strains
-
శ్రీలంకతో వన్డే సిరీస్.. ఆస్ట్రేలియాకు భారీ షాక్..!
శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మిచిల్ మార్ష్ గాయం కారణంగా వన్డే సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కొలంబోలో శ్రీలంకతో జరిగిన రెండో టీ20 సమయంలో మార్ష్ వెన్ను నొప్పితో బాధపడ్డాడు. దీంతో పల్లెకెలె వేదికగా జరిగిన మూడో టీ20కి మార్ష్ దూరమయ్యాడు. అయితే అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు రెండు వారాలు సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డే పల్లెకెలె వేదికగా జాన్ 14న జరగనుంది. మరోవైపు శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0తో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా వన్డే జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), అష్టన్ అగర్, అలెక్స్ కారీ, పాట్ కమిన్స్, కెమెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్ , డేవిడ్ వార్నర్ చదవండి: SL vs AUS: టీ20ల్లో చరిత్ర సృష్టించిన శ్రీలంక.. తొలి జట్టుగా..! -
మనోళ్ల ‘ఉమ్మి’ తుడవడానికి వెయ్యి కోట్ల పైనే!
లాక్డౌన్ టైంలో మీరొకటి గమనించారా?.. రోడ్ల మీద బహిరంగ మలమూత్ర విసర్జనలు, ఉమ్మేయడాలు లాంటి చర్యలు బాగా తగ్గిపోయాయి. అఫ్కోర్స్.. బయటికి రాకపోవడం వల్ల చాలామందికి ఈ విషయం తెలియకపోయి ఉండొచ్చు. ఎప్పుడైతే జనసంచారం మొదలైందో.. మళ్లీ ఈ వ్యవహారం పుంజుకుంది. ‘దయచేసి ఇక్కడ ఉమ్మేయకండి’.. అని వాళ్ల వాళ్ల భాషల్లో అర్థమయ్యేలా బోర్డులు రాసి పెడుతున్నప్పటికీ.. మొహమాటానికి కూడా పోకుండా ఉమ్మేయడం మనవాళ్లకి అలవాటైన వ్యవహారమే!. ఇక రోడ్ల సంగతి పక్కనపెడితే.. రైల్వే స్టేషన్లలో, రైళ్లలో, పట్టాల మీద.. ఆఖరికి రైళ్ల మీద కూడా నిర్మొహమాటంగా ఉమ్మేస్తుంటారు. మరి ఆ మరకల్ని పొగొట్టేందుకు భారతీయ రైల్వే శాఖ ఒక ఏడాదికి ఎంత ఖర్చు చేస్తోందో తెలుసా? ► పాన్ పరాగ్, గుట్కా(నిషేధం ఉన్నా కూడా), తంబాకు.. ఉమ్మి మరకల్ని, సిగరెట్ గుర్తులను పొగొట్టేందుకు సాలీనా 1,200 కోట్ల రూపాయల్ని ఖర్చు చేస్తోంది భారతీయ రైల్వే శాఖ. ► అదనంగా శుభ్రం చేయడం కోసం గాలన్ల గాలన్ల నీటిని ఉపయోగించాల్సి వస్తోంది. ► బహిరంగంగా ఉమ్మేయడం చాలామందికి అలవాటుగా ఉన్నా.. కొందరికి ఇదంతా ఇబ్బంది కలిగించే అంశం. ► ‘దయచేసి నన్ను వాడండి’.. అని రాసి ఉండే డస్ట్బిన్లను, మట్టి డబ్బాలను ఉపయోగించకుండా.. ఎక్కడపడితే అక్కడ ఉమ్మేయడం చూస్తుంటాం. ► శుభ్రతకు సంబంధించిన ఈ అంశంపై ప్రత్యేకించి గైడ్‌లైన్స్ లేకపోవడం, కఠిన చర్యలు లేకపోవడంతో గుట్కా బాబులు పద్దతి మార్చుకోలేకపోతున్నారు. ► ముఖ్యంగా కరోనా టైం కావడంతో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నా.. నిర్లక్ష్యం కనిపిస్తోంది. ► ఇంతకాలం విజ్ఞప్తులు-హెచ్చరిక బోర్డులు, ఛలానా వార్నింగ్ నోటీసులతో సరిపెట్టిన రైల్వే శాఖ.. తాజాగా వినూత్న ఆలోచనకు దిగింది. ► గ్రీన్ ఇన్నొవేషన్‌లో భాగంగా.. రీయూజబుల్, బయోడెగ్రేడబుల్ స్పిట్టూన్‌ను తీసుకొచ్చింది. పాకెట్ సైజులో ఉండే జీ స్పిట్టూన్‌ను డిస్పోజ్ చేసినప్పుడు మొక్కలు మొలుస్తాయి. ► దేశవ్యాప్తంగా 42 రైల్వే స్టేషన్లలో ఐదు నుంచి పది రూపాయల ధరకు ఈ పాకెట్‌సైజ్ డబ్బాల్ని అందిస్తున్నారు. ► ఎజైస్పిట్ అనే స్టార్టప్ పశ్చిమ, నార్తర్న్, సెంట్రల్ రైల్వే జోన్లలో కాంట్రాక్ట్ తీసుకుంది. ► ఈ స్పిట్టూన్ బ్యాగ్‌లు మట్టిలో సైతం కలిసిపోతాయి. ► మరకలు లేకుండా చూడొచ్చనే ఉద్దేశంతో తీసుకొచ్చింది. మరి ఈ మార్పు ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి!! చదవండి: మారుమూల ప్రాంతాలకూ డిజిటల్ సేవలు -
సెకండ్ వేవ్ భయం.. లాక్డౌన్ దిశగా కర్ణాటక!?
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కరోనా వైరస్ తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ ఛాయలు ప్రస్ఫుటమవుతున్నాయి. మార్చి నెలారంభం నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. సుమారు 48 రోజుల తర్వాత రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. దీనికి తోడు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా ఐదు వేల నుంచి ఎనిమిది వేలకు చేరింది. ఈ ఏడాదిలో జనవరి 23వ తేదీన గరిష్టంగా 902 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత గత శుక్రవారం 833 పాజిటివ్‌లు వెలుగుచూశాయి. సౌతాఫ్రికా స్ట్రెయిన్ కేసులు వెలుగు చూస్తుండటంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మూడు లక్షల మందికి పైగా కరోనా టీకా వేశారు. శుక్రవారం సాయంత్రానికి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 9,58,417 ఉంది. చదవండి: (కరోనా విజృంభణ.. మార్చి 31 వరకు స్కూల్స్ బంద్!) లాక్డౌన్ దిగులు.. బెంగళూరులో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత 71 రోజుల తర్వాత 500 సంఖ్య దాటింది. మహరాష్ట్రలో మాదిరిగా లాక్డౌన్ విధిస్తారేమోనని బెంగళూరుతో పాటు పలు జిల్లాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. పాజిటివ్ కేసుల కన్నా డిశ్చార్జిల సంఖ్య తగ్గడం మహమ్మారి తీవ్రతకు నిదర్శనం. కరోనా వైరస్ నివారణలో భాగంగా కర్ణాటకలో తొలిసారిగా వారం రోజుల పాటు లాక్డౌన్ విధించి మార్చి 14నాటికి ఏడాది పూర్తయింది. చదవండి: (వారం రోజులు లాక్డౌన్.. తెరచి ఉంచేవివే..) -
లాక్‌డౌన్‌కు ఆరు ప్రత్యామ్నాయాలు!
సాక్షి, ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లాక్డౌను నివారించేందుకు ప్రత్యామ్నాయాలను వెతుకుతోంది. లాక్‌డౌన్‌న్‌వద్దనుకుంటే కరోనా నిబంధనల్ని కచ్చితంగా పాటించాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేసిన హెచ్చరికల నేపథ్యంలో బీఎంసీ ఆరు ప్రత్యామ్నాయాలు సూచించింది. రైళ్లల్లో, కార్యాలయాల్లో, మార్కెట్లల్లో విపరీతమైన జనసందోహం పెరగడం వల్లే కరోనా వేగంగా వ్యాపిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. లోకల్ రైళ్లలో పెరిగిన రద్దీ వల్లే కరోనా వ్యాప్తి చెందుతున్నందున వల్ల లోకల్ రైళ్లల్లో రద్దీని తగ్గించడం ఒక్కటే ప్రత్యామ్నాయంగా బీఎంసీ భావిస్తోంది. అయితే సుదీర్ఘ కాలంగా లోకల్ రైళ్లను రద్దు చేయడం వల్ల ఉపాధి కోల్పోయి జనాలు ఎంతో ఇబ్బందిపడ్డారు. ఇప్పుడిప్పుడే లోకల్ రైళ్లు ప్రారంభించడంతో జనం కళ్లల్లో ఆనందం తొంగిచూస్తోంది. ఇప్పుడు మళ్లీ లాక్డౌన్ విధించి లోకల్ రైళ్ల సేవల్ని రద్దు చేయడం అంతగా ఆమోదయోగ్యం కాకపోవడంతో మున్సిపల్ కార్పొరేషన్ ఆరు ప్రత్యామ్నాయాలతో ముందుకు వచ్చింది. ఈ ప్రతిపాదన రైల్వే బోర్డుకు పంపించేందుకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు నిర్వహిస్తామని బీఎంసీ ఇక్బాల్‌సింగ్ చహల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 80 శాతం కరోనా రోగుల్లో లక్షణాలేవీ కనిపించకపోవడం ప్రమాదకరంగా మారుతోందని, రాబోయే 15 రోజుల్లో కరోనా బాధితుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయనీ, ఇప్పట్నుంచే తగిన చర్యలు చేపట్టడం అనివార్యంగా మారిందని ఆయన అన్నారు. మళ్లీ తెరుచుకోనున్న కరోనా కేర్ సెంటర్లు! కరోనా మహమ్మారి ప్రభావం మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కేర్ సెంటర్లన్నింటిని మళ్లీ తెరవాలని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చహల్ అదేశాలు జారీచేశారు. దీంతో మరోసారి కరోనా సెంటర్లు తెరుచుకోనున్నాయి. బీఎంసీ ఆధీనంలో ఉన్న కరోనా కేర్ సెంటర్లలో మొత్తం 70,518 పడకలు ఉండగా వాటిలో ప్రస్తుతం కేవలం 13,135 పడకలపై రోగులు చికిత్సను పొందుతున్నారు. 9,757 పడకల్ని రిజర్వ్ చేసి ఉంచారు. కరోనా రోగుల సంఖ్య తగ్గుముఖం పట్టడం వల్ల ఎక్కువ శాతం కరోనా కేర్ సెంటర్లను మూసివేశారు. అయితే ఏడు జంబో కరోనా సెంటర్లను, ప్రతి విభాగంలో ఒకటి చొప్పున స్థానికంగా మొత్తం 24 కరోనా సెంటర్లను మాత్రం మార్చి 31 వరకు తెరిచి ఉంచాలని నిర్ణయించారు. కాగా, ప్రస్తుతం రోగుల సంఖ్య పెరగడంతో 30 శాతం పడకలు నిండిపోయాయి. దీంతో మూసి వేసిన కరోనా సెంటర్లన్నింటిని మళ్లీ తెరవాలనీ బీఎంసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు బాధితుల మెడికల్ రిపోర్టు 24 గంటల్లో కార్పొరేషన్‌కు తెలియచేయడం, రిపోర్టులన్నింటిని సంబంధిత విభాగంలో వెంటనే అప్లోడ్ చేయడం అనివార్యం చేశారు. రోగుల చికిత్సకు కావాల్సిన ఏర్పాట్లన్ని చేసుకోవాలనీ, ఐసీయూ పడకలు, అక్సిజన్ పడకలు, అంబులెన్స్‌లు, సిబ్బందిని, చికిత్సకు సంబంధించిన అన్ని అంశాలను సిద్ధంగా ఉంచాలనీ అన్ని విభాగాల్లోని డిప్యూటీ కమిషనర్లకు బీఎంసీ కమిషనర్ ఇక్బాల్‌సింగ్ ఆదేశాలు జారీ చేశారు. కరోనా సోకినవారిని, కరోనా లక్షణాలు కనిపించిన వారిని హాస్పిటల్లో చేర్పించే బాధ్యత ఆయా వార్డుల్లోని ‘వార్డ్ వార్ రూమ్’ కే అప్పగించారు. ఎప్పటికప్పుడు ఆయా ఆసుపత్రిలోని పడకల లభ్యత, రోగుల వివరాలు వార్డ్‌వార్ రూమ్‌లో అందుబాటులో ఉండేలా బీఎంసీ ఆరోగ్యశాఖ అధికారాలు ఏర్పాట్లు చేస్తున్నారు. బీఎంసీ ప్రత్యామ్నాయాలు.. ఒకటి: అత్యవసరంగా పనికి వెళ్లే వారినే లోకల్ రైళ్లలో ప్రయాణం చేసేందుకు అనుమతించాలి. రెండు: వర్క్ ఫ్రం హోమ్‌ను ప్రోత్సహించాలి, మూడు: ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసు సిబ్బంది సంఖ్యను 15 రోజులకు 50 శాతం తగ్గించాలి. నాలుగు: లోకల్ రైళ్ల టికెట్ బుకింగ్ కౌంటర్లను మూసివేయాలి. ఆన్లైన్ టికెట్ బుకింగ్‌లను కొనసాగించి. నెలవారీ పాసులు జారీ చేయడాన్ని నిషేధించాలి. ఐదు: షాపుల పని వేళల్లో మార్పులు చేయాలి. సరి బేసి తేదీల ప్రకారం దుకాణాలు తెరిచి ఉంచాలి. ఆరు: వసై–విరార్, కల్యాణ్–డోంబివిలి, అంబర్నాథ్, బద్లాపూర్, కసారా, కర్జత్, పాల్ఘర్, నవీముంబై నుంచి ముంబై వరకు స్టేట్ ట్రాన్స్‌పోర్టు బస్సుల్ని ఎక్కువ సంఖ్యలో నడిపించి లోకల్ రైళ్ల భారాన్ని తగ్గించాలి. -
మళ్లీ కరోనా పంజా.. పలుచోట్ల మార్చి 1 నుంచి ఆంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ/ ముంబై: కరోనా మహమ్మారి కొమ్ములు వంచడానికి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ కొత్త స్ట్రెయిన్స్ ఆందోళన పెంచుతున్నాయి. భారత్‌లో కొత్తగా రెండు కరోనా స్ట్రెయిన్స్ కేసులు మహారాష్ట, కేరళలో కనిపించాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. ఈ రెండింట్లో ఒక రకం తెలంగాణలో కూడా ఉందని తెలిపింది. ‘‘ఇప్పుడు శాస్త్రవేత్తలు అందరూ రెండు కొత్త స్ట్రెయిన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఎన్440 కె, ఈ484క్యూ ఈ రెండు కొత్త స్ట్రెయిన్స్ దేశంలో ఉన్నాయి. మహారాష్ట్ర, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ రెండు కొత్త రకాల కేసులు వెలుగులోకి వచ్చాయి’’ అని నీతి ఆయోగ్ (ఆరోగ్యం) సభ్యుడు డాక్టర్ వీకే పాల్ చెప్పారు. జన్యుమార్పులకు లోనైన ఈ కొత్త కరోనా రకాలు బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ నుంచి వ్యాప్తి చెందాయని ఆయన తెలిపారు. అయితే మహారాష్ట్ర, కేరళలో కేసులు విస్తృతంగా వ్యాప్తి చెందడానికి ఈ కొత్త రకమే కారణమని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఇప్పటివరకు ఉన్న గణాంకాల ప్రకారం 187 మందిలో యూకే స్ట్రెయిన్, ఆరుగురిలో దక్షిణాఫ్రికా, ఒక్కరిలో బ్రెజిల్ రకం కరోనా కేసులు నమోదయ్యాయని పాల్ వెల్లడించారు. ఆ రెండు రాష్ట్రాల్లోనే 75% యాక్టివ్ కేసులు దేశవ్యాప్తంగా ఉన్న యాక్టివ్ కేసుల్లో 75% కేసులు మహారాష్ట్ర, కేరళలోనే ఉన్నాయి. కేరళ నుంచి 38%, మహారాష్ట్ర నుంచి 37%, కర్ణాటక 4%, తమిళనాడులో 2.78% యాక్టివ్ కేసులున్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ చెప్పారు. ఇప్పటికీ యాక్టివ్ కేసులు లక్షన్నర కంటే తక్కువగానే ఉన్నాయి. ఇక మంగళవారం మధ్యాహ్నం నాటికి కోటీ 17 లక్షల 64 వేల 788 మందికి కరోనా టీకా ఇచ్చినట్టు రాజేష్ భూషణ్ చెప్పారు. గత 24 గంటల్లో దేశంలో 10,584 కేసులు నమోదయ్యాయి. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 1,,47,306గా ఉంది. చదవండి: (లాక్డౌన్.. ఎవరు బెస్ట్?) విదర్భ విలవిల మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం కరోనా ధాటికి విలవిలలాడుతోంది. ముంబై, పుణేలను మించిపోయి ఈ ప్రాంతంలో కేసులు నమోదవుతున్నాయి. గత 12 రోజుల్లో విదర్భలో ఏకంగా 21 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మళ్లీ గతేడాది పరిస్థితుల్ని గుర్తుకు తెచ్చేలా కేసులు పెరిగుతున్నాయి. çరోజుకి 1,700కి పైగా కేసులు నమోదవుతూ ఉండడంతో అధికారుల్లో ఆందోళన పెరుగుతోంది. ‘‘విదర్భ ప్రాంతంలోని అమరావతి, నాగపూర్ డివిజన్లలో కేసులు ఎందుకు హఠాత్తుగా పెరిగిపోతున్నాయో అర్థం కావడం లేదు. నాగపూర్ డివిజన్లో జిల్లాలతో పోల్చి చూస్తే అమరావతి డివిజన్లో కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ కరోనా వైరస్ ఏ రకమైనది వ్యాప్తి చెందుతున్నదో ఆరోగ్య నిపుణులు పరిశోధనలు నిర్వహిస్తున్నారు’’ అని అమరావతి డివిజినల్ కమిషనర్ పీయూష్ సింగ్ చెప్పారు. అమరావతి డివిజన్లో 300 రకాల శాంపిల్స్‌ను అ«ధ్యయనం చేసి కేసులు పెరిగిపోవడానికి ఈ కొత్త స్ట్రెయిన్సే కారణమా, కాదా అన్నది పరిశీలిస్తున్నట్టుగా డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి (డీఎంఈఆర్) చెప్పారు. గత రెండు వారాల్లోనే అమరావతి డివిజన్లో ఆస్పత్రుల్లో చేరుతున్న కరోనా రోగుల్లో 20–30% పెరుగుదల కనిపించిందని చెప్పారు. మళ్లీ కరోనా పంజా ►16 రాష్ట్రాలు–కేంద్ర పాలిత ప్రాంతాల్లో గత వారం రోజులుగా కరోనా కేసుల పెరుగుదల ►మహారాష్ట్ర 81%, మధ్యప్రదేశ్ 43% పంజాబ్ 31%, జమ్మూకశ్మీర్ 22%, ఛత్తీస్‌గఢ్ 13%, హరియాణా 11% పెరిగిపోతున్న కేసులు ►ఢిల్లీలో 4.7%, కర్ణాటక 4.6%, గుజరాత్లో 4% పెరుగుతున్న కేసులు ►మహారాష్ట్రలోని అమరావతి డివిజన్లో అమరావతి, అకోలా, వార్ధా, యావత్మాల్ జిల్లాల్లో గత ఏడాది సెప్టెంబర్ నాటి పరిస్థితులు పునరావృతం టీకా పంపిణీకి మరిన్ని ప్రైవేట్ ఆసుపత్రులు న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీని ఇకపై వేగవంతం చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ మంగళవారం చెప్పారు. ఇందుకోసం రానున్న రోజుల్లో మరిన్ని ప్రైవేట్ ఆసుపత్రుల సేవలను ఉపయోగించుకోనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రతిరోజూ 10 వేల ఆసుపత్రుల్లో కరోనా టీకా అందజేస్తున్నామని, ఇందులో 2 వేల ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయని పేర్కొన్నారు. వ్యాక్సిన్ పంపిణీలో వేగాన్ని పెంచడానికి మరిన్ని ప్రైవేట్ ఆసుపత్రులను ఉపయోగించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆరోగ్య పథకాల అమలులో ప్రైవేట్ హాస్పిటళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రశంసించారు. ఆయుష్మాన్భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద 24 వేల ఆసుపత్రుల్లో సేవలందిస్తుండగా, ఇందులో 11 వేల ఆసుపత్రుల్లో ప్రైవేట్ రంగంలోనే ఉన్నాయని గుర్తుచేశారు. 800కు పైగా ప్రైవేట్ హాస్పిటళ్లు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకంలో(సీజీహెచ్ఎస్) చేరాయని వివరించారు. పంజాబ్‌లో ఆంక్షలు చండీగఢ్: పంజాబ్‌లో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతుండడంతో ఇన్డోర్, ఔట్‌డోర్ సభలు, సమావేశాలపై ఆంక్షలు విధించింది. మార్చి 1వ తేదీ నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. అలాగే జిల్లాల్లో కోవిడ్–19 హాట్స్పాట్లలో అవసరమైన ప్రాంతాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించే అధికారాన్ని డిప్యూటీ కమిషనర్లకు కట్టబెట్టింది. రాష్ట్రంలో కరోనా తాజా పరిస్థితిపై ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మంగళవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇన్‌డోర్‌లో 100 మందిలోపు, ఔట్‌డోర్‌లో 200లోపు జనంతోనే సమావేశాలు నిర్వహించుకోవాలని స్పష్టం చేశారు. పంజాబ్‌లో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను భారీగా పెంచుతామన్నారు. హోటళ్లు, వివాహాలపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. సినిమా హాళ్లలో ప్రేక్షకుల సంఖ్యను కుదించడంపై మార్చి 1న నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రంలో పాఠశాలలను మూసివేసే ఆలోచన లేదని, విద్యార్థుల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విన్నీ మహాజన్ చెప్పారు. రైతుల ఆందోళనల పరిస్థితేంటి? ఆంక్షలు నేపథ్యంలో కొత్త సాగు చట్టాల వ్యతిరేకంగా ఆందోళనలను ఎలా కొనసాగించాలన్న దానిపై రైతు సంఘాల నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. నిరసనల్లో కోవిడ్ నిబంధనలను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. మోగా జిల్లాలో మార్చి 21న భారీ కిసాన్ మహా సమ్మేళనం నిర్వహిస్తామని ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. దీనికి ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
వెలుగులు నింపే ‘ఓలిక్’ వేరుశనగ!
వేరుశనగలో అత్యంత మేలైన , మెట్ట ప్రాంత రైతులకు అధిక రాబడిని అందించే రకాలేవి? ఓలిక్ యాసిడ్ ఎక్కువ శాతం ఉండే రకాలు! ఎందుకని?.. సాధారణ వేరుశనగలు 2 నెలల్లోనే మెత్తబడి పోతాయి. వీటిలో ఓలిక్ యాసిడ్ 45–50% వరకు ఉండటమే కారణం. కాబట్టి, ఇటువంటి వేరుశనగలతో వివిధ ఉత్పత్తులను తయారు చేయటం కష్టం. ఓలిక్ యాసిడ్ 80% వరకు ఉంటే.. 9 నెలల వరకు మెత్తబడి పాడు కాకుండా నిల్వ చేయొచ్చు! అంతేకాదు.. ఓలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే వేరుశనగలు వినియోగదారుల ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా మేలు చేస్తాయి. అందుకే.. మన దేశంలో, ఇతర ఆసియా దేశాల్లోని ఆహార శుద్ధి కంపెనీలు ఆస్ట్రేలియా నుంచి ఓలిక్ యాసిడ్ 80% వరకు ఉన్న వేరుశనగలను ప్రతి ఏటా వేలాది టన్నులు దిగుమతి చేసుకుంటున్నాయి. ఓలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే వేరుశనగ రకాలను మనమే అభివృద్ధి చేసుకోగలిగితే ఎంతబావుంటుందో కదా..? ఆ రకాలు అధిక ఉష్ణోగ్రతను, బెట్టను, తిక్క తెగులు, తుక్కు తెగుళ్లను కూడా సమర్థవంతంగా తట్టుకొనగలిగినవైతే మన రైతులకు మరింత మేలు కదూ? సరిగ్గా ఏడేళ్ల క్రితం డా. పసుపులేటి జనీలకు ఈ ఆలోచన వచ్చింది. మెదక్ జిల్లా పటాన్‌చెరులోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ(ఇక్రిశాట్)లోని వేరుశనగ వంగడాల అభివృద్ధి విభాగంలో ముఖ్య శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఆమె నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఏడేళ్ల పాటు కొనసాగించిన పరిశోధన సఫలీకృతమైంది. గుజరాత్‌లోని జునాగఢ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని తిరుపతి పరిశోధనా కేంద్రం, ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని పాలెం పరిశోధనా కేంద్రం, తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు కూడా ఈ పరిశోధనలో, క్షేత్రప్రయోగాల్లో పాలుపంచుకున్నారు. జన్యుమార్పిడి విత్తనాలు కావు.. తిరిగి వాడుకోవచ్చు.. ఇక్రిశాట్లో డా. జనీల ఆధ్వర్యంలో 2011 నుంచి ఓలిక్ యాసిడ్ అధికంగా ఉండే వంగడాలపై పరిశోధనలు ప్రారంభమయ్యాయి. ఓలిక్ యాసిడ్ అధికంగా ఉండే అమెరికన్ వంగడం(సనోలిక్95ఆర్)తో స్థానిక వంగడాలను సంకరపరచి 16 కొత్త వంగడాలను రూపొందించారు. జన్యుమార్పిడి పద్ధతులను అనుసరించలేదు. మాలిక్యూలర్ మార్కర్స్తోపాటు అనేక సాంకేతికతలను వినియోగించడం ద్వారా సాధారణం కన్నా 3–4 ఏళ్ల ముందుగానే పరిశోధనను తక్కువ ఖర్చుతోనే కొలిక్కి తెచ్చామని డా. జనీల సంతోషంగా చెప్పారు. ఓలిక్ యాసిడ్ 80% వరకు ఉండే ఐ.సి.జి.వి. 03043 అనే రకంతో పాటు మరో రెండు వేరుశనగ వంగడాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ రకాలను సాగు చేసే రైతులు తమ పంట నుంచి కొన్ని కాయలను పక్కన పెట్టుకొని తిరిగి విత్తనంగా వాడుకోవచ్చు. స్థానికంగా క్షేత్ర ప్రయోగాలు చేసిన తర్వాత వేరుశనగ విస్తారంగా సాగయ్యే గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో 2017లో ప్రయోగాత్మకంగా సాగు చేయించారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌కు చెందిన నరసింహారెడ్డి తదితర రైతులు అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటివరకూ రైతులు ఇష్టపడి సాగుచేస్తున్న వేరుశనగ రకాల కన్నా (5–15% నుంచి 84% వరకు) అధిక దిగుబడి వచ్చిందని, ఓలిక్ యాసిడ్ 80% వరకు వచ్చిందని డా. జనీల ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. సాధారణంగా మన వేరుశనగ గింజల్లో 48% వరకూ వచ్చే నూనె దిగుబడి.. ఐ.సి.జి.వి. 03043 రకంలో 53% రావటం విశేషమన్నారు. ఆరోగ్యదాయకం.. ఓలిక్ యాసిడ్ అధికంగా ఉండే వేరుశనగలు వినియోగదారులకు మరింత ఆరోగ్యదాయకమైనవి. ఓలిక్ యాసిడ్ తక్కువగా ఉండే సాధారణ వేరుశనగలు లేదా వాటితో తయారు చేసిన ఆహారోత్పత్తులు రెండు నెలల్లో మెత్తబడుతాయి. కాబట్టి, ఆహార శుద్ధి కర్మాగారాల యాజమాన్యాలు ఆస్ట్రేలియా నుంచి 9 నెలల పాటు నిల్వ సామర్థ్యం కలిగిన, అధిక ఓలిక్ యాసిడ్ ఉండే వేరుశనగలను ఏటా భారీగా దిగుమతి చేసుకుంటున్నాయి. ఇప్పుడు సిద్ధమైన కొత్త వంగడాలు పూర్తిగా సాగులోకి వస్తే ఈ కంపెనీలు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మన దేశంలోని ఆహార శుద్ధి కర్మాగారాలకు ఇంకా ఓలిక్ యాసిడ్ ప్రాధాన్యంపై తగినంత చైతన్యం లేదని ఆమె అన్నారు. వీరిలో చైతన్యం పెంపొందించడంతోపాటు రైతులకు కొత్త వంగడాలను అందిస్తే పరిశ్రమకు, రైతులకు, వినియోగదారులకు కూడా మేలు కలుగుతుంది. ఓలిక్ యాసిడ్ అధికంగా ఉండడం వల్ల వేరుశనగ నూనె వాసన మెరుగ్గా ఉంటుందని, గుండె జబ్బుల నివారణతోపాటు అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఒనగూరతాయని ఆమె అన్నారు. రైతుల ఉత్పత్తిదారుల సంఘాలు ఆహార శుద్ధి కంపెనీలతో ముందస్తు ఒప్పందాల మేరకు ఈ వంగడాలను సాగు చేయాలని సూచిస్తున్నారు. ఈ వంగడాలను సాగు చేయటం వల్ల రైతులకు అధిక ఉత్పత్తితోపాటు కనీసం 10% అధిక ధర కూడా లభిస్తుందని డా. జనీల చెబుతున్నారు. గుజరాత్లో సుమారు 8 వేల మంది రైతులతో కూడిన ఖెదుత్ ఫుడ్స్ అండ్ ఫీడ్స్ అనే సంస్థ ద్వారా ప్రయోగాత్మకంగా కొత్త వంగడాలను సాగు చేయించారు. మార్కెట్ అవసరాలకు తగినంత నాణ్యత కలిగిన వేరుశనగలను వారు పండించి లబ్ధిపొందుతున్నారని డా. జనీల వివరించారు. ప్రస్తుతం దేశంలో 48 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగవుతోంది. ఇక్రిశాట్ రూపొందించిన కొత్త వంగడాలు తక్కువ ఎరువులు, పురుగుమందులతోనే మంచి దిగుబడినిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.అత్యధికంగా 40 వరకు ఊడలు వస్తున్నందున ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుంటాయని చెబుతున్నారు. సేంద్రియ వ్యవసాయదారులు కూడా ఈ వంగడాలను సాగు చేయడం ద్వారా మంచి గిట్టుబాటుధర పొందడానికి అవకాశం ఉంటుందంటున్నారు. చెట్టుకు 30కి పైగా కాయలున్నాయి..! పదేళ్లుగా వేరుశనగను సాగు చేస్తున్నా. కె6, టాగ్ 24 రకాలు మచ్చ(తిక్క) తెగులును తట్టుకోవటం లేదు. దిగుబడి 3, 4 క్వింటాళ్లే వస్తున్నది. ఈ ఏడాది ఐ.