రూ.37.65 కోట్లు ఇవ్వండి ప్లీజ్..
సాక్షి, సంగారెడ్డి: జిల్లాను కలవరపెడుతున్న తాగునీటి ఎద్దడి నివారణకు గ్రామీణ నీటి సరఫరా శాఖ ప్రభుత్వానికి రూ.37.65 కోట్లతో ప్రత్యామ్నాయ ప్రణాళికను అందజేసింది. కరువు, భూగర్భ జలమట్టాలు పడిపోవటం, రిజర్వాయర్లలో నీళ్లు నిండుకోవటంతో తాగునీటి ఇబ్బందులు మొదలయ్యాయి. గ్రామాల్లో బోరుబావులు ఇంకిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సమస్యను ఎదుర్కొనేందుకు వీలుగా ఆర్‌డబ్ల్యూఎస్ రూ.37.65 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలను అందజేసింది.
సీఆర్‌ఎఫ్ కింద రూ.9.47 కోట్లతో 4,314 పనులు ప్రతిపాదించగా నాన్ సీఆర్‌ఎఫ్ కేటగిరిలో రూ.28.18 కోట్లతో 76,511 పనులను ప్రతిపాదించింది. తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయ బోరుబావులను అద్దెకు తీసుకోవటం, తాగునీటి రవాణా, బోరుబావులు, రక్షిత మంచినీటి పథకాల మరమ్మతులు, పైప్‌లైన్ పనులను అధికారులు ప్రతిపాదించారు. ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేసిన వెంటనే గ్రామాల్లో తాగునీటి సమస్య నివారణ కోసం చర్యలు తీసుకోనున్నారు.
1,939 ఆవాసాల్లో ఎద్దడి..
జిల్లాలోని 1939 ఆవాస ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉన్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్ యంత్రాంగం గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో ఉంటున్న 21.49 లక్షల మంది జనాభా తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు అధికారులు చెప్పారు. ఆయా పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి సీఆర్‌ఎఫ్, నాన్ సీఆర్‌ఎఫ్ కేటగిరీల్లో నిధులు మంజూరవుతాయని చెబుతున్నారు.
గతంలో తాగునీటి సరఫరా పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నాన్ సీఆర్‌ఎఫ్ కింద భారీగా నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం కరువు పరిస్థితులు, నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం జిల్లా యంత్రాంగం కోరినంత మేర నిధులు మంజూరు చేసే అవకాశం ఉందని అంటున్నారు.