటే బిల్లులు ఆపేస్తారు. చంద్రబాబు హయంలో ఆర్టీసీ ఛార్జీలు, ఇంటి పన్నులు, పెట్రోలు ఇలా అన్ని రెట్లు పెరిగిపోయాయి.
ఢిల్లీ నాయకులను వెంట తీసుకుని వస్తున్నారు..
రాజధాని గురించి అడిగితే రోజుకో డ్రామా చూపెడతారు. గ్రాఫిక్స్ పేరుతో భ్రమలు కల్పిస్తారు. రాజధానిలో నలభై దేవాలయాలను కూలగొట్టారు. రియల్ ఎస్టేట్ కోసం రాజధాని ఉపయోగించుకుంటున్నారు. లక్షల కోట్లతో లోకేశ్ స్థిరీకరణ నిధి తీసుకొచ్చారు. ప్రతిపక్ష పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబు.. నేడు ప్రజల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. ఒంటరిగా ప్రచారానికి వెళ్లలేక ఢిల్లీ నుంచి నాయకులను వెంట తీసకుపోయే పరిస్థితి నెలకొంది. 600 వాగ్ధానాలు చేసిన చంద్రబాబు.. వాటిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు మీ భవిష్యత్తు నా భరోసా అంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది చంద్రబాబు చేయని మోసం, చెప్పని అబద్దం ఉండదు. రానున్న రోజుల్లో ఈ కుట్రలు ఇంకా పెరుగుతాయి. ప్రతి ఊరికి మూటలు, మూటలు డబ్బులు తీసుకోస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో మూడు వేల రూపాయల నగదును పెడతారు. మీరందరు గ్రామాలకు వెళ్లి ప్రతి ఒక్కరికి చంద్రబాబు మోసాల గురించి చెప్పాలి.
గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం..
చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోకండని గ్రామాల్లోని అక్కాచెల్లమ్మలకు, అవ్వ తాతలకు చెప్పండి. ఇరవై రోజులు ఓపిక పట్టమని చెప్పండి. జగనన్న చెప్పకపోయి ఉంటే పించన్ రెండు వేలకు పెరిగేదా అని గుర్తుచేయండి. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న ఏటా రూ. 15 వేల రూపాయలు ఇస్తాడని ప్రతి అక్కాచెల్లమ్మకు చెప్పండి. ఏ చదువైనా అన్న చదివిస్తాడని.. ఎన్ని లక్షలైనా కూడా భరిస్తాడని ప్రతి ఇంట్లో చెప్పండి. గతంలో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు వచ్చేవి. ఇప్పుడు అది కనిపించని పరిస్థితి. ఎన్నికల తేదీ వరకు ఎంతైతే అప్పు ఉంటుందో ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా మీ చేతికే అందిస్తాం. అంతేకాకుండా మళ్లీ బ్యాంకుల వద్ద నుంచి సున్నా వడ్డీకే రుణాలు వస్తాయని చెప్పండి. మహిళలను లక్షాధికారులను చేయాలనే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్ చేయూత కింద 75 వేల రూపాయలు నాలు దఫాలుగా చెల్లిస్తాం. పసుపు కంకుమ డ్రామాకు మోసపోవద్దని ప్రతి అక్కకు చెప్పండి. చంద్రబాబు చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితి. రైతలకు గిట్టుబాటు ధర ఇవ్వడమే కాకుండా.. గిట్టుబాటు ధరలకు గ్యారెంటీ కూడా ఇస్తాం. ప్రతి రైతన్నకు మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తాం. నవరత్నాల గురించి ప్రతి అవ్వకు, తాతకు చెప్పిండి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధాకర్‌ని, ఎంపీ అభ్యర్థి సురేశ్‌ని ఆశీర్వదించమ’ని కోరారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment