రాష్ట్ర వ్యాప్తంగా 8 నెలలుగా జీతాలు నిల్
జిల్లాలో మూడు నెలలుగా పస్తులు
మంత్రి, జిల్లా యంత్రాంగానికి
విన్నవించినా ప్రయోజనం శూన్యం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : గ్రామీణ నీటి సరఫరా విభాగంలో నీటి నాణ్యతా పరిశీలన సిబ్బంది జీతాల్లేక విలవిల్లాడుతున్నారు. ప్రభుత్వ పథకాలతో పాటు వ్యక్తిగత బోర్ల నీటి శాంపిళ్లను పరిశీలించాల్సిన సిబ్బందికి రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఆందోళన చెందతున్నారు. వాటర్ ఎనలిస్ట్స్, మైక్రో బయాలజిస్ట్‌లు, లాబ్ అసిస్టెంట్లు, హెల్పెర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, కన్సల్టెంట్లగా ప్రభుత్వం థర్డ్ పార్టీ ఔట్‌సోర్సింగ్ విభాగాల ద్వారా సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగిస్తోంది. వాస్తవానికి 2009 నుంచీ వీళ్లందర్నీ శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2013లో మరో క మిటీ వేసింది. అయినప్పటికీ చాలీ చాలని జీతాలతోనే తాము కుటుంబాల్ని నెట్టుకువస్తున్నా మని సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు.
ఇదీ పరిస్థితి
రాష్ర్ట వ్యాప్తంగా గ్రామీణ నీటి సరఫరా విభాగంలో మొత్తం 497 మంది సిబ్బంది కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తుండగా శ్రీకాకుళం జిల్లాలో 39 మంది ఉన్నారు. వీరందరికీ 8 నెలల నుంచీ జీతాల్లేవు. సిబ్బంది గగ్గోలు పెడుతుండడంతో జిల్లా యంత్రాంగం ప్రత్యామ్నాయాల ద్వారా ఐదు నెలల వరకూ జీతాలు చెల్లించేసినా మూడు నెలల నుంచీ ఈ విషయమై పట్టించుకోవడం లేదు. జిల్లాకు ముఖ్యమంత్రి వచ్చిన సందర్భంగా కాంట్రాక్ట్ సిబ్బంది సమస్యను అధికార యంత్రాంగం సహా రాజకీయ నేతలు తీసుకెళ్లనీయకుండా చేసిందన్న విమర్శలున్నాయి. అదే విషయమై హైదరాబాద్‌లో ఉన్న చీఫ్ ఇంజినీర్ (గతంలో ఇంజినీర్ ఇన్ చీఫ్) సహా మంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్లినా ఫలితం లేకపోయిందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 105 ల్యాబ్‌లుండగా జిల్లాలో ఎనిమిది మంచినీటి శుద్ధి నాణ్యతా ల్యాబులున్నాయి. 19 డివిజన్లలో, 73 సబ్ డివిజన్ల పరిధిలో 13 జిల్లా స్థాయి ల్యాబ్‌లున్నా ఇందులో పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వాస్తవానికి వీరి జీతాలు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే సంబంధింత జిల్లా సూపరింటెండెంట్ అధికారి ద్వారా చెల్లిస్తారు. ‘స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్’ (ఎస్‌ఎస్‌ఆర్) ద్వారా రూ.9 వేల నుంచి రూ.20 వేల (స్థాయిని బట్టి) వరకు చెల్లిస్తున్నారు. అదీ కొంతమందికి నిబంధనలకు అనుగుణంగా కూడా చెల్లించడం లేదనే ఆరోపణలున్నాయి. పెండింగ్ వేతనాలకు సంబంధించి గత ఫిబ్రవరిలో కమిటీ వేసి నెల వ్యవధిలో నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించినా ఫలితం లేకపోయిందని సిబ్బంది చెబుతున్నారు.
జీతాలకు నోచని నాణ్యతా సిబ్బంది!
Published Thu, Mar 19 2015 2:39 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement