లాక్‌డౌన్‌కు ఆరు ప్రత్యామ్నాయాలు! | Brihanmumbai Municipal Corporation Looking Alternatives To Avoid Lockdown | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌కు ఆరు ప్రత్యామ్నాయాలు!

Published Thu, Feb 25 2021 12:54 AM | Last Updated on Thu, Feb 25 2021 9:15 AM

Brihanmumbai Municipal Corporation Looking Alternatives To Avoid Lockdown - Sakshi

సాక్షి, ముంబై‌: బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ లాక్‌డౌను నివారించేందుకు ప్రత్యామ్నాయాలను వెతుకుతోంది. లాక్‌డౌన్‌న్‌వద్దనుకుంటే కరోనా నిబంధనల్ని కచ్చితంగా పాటించాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే చేసిన హెచ్చరికల నేపథ్యంలో బీఎంసీ ఆరు ప్రత్యామ్నాయాలు సూచించింది. రైళ్లల్లో, కార్యాలయాల్లో, మార్కెట్లల్లో విపరీతమైన జనసందోహం పెరగడం వల్లే కరోనా వేగంగా వ్యాపిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. లోకల్‌ రైళ్లలో పెరిగిన రద్దీ వల్లే కరోనా వ్యాప్తి చెందుతున్నందున వల్ల లోకల్‌ రైళ్లల్లో రద్దీని తగ్గించడం ఒక్కటే ప్రత్యామ్నాయంగా బీఎంసీ భావిస్తోంది. అయితే సుదీర్ఘ కాలంగా లోకల్‌ రైళ్లను రద్దు చేయడం వల్ల ఉపాధి కోల్పోయి జనాలు ఎంతో ఇబ్బందిపడ్డారు.

ఇప్పుడిప్పుడే లోకల్‌ రైళ్లు ప్రారంభించడంతో జనం కళ్లల్లో ఆనందం తొంగిచూస్తోంది. ఇప్పుడు మళ్లీ లాక్‌డౌన్‌ విధించి లోకల్‌ రైళ్ల సేవల్ని రద్దు చేయడం అంతగా ఆమోదయోగ్యం కాకపోవడంతో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆరు ప్రత్యామ్నాయాలతో ముందుకు వచ్చింది. ఈ ప్రతిపాదన రైల్వే బోర్డుకు పంపించేందుకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు నిర్వహిస్తామని బీఎంసీ ఇక్బాల్‌సింగ్‌ చహల్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 80 శాతం కరోనా రోగుల్లో లక్షణాలేవీ కనిపించకపోవడం ప్రమాదకరంగా మారుతోందని, రాబోయే 15 రోజుల్లో కరోనా బాధితుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయనీ, ఇప్పట్నుంచే తగిన చర్యలు చేపట్టడం అనివార్యంగా మారిందని ఆయన అన్నారు.  

మళ్లీ తెరుచుకోనున్న కరోనా కేర్‌ సెంటర్లు! 
కరోనా మహమ్మారి ప్రభావం మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కేర్‌ సెంటర్లన్నింటిని మళ్లీ తెరవాలని బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ ఇక్బాల్‌ సింగ్‌ చహల్‌ అదేశాలు జారీచేశారు. దీంతో మరోసారి కరోనా సెంటర్లు తెరుచుకోనున్నాయి. బీఎంసీ ఆధీనంలో ఉన్న కరోనా కేర్‌ సెంటర్లలో మొత్తం 70,518 పడకలు ఉండగా వాటిలో ప్రస్తుతం కేవలం 13,135 పడకలపై రోగులు చికిత్సను పొందుతున్నారు. 9,757 పడకల్ని రిజర్వ్‌ చేసి ఉంచారు. కరోనా రోగుల సంఖ్య తగ్గుముఖం పట్టడం వల్ల ఎక్కువ శాతం కరోనా కేర్‌ సెంటర్లను మూసివేశారు. అయితే ఏడు జంబో కరోనా సెంటర్లను, ప్రతి విభాగంలో ఒకటి చొప్పున స్థానికంగా మొత్తం 24 కరోనా సెంటర్లను మాత్రం మార్చి 31 వరకు తెరిచి ఉంచాలని నిర్ణయించారు.

కాగా, ప్రస్తుతం రోగుల సంఖ్య పెరగడంతో 30 శాతం పడకలు నిండిపోయాయి. దీంతో మూసి వేసిన కరోనా సెంటర్‌లన్నింటిని మళ్లీ తెరవాలనీ బీఎంసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు బాధితుల మెడికల్‌ రిపోర్టు 24 గంటల్లో కార్పొరేషన్‌కు తెలియచేయడం, రిపోర్టులన్నింటిని సంబంధిత విభాగంలో వెంటనే అప్‌లోడ్‌ చేయడం అనివార్యం చేశారు. రోగుల చికిత్సకు కావాల్సిన ఏర్పాట్లన్ని చేసుకోవాలనీ, ఐసీయూ పడకలు, అక్సిజన్‌ పడకలు, అంబులెన్స్‌లు, సిబ్బందిని, చికిత్సకు సంబంధించిన అన్ని అంశాలను సిద్ధంగా ఉంచాలనీ అన్ని విభాగాల్లోని డిప్యూటీ కమిషనర్‌లకు బీఎంసీ కమిషనర్‌ ఇక్బాల్‌సింగ్‌ ఆదేశాలు జారీ చేశారు.

కరోనా సోకినవారిని, కరోనా లక్షణాలు కనిపించిన వారిని హాస్పిటల్‌లో చేర్పించే బాధ్యత ఆయా వార్డుల్లోని ‘వార్డ్‌ వార్‌ రూమ్‌’ కే అప్పగించారు. ఎప్పటికప్పుడు ఆయా ఆసుపత్రిలోని పడకల లభ్యత, రోగుల వివరాలు వార్డ్‌వార్‌ రూమ్‌లో అందుబాటులో ఉండేలా బీఎంసీ ఆరోగ్యశాఖ అధికారాలు ఏర్పాట్లు చేస్తున్నారు. 

బీఎంసీ ప్రత్యామ్నాయాలు.. 
ఒకటి: అత్యవసరంగా పనికి వెళ్లే వారినే లోకల్‌ రైళ్లలో ప్రయాణం చేసేందుకు అనుమతించాలి. 
రెండు: వర్క్‌ ఫ్రం హోమ్‌ను ప్రోత్సహించాలి,  
మూడు: ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆఫీసు సిబ్బంది సంఖ్యను 15 రోజులకు 50 శాతం తగ్గించాలి.  
నాలుగు: లోకల్‌ రైళ్ల టికెట్‌ బుకింగ్‌ కౌంటర్‌లను మూసివేయాలి. ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లను కొనసాగించి. నెలవారీ పాసులు జారీ చేయడాన్ని నిషేధించాలి. 
ఐదు: షాపుల పని వేళల్లో మార్పులు చేయాలి. సరి బేసి తేదీల ప్రకారం దుకాణాలు తెరిచి ఉంచాలి.  
ఆరు: వసై–విరార్, కల్యాణ్‌–డోంబివిలి, అంబర్‌నాథ్, బద్లాపూర్, కసారా, కర్జత్, పాల్ఘర్, నవీముంబై నుంచి ముంబై వరకు స్టేట్‌ ట్రాన్స్‌పోర్టు బస్సుల్ని ఎక్కువ సంఖ్యలో నడిపించి లోకల్‌ రైళ్ల భారాన్ని తగ్గించాలి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement