Alternative Plan
-
PM PRANAM: రసాయన ఎరువులకు ‘పీఎం–ప్రణామ్’తో చెక్!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా కొత్త పథకాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అంతేకాకుండా రసాయన ఎరువులపై సబ్సిడీ భారాన్ని తగ్గించుకోవడానికి ప్రధానమంత్రి ప్రమోషన్ ఆఫ్ ఆల్టర్నేట్ న్యూట్రియంట్స్ ఫర్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ (పీఎం–ప్రణామ్) యోజనను తీసుకొచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా రసాయన ఎరువుల వినియోగం భారీగా పెరగడం, వాటిపై రాయితీలు మోయలేని భారంగా మారుతున్న నేపథ్యంలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. సబ్సిడీల భారం రూ.2.25 లక్షల కోట్లు! దేశంలో రసాయన ఎరువుల వాడకం ప్రతి ఏటా విపరీతంగా పెరిగిపోతోంది. 2017–18లో వినియోగం 5.28 కోట్ల మెట్రిక్ టన్నులు కాగా, 2021–22 నాటికి 6.40 కోట్ల మెట్రిక్ టన్నులకు (21శాతం) పెరిగింది. ఇందులో యూరియా వినియోగం 2017–18లో 2.98 కోట్ల మెట్రిక్ టన్నుల నుంచి 2021–22 నాటికి ఏకంగా 3.56 కోట్ల మెట్రిక్ టన్నులకు (19.64 శాతం) చేరుకుంది. అలాగే డీఏపీ వినియోగం 98.77 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 1.23 కోట్ల మెట్రిక్ టన్నులకు (25.44 శాతం) పెరిగింది. ఇతర ఎరువుల వినియోగం సైతం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. దానికి అనుగుణంగానే సబ్సిడీల భారం పెరుగుతూ వస్తోంది. 2020–21లో సబ్సిడీల భారం రూ.1.27 లక్షల కోట్లు కాగా, 2021–22 నాటికి రూ.1.62 లక్షల కోట్లకు చేరింది. 2022–23 నాటికి రూ.2.25 లక్షల కోట్లు చేరుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకే ‘పీఎం–ప్రణామ్’ పథకంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మిగిలే నిధులతో పథకం అమలు ‘పీఎం–ప్రణామ్’ కింద కేంద్ర సర్కారు ఎలాంటి ప్రత్యేక బడ్జెట్ కేటాయించదు. వివిధ కేంద్ర పథకాల కింద ఉన్న ఎరువుల సబ్సిడీలను ఆదా చేయడం ద్వారా మిగిలే నిధులతో ఈ పథకాన్ని అమలు చేయనుంది. మిగులు నిధుల్లో 50 శాతం సొమ్మును రాష్ట్రాలకు గ్రాంట్‌గా అందిస్తుంది. ఈ గ్రాంట్‌లో 70 శాతం నిధులను గ్రామ, బ్లాక్, జిల్లా స్థాయిల్లో ప్రత్యామ్నాయ ఎరువులు, ప్రత్యామ్నాయ ఎరువుల ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుకు వినియోగించవచ్చు. మిగిలిన 30 శాతం నిధులను రసాయన ఎరువుల వాడకం తగ్గింపుపై రైతుల్లో అవగాహన కల్పించిన పంచాయతీలకు, రైతు సంఘాలకు, స్వయం సహాయక సంఘాలకు బహుమతులు ఇవ్వడానికి, ఇతర ప్రోత్సాహకాలకు ఉపయోగించుకోవచ్చు. పీఎం–ప్రణామ్ యోజనకు సంబంధించిన లక్ష్యాలపై రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. రాష్ట్రాల అభిప్రాయాలు పూర్తిగా తెలుసుకున్నాక తుది ముసాయిదాను సిద్ధం చేయనుంది. -
TS: ప్రత్యామ్నాయ సాగు.. వరికి బదులు ఐదు పంటలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరి సాగును తగ్గించాలని నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం.. వచ్చే యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు రైతులను సన్నద్ధం చేసే దిశగా వ్యవసాయ శాఖ చర్యలు మొదలుపెట్టింది. గత ఏడాది యాసంగి సాగుతో పోలిస్తే దాదాపు 23శాతం దాకా వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి.. బదులుగా ఇతర పంటలను సాగు చేయించాలని జిల్లా అధికారులకు అంతర్గత ఆదేశాలు జారీచేసింది. వ్యవసాయ అధికారులు ప్రత్యామ్నాయ పంటల దిశగా రైతులను సన్నద్ధం చేసేందుకు అవగాహన కార్యక్రమాలు మొదలుపెట్టారు. అయితే చాలాచోట్ల రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ముందుకు రావడంలేదని అధికారులు చెప్తున్నారు. ‘‘మేం గ్రామాలకు వెళ్లి వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని రైతులను కోరుతున్నాం. కానీ విత్తనాల నుంచి కొనుగోళ్ల దాకా రైతులు వ్యక్తం చేస్తున్న సందేహాలు, లేవనెత్తుతున్న ప్రశ్నలకు ఏం చెప్పాలో అర్థంగాక మధ్యలోనే సభలను రద్దు చేసుకొని వెనుదిరుగుతున్నాం’’ అని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మండల వ్యవసాయాధికారి పేర్కొన్నారు. కొద్దికొద్దిగా తగ్గించేలా.. రాష్ట్రంలో వరిసాగు తగ్గించాలన్న ప్రభుత్వ ఆదేశం మేరకు రంగంలోకి దిగిన అధికారులు పలు ప్రతిపాదనలు రూపొందించారు. ఒకేసారి భారీగా వరి సాగు తగ్గించాలంటే రైతులు ముందుకు రారన్న ఆలోచనతో.. ముందుగా కొద్ది మొత్తంలో తగ్గించాలని నిర్ణయానికి వచ్చారు. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో వరి విస్తీర్ణాన్ని ఎక్కడ, ఏ మేర తగ్గించాలన్న దానిపై ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్రణాళికల ప్రకారం.. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి, ఐదు రకాల పంటలను వేయించాలని జిల్లాల అధికారులను ఆదేశించారు. తప్పదంటేనే.. మినహాయింపు ఎక్కడైనా రైతులు తప్పనిసరిగా వరి మాత్రమే వేస్తామన్న భావనతో ఉంటే, ఎక్కడైనా వరి పండించడం అనివార్యమైతేనే.. ప్రత్యామ్నాయ సాగును మినహాయించాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించింది. అదికూడా ఎఫ్‌సీఐ సూచించిన ఫైన్ రకాల వరినే పండించేలా చూడాలని స్పష్టం చేసింది. వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, పెసర, శనగ పంటలకు సంబంధించి.. ఆయా జిల్లాల పరిధిలో ఎక్కడ, ఏ పంట అనుకూలమో గుర్తించాలని సూచించింది. మొత్తంగా 2,604 క్లస్టర్ల వారీగా షెడ్యూల్‌ను తయారు చేయాలని పేర్కొంది. ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని.. స్థానిక ప్రజాప్రతినిధులు, రైతుబంధు సమితి సభ్యులు అందులో పాల్గొనేలా చూడాలని స్పష్టం చేసింది. ఈ నెల 30 నాటికి శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయాలని సూచించింది. మాకు భరోసా ఏది? ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలంటూ వ్యవసాయశాఖ నిర్వహిస్తున్న అవగాహన సదస్సుల్లో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వరికి బదులు సాగుచేయాలని సూచిస్తున్న ఐదు పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తారా అని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఆయా పంటల విత్తనాలను సబ్సిడీపై అందజేసే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదేమని నిలదీస్తున్నారు. గత ఏడాది నుంచి సబ్సిడీ ఎత్తివేయడంతో విత్తనాలు కొనుగోలు చేయడం కష్టంగా మారిందని చెప్తున్నారు. వ్యవసాయశాఖ సూచిస్తున్న ఐదు రకాల పంటలు వరికి ప్రత్యామ్నాయం కాబోవని, పైగా లాభాలు కూడా ఉండబోవని స్పష్టం చేస్తున్నారు. అయితే విత్తన సబ్సిడీ, పంటల కొనుగోళ్లపై తమకు పైస్థాయి నుంచి సమాచారమేదీ లేకపోవడంతో రైతులకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేని పరిస్థితి నెలకొందని వ్యవసాయాధికారులు అంటున్నారు. మూడు జోన్లు.. ఐదు పంటలు.. ఉత్తర తెలంగాణ జోన్ కింద ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలను చేర్చారు. ఈ జిల్లాల్లో గత యాసంగిలో సాగైన వరి విస్తీర్ణంలో 20–25 శాతం వరకు తగ్గించి.. బదులుగా వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, శనగ సాగు చేయించాలని నిర్ణయించారు. సెంట్రల్ తెలంగాణ జోన్ కింద సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో గత యాసంగితో పోలిస్తే 10–15 శాతం వరి తగ్గించి.. దాని స్థానంలో వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, శనగ సాగు చేయించనున్నారు. దక్షిణ తెలంగాణ జోన్లో మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, నారాయణపేట జిల్లాలను చేర్చారు. ఈ జిల్లాల్లో ఏకంగా 20–30 శాతం దాకా వరి తగ్గించి.. బదులుగా వేరుశనగ, పొద్దు తిరుగుడు, శనగ, పెసర పంటలు వేసేలా రైతులను సన్నద్ధం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలను కొనే దిక్కేది? తెలంగాణ కోటి ఎకరాల మాగాణ అని చెప్పి ఇప్పుడు వరి వద్దంటే ఎలా? సాగునీరు ఉన్న ప్రాంతాల్లో వరి తప్ప మరేం సాగు చేయగలరు? వరి వద్దనడం అశాస్త్రీయం. అయినా ప్రత్యామ్నాయ పంటలు అంటూ.. వేరుశనగ, పొద్దుతిరుగుడు వంటివి చూపిస్తున్నారు. వాటిని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఇప్పటివరకు ముందుకు రాలేదు. రెండు, మూడు జిల్లాలకే పరిమితమైన వేరుశనగను కొనడానికే అప్పట్లో ప్రభుత్వం నానాయాతన పడింది. ఇప్పుడు అన్ని జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేస్తే కొనే పరిస్థితి ఉంటుందా? ప్రభుత్వం ఈ అంశంపై వ్యవసాయ నిపుణులు, రైతు సంఘాలతో చర్చించి రైతులకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటే బాగుండేది. ప్రత్యామ్నాయంగా కనీసం కూరగాయల సాగును ప్రోత్సహించినా బాగుండేది. – టి.సాగర్, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రైతు సంఘం -
లాక్‌డౌన్‌కు ఆరు ప్రత్యామ్నాయాలు!
సాక్షి, ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లాక్డౌను నివారించేందుకు ప్రత్యామ్నాయాలను వెతుకుతోంది. లాక్‌డౌన్‌న్‌వద్దనుకుంటే కరోనా నిబంధనల్ని కచ్చితంగా పాటించాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేసిన హెచ్చరికల నేపథ్యంలో బీఎంసీ ఆరు ప్రత్యామ్నాయాలు సూచించింది. రైళ్లల్లో, కార్యాలయాల్లో, మార్కెట్లల్లో విపరీతమైన జనసందోహం పెరగడం వల్లే కరోనా వేగంగా వ్యాపిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. లోకల్ రైళ్లలో పెరిగిన రద్దీ వల్లే కరోనా వ్యాప్తి చెందుతున్నందున వల్ల లోకల్ రైళ్లల్లో రద్దీని తగ్గించడం ఒక్కటే ప్రత్యామ్నాయంగా బీఎంసీ భావిస్తోంది. అయితే సుదీర్ఘ కాలంగా లోకల్ రైళ్లను రద్దు చేయడం వల్ల ఉపాధి కోల్పోయి జనాలు ఎంతో ఇబ్బందిపడ్డారు. ఇప్పుడిప్పుడే లోకల్ రైళ్లు ప్రారంభించడంతో జనం కళ్లల్లో ఆనందం తొంగిచూస్తోంది. ఇప్పుడు మళ్లీ లాక్డౌన్ విధించి లోకల్ రైళ్ల సేవల్ని రద్దు చేయడం అంతగా ఆమోదయోగ్యం కాకపోవడంతో మున్సిపల్ కార్పొరేషన్ ఆరు ప్రత్యామ్నాయాలతో ముందుకు వచ్చింది. ఈ ప్రతిపాదన రైల్వే బోర్డుకు పంపించేందుకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు నిర్వహిస్తామని బీఎంసీ ఇక్బాల్‌సింగ్ చహల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 80 శాతం కరోనా రోగుల్లో లక్షణాలేవీ కనిపించకపోవడం ప్రమాదకరంగా మారుతోందని, రాబోయే 15 రోజుల్లో కరోనా బాధితుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయనీ, ఇప్పట్నుంచే తగిన చర్యలు చేపట్టడం అనివార్యంగా మారిందని ఆయన అన్నారు. మళ్లీ తెరుచుకోనున్న కరోనా కేర్ సెంటర్లు! కరోనా మహమ్మారి ప్రభావం మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కేర్ సెంటర్లన్నింటిని మళ్లీ తెరవాలని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చహల్ అదేశాలు జారీచేశారు. దీంతో మరోసారి కరోనా సెంటర్లు తెరుచుకోనున్నాయి. బీఎంసీ ఆధీనంలో ఉన్న కరోనా కేర్ సెంటర్లలో మొత్తం 70,518 పడకలు ఉండగా వాటిలో ప్రస్తుతం కేవలం 13,135 పడకలపై రోగులు చికిత్సను పొందుతున్నారు. 9,757 పడకల్ని రిజర్వ్ చేసి ఉంచారు. కరోనా రోగుల సంఖ్య తగ్గుముఖం పట్టడం వల్ల ఎక్కువ శాతం కరోనా కేర్ సెంటర్లను మూసివేశారు. అయితే ఏడు జంబో కరోనా సెంటర్లను, ప్రతి విభాగంలో ఒకటి చొప్పున స్థానికంగా మొత్తం 24 కరోనా సెంటర్లను మాత్రం మార్చి 31 వరకు తెరిచి ఉంచాలని నిర్ణయించారు. కాగా, ప్రస్తుతం రోగుల సంఖ్య పెరగడంతో 30 శాతం పడకలు నిండిపోయాయి. దీంతో మూసి వేసిన కరోనా సెంటర్లన్నింటిని మళ్లీ తెరవాలనీ బీఎంసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు బాధితుల మెడికల్ రిపోర్టు 24 గంటల్లో కార్పొరేషన్‌కు తెలియచేయడం, రిపోర్టులన్నింటిని సంబంధిత విభాగంలో వెంటనే అప్లోడ్ చేయడం అనివార్యం చేశారు. రోగుల చికిత్సకు కావాల్సిన ఏర్పాట్లన్ని చేసుకోవాలనీ, ఐసీయూ పడకలు, అక్సిజన్ పడకలు, అంబులెన్స్‌లు, సిబ్బందిని, చికిత్సకు సంబంధించిన అన్ని అంశాలను సిద్ధంగా ఉంచాలనీ అన్ని విభాగాల్లోని డిప్యూటీ కమిషనర్లకు బీఎంసీ కమిషనర్ ఇక్బాల్‌సింగ్ ఆదేశాలు జారీ చేశారు. కరోనా సోకినవారిని, కరోనా లక్షణాలు కనిపించిన వారిని హాస్పిటల్లో చేర్పించే బాధ్యత ఆయా వార్డుల్లోని ‘వార్డ్ వార్ రూమ్’ కే అప్పగించారు. ఎప్పటికప్పుడు ఆయా ఆసుపత్రిలోని పడకల లభ్యత, రోగుల వివరాలు వార్డ్‌వార్ రూమ్‌లో అందుబాటులో ఉండేలా బీఎంసీ ఆరోగ్యశాఖ అధికారాలు ఏర్పాట్లు చేస్తున్నారు. బీఎంసీ ప్రత్యామ్నాయాలు.. ఒకటి: అత్యవసరంగా పనికి వెళ్లే వారినే లోకల్ రైళ్లలో ప్రయాణం చేసేందుకు అనుమతించాలి. రెండు: వర్క్ ఫ్రం హోమ్‌ను ప్రోత్సహించాలి, మూడు: ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసు సిబ్బంది సంఖ్యను 15 రోజులకు 50 శాతం తగ్గించాలి. నాలుగు: లోకల్ రైళ్ల టికెట్ బుకింగ్ కౌంటర్లను మూసివేయాలి. ఆన్లైన్ టికెట్ బుకింగ్‌లను కొనసాగించి. నెలవారీ పాసులు జారీ చేయడాన్ని నిషేధించాలి. ఐదు: షాపుల పని వేళల్లో మార్పులు చేయాలి. సరి బేసి తేదీల ప్రకారం దుకాణాలు తెరిచి ఉంచాలి. ఆరు: వసై–విరార్, కల్యాణ్–డోంబివిలి, అంబర్నాథ్, బద్లాపూర్, కసారా, కర్జత్, పాల్ఘర్, నవీముంబై నుంచి ముంబై వరకు స్టేట్ ట్రాన్స్‌పోర్టు బస్సుల్ని ఎక్కువ సంఖ్యలో నడిపించి లోకల్ రైళ్ల భారాన్ని తగ్గించాలి. -
రూ.37.65 కోట్లు ఇవ్వండి ప్లీజ్..
సాక్షి, సంగారెడ్డి: జిల్లాను కలవరపెడుతున్న తాగునీటి ఎద్దడి నివారణకు గ్రామీణ నీటి సరఫరా శాఖ ప్రభుత్వానికి రూ.37.65 కోట్లతో ప్రత్యామ్నాయ ప్రణాళికను అందజేసింది. కరువు, భూగర్భ జలమట్టాలు పడిపోవటం, రిజర్వాయర్లలో నీళ్లు నిండుకోవటంతో తాగునీటి ఇబ్బందులు మొదలయ్యాయి. గ్రామాల్లో బోరుబావులు ఇంకిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సమస్యను ఎదుర్కొనేందుకు వీలుగా ఆర్డబ్ల్యూఎస్ రూ.37.65 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలను అందజేసింది. సీఆర్ఎఫ్ కింద రూ.9.47 కోట్లతో 4,314 పనులు ప్రతిపాదించగా నాన్ సీఆర్ఎఫ్ కేటగిరిలో రూ.28.18 కోట్లతో 76,511 పనులను ప్రతిపాదించింది. తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయ బోరుబావులను అద్దెకు తీసుకోవటం, తాగునీటి రవాణా, బోరుబావులు, రక్షిత మంచినీటి పథకాల మరమ్మతులు, పైప్‌లైన్ పనులను అధికారులు ప్రతిపాదించారు. ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేసిన వెంటనే గ్రామాల్లో తాగునీటి సమస్య నివారణ కోసం చర్యలు తీసుకోనున్నారు. 1,939 ఆవాసాల్లో ఎద్దడి.. జిల్లాలోని 1939 ఆవాస ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉన్నట్లు ఆర్డబ్ల్యూఎస్ యంత్రాంగం గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో ఉంటున్న 21.49 లక్షల మంది జనాభా తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు అధికారులు చెప్పారు. ఆయా పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి సీఆర్ఎఫ్, నాన్ సీఆర్ఎఫ్ కేటగిరీల్లో నిధులు మంజూరవుతాయని చెబుతున్నారు. గతంలో తాగునీటి సరఫరా పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నాన్ సీఆర్ఎఫ్ కింద భారీగా నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం కరువు పరిస్థితులు, నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం జిల్లా యంత్రాంగం కోరినంత మేర నిధులు మంజూరు చేసే అవకాశం ఉందని అంటున్నారు.