సి.జి.వి. 03043 రకం సాగు చేశా. మచ్చ తెగులును తట్టుకోవటంతో చేనంతా పచ్చగా ఉంది. ఊడలు ఎక్కువగా వచ్చాయి. 60 రోజుల తర్వాతే ఊడలు వస్తున్నాయి. చెట్టుకు 30కి పైగా కాయలు ఉన్నాయి. 5 నెలల పంట కాలం. ఆకుమచ్చ తెగులు రాలేదు కాబట్టి ఆకు రాల్లేదు. మంచి పశుగ్రాసం కూడా వస్తుంది. తుప్పు తెగులు ఒకటి, రెండు మొక్కలకు తప్ప రాలేదు. 10 రోజుల్లో కాయలు కోస్తాం. బాగా లాభదాయకంగా ఉంటుందనుకుంటున్నా. – మల్లాయపల్లి నరసింహారెడ్డి (86869 55757), వేరుశనగ రైతు, శ్రీరంగాపూర్, వనపర్తి జిల్లా నారాయణ, కె6 కన్నా అధిక దిగుబడి.. ఉత్పత్తిదారుల సంఘాలకు విత్తనాలిస్తాం! ఈ కొత్త వేరుశనగ వంగడాలను ఆంధ్రప్రదేశ్‌లో సాగు చేయించగా.. నారాయణ రకంతో సమానంగా దిగుబడి వచ్చింది. ఓలిక్ యాసిడ్ 80% వచ్చింది. అధిక ఉష్ణోగ్రతను, బెట్టను, తుప్పు తెగులు, తిక్క తెగులును తట్టుకున్నాయి. తెలంగాణలో కె6 కన్నా మెరుగైన దిగుబడి వచ్చింది. 2018లో కూడా క్షేత్రస్థాయి ప్రయోగాలు కొనసాగుతాయి. ఆ తర్వాత అధికారికంగా విడుదల అవుతాయి. అయితే, ఈ లోగానే కొంత మేరకు విత్తనోత్పత్తి కోసం వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలకు, జాతీయ విత్తన సంస్థ(ఎన్.ఎస్.సి.)కు వచ్చే ఖరీఫ్ నాటికి కొత్త విత్తనాలను అందించాలనుకుంటున్నాం. – డా. పసుపులేటి జనీల (99899 30855), ముఖ్య శాస్త్రవేత్త, ఇక్రిశాట్, పటాన్చెరు, మెదక్ జిల్లా. p.janila@cgiar.org వేరుశనగ రకాల మధ్య తేడాలను వివరిస్తున్న రైతు నరసింహారెడ్డి – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
కొత్త ఉద్యాన వంగడాల సాగుకు ప్రోత్సాహం
కలెక్టర్ అరుణ్‌కుమార్ గండేపల్లి : ఉద్యాన పంటలలో కొత్త వంగడాలను సాగుచేసే రైతులకు ప్రోత్సాహం అందించనున్నట్టు కలెక్టర్ అరుణ్‌కుమార్ చెప్పారు. మండలంలోని సూరంపాలెం వద్ద ఏడీడీ రోడ్డు సమీపంలో జరుగుతున్న ఎనిమిది ఎకరాల బొప్పాయి సాగును గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఏజెన్సీ పరిధిలో రంపచోడవరంలో, అమలాపురం, రాజమహేంద్రవరం, కాకినాడ డివిజన్ ఉద్యాన పంటల రైతులను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. ఏజెన్సీలో మామిడి, జీడిమామిడి మూడువేలకు పైగా ఎకరాల్లో పండిస్తున్నట్టు తెలిపారు. మెట్ట ప్రాంతంలో బొప్పాయి, అరటిలో బుషావళి తదితర పంటలను సుమారు వంద హెక్టార్ల వరకు సాగవుతుండగా యాభైశాతం సబ్సిడీ కల్పించనున్నట్టు వివరించారు. మామిడి తాండ్ర తయారీదారులకూ ఈ అవకాశం కల్పించనున్నట్టు పేర్కొన్నారు. అనంతరం పామాయిల్‌తోటలో చాప్ కట్టర్ పని విధానాన్ని పరిశీలించారు. ఐదు అంచెల ఉద్యాన పంటల సాగును సందర్శించారు. ఉద్యానశాఖ సహాయ సంచాలకుడు గోపికుమార్, ఉద్యానాధికారి సిహెచ్. శ్రీనివాస్, ఎంపీఈఓ రామకృష్ణ, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.