ప్రతీకాత్మక చిత్రం
ముంబై: కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో మార్కెట్లు, దుకాణాలు పూర్తిస్థాయిలో తెరిచేందుకు బ్రిహాన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అనుమతినిచ్చింది. అయితే ఆదివారాల్లో మాత్రం షాపులన్నింటినీ మూసి వేయాలని స్పష్టం చేసింది. లాక్‌డౌన్ నిబంధనల సడలింపు నేపథ్యంలో బీఎంసీ మంగళవారం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కోవిడ్-19 విజృంభిస్తున్న తరుణంలో మాల్స్, మార్కెట్ కాంప్లెక్సులను తెరవకూడదని ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా రాత్రి 9 నుంచి ఉదయం ఐదు గంటల వరకు విధించిన కర్ఫ్యూ వేళలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ‘‘మిషన్ బిగిన్ అగేన్’’లో భాగంగా జారీ చేసిన ఈ మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది.(కరోనా: కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు)
‘‘రోడ్డుకు ఒకవైపున ఉన్న షాపులన్నీ ఒకరోజు తెరచి ఉంచిన తర్వాత.. మరుసటి రోజు రోడ్డుకు ఆవలివైపు ఉన్న షాపులు తెరవాలి. ముంబైలోని షాపులు, మార్కెట్లను సోమవారం నుంచి శనివారం వరకు తెరచి ఉంచవచ్చు. ఆదివారం మాత్రం ఇందుకు అనుమతి లేదు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం తదితర నిబంధనలు పాటించేలా షాపు యజమానుల అసోసియేషన్ ఏర్పాట్లు చేసుకోవాలి’’అని మంగళవారం నాటి సర్క్యులర్‌లో పేర్కొంది. (చైనాను మించిన మహారాష్ట్ర)
ఇక పార్కులు, ఆట స్థలాలు కూడా జూన్ 30 వరకు తెరిచే అవకాశం లేదని బీఎంసీ స్పష్టం చేసింది. ఓపెన్ ఎయిర్ జిమ్‌లను కూడా తెరిచేందుకు కూడా అనుమతించబోమని తెలిపింది. కాగా అన్‌లాక్-1లో భాగంగా ప్రైవేటు ఆఫీసులు 10 శాతం మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని బీఎంసీ ఇదివరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా ముంబైలో కరోనా రోజురోజుకీ విజృంభిస్తోంది. ఇప్పటికే అక్కడ దాదాపు 50 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. సోమవారం నాటికి 1702 మంది మృత్యువాత పడ్డారు.(ఉద్యోగులకు మహారాష్ట్ర కీలక ఆదేశాలు)
Comments
Please login to add a commentAdd a comment