సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరి సాగును తగ్గించాలని నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం.. వచ్చే యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు రైతులను సన్నద్ధం చేసే దిశగా వ్యవసాయ శాఖ చర్యలు మొదలుపెట్టింది. గత ఏడాది యాసంగి సాగుతో పోలిస్తే దాదాపు 23శాతం దాకా వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి.. బదులుగా ఇతర పంటలను సాగు చేయించాలని జిల్లా అధికారులకు అంతర్గత ఆదేశాలు జారీచేసింది.
వ్యవసాయ అధికారులు ప్రత్యామ్నాయ పంటల దిశగా రైతులను సన్నద్ధం చేసేందుకు అవగాహన కార్యక్రమాలు మొదలుపెట్టారు. అయితే చాలాచోట్ల రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ముందుకు రావడంలేదని అధికారులు చెప్తున్నారు. ‘‘మేం గ్రామాలకు వెళ్లి వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని రైతులను కోరుతున్నాం. కానీ విత్తనాల నుంచి కొనుగోళ్ల దాకా రైతులు వ్యక్తం చేస్తున్న సందేహాలు, లేవనెత్తుతున్న ప్రశ్నలకు ఏం చెప్పాలో అర్థంగాక మధ్యలోనే సభలను రద్దు చేసుకొని వెనుదిరుగుతున్నాం’’ అని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మండల వ్యవసాయాధికారి పేర్కొన్నారు.
కొద్దికొద్దిగా తగ్గించేలా..
రాష్ట్రంలో వరిసాగు తగ్గించాలన్న ప్రభుత్వ ఆదేశం మేరకు రంగంలోకి దిగిన అధికారులు పలు ప్రతిపాదనలు రూపొందించారు. ఒకేసారి భారీగా వరి సాగు తగ్గించాలంటే రైతులు ముందుకు రారన్న ఆలోచనతో.. ముందుగా కొద్ది మొత్తంలో తగ్గించాలని నిర్ణయానికి వచ్చారు. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో వరి విస్తీర్ణాన్ని ఎక్కడ, ఏ మేర తగ్గించాలన్న దానిపై ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్రణాళికల ప్రకారం.. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి, ఐదు రకాల పంటలను వేయించాలని జిల్లాల అధికారులను ఆదేశించారు.
తప్పదంటేనే.. మినహాయింపు
ఎక్కడైనా రైతులు తప్పనిసరిగా వరి మాత్రమే వేస్తామన్న భావనతో ఉంటే, ఎక్కడైనా వరి పండించడం అనివార్యమైతేనే.. ప్రత్యామ్నాయ సాగును మినహాయించాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించింది. అదికూడా ఎఫ్‌సీఐ సూచించిన ఫైన్ రకాల వరినే పండించేలా చూడాలని స్పష్టం
చేసింది.
వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, పెసర, శనగ పంటలకు సంబంధించి.. ఆయా జిల్లాల పరిధిలో ఎక్కడ, ఏ పంట అనుకూలమో గుర్తించాలని సూచించింది. మొత్తంగా 2,604 క్లస్టర్ల వారీగా షెడ్యూల్‌ను తయారు చేయాలని పేర్కొంది. ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని.. స్థానిక ప్రజాప్రతినిధులు, రైతుబంధు సమితి సభ్యులు అందులో పాల్గొనేలా చూడాలని స్పష్టం చేసింది. ఈ నెల 30 నాటికి శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయాలని సూచించింది.
మాకు భరోసా ఏది?
ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలంటూ వ్యవసాయశాఖ నిర్వహిస్తున్న అవగాహన సదస్సుల్లో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వరికి బదులు సాగుచేయాలని సూచిస్తున్న ఐదు పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తారా అని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఆయా పంటల విత్తనాలను సబ్సిడీపై అందజేసే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదేమని నిలదీస్తున్నారు. గత ఏడాది నుంచి సబ్సిడీ ఎత్తివేయడంతో విత్తనాలు కొనుగోలు చేయడం కష్టంగా మారిందని చెప్తున్నారు. వ్యవసాయశాఖ సూచిస్తున్న ఐదు రకాల పంటలు వరికి ప్రత్యామ్నాయం కాబోవని, పైగా లాభాలు కూడా ఉండబోవని స్పష్టం చేస్తున్నారు. అయితే విత్తన సబ్సిడీ, పంటల కొనుగోళ్లపై తమకు పైస్థాయి నుంచి సమాచారమేదీ లేకపోవడంతో రైతులకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేని పరిస్థితి నెలకొందని వ్యవసాయాధికారులు అంటున్నారు.
మూడు జోన్లు.. ఐదు పంటలు..
ఉత్తర తెలంగాణ జోన్ కింద ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలను చేర్చారు. ఈ జిల్లాల్లో గత యాసంగిలో సాగైన వరి విస్తీర్ణంలో 20–25 శాతం వరకు తగ్గించి.. బదులుగా వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, శనగ సాగు చేయించాలని నిర్ణయించారు.
సెంట్రల్ తెలంగాణ జోన్ కింద సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో గత యాసంగితో పోలిస్తే 10–15 శాతం వరి తగ్గించి.. దాని స్థానంలో వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, శనగ సాగు చేయించనున్నారు. దక్షిణ తెలంగాణ జోన్‌లో మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, నారాయణపేట జిల్లాలను చేర్చారు. ఈ జిల్లాల్లో ఏకంగా 20–30 శాతం దాకా వరి తగ్గించి.. బదులుగా వేరుశనగ, పొద్దు తిరుగుడు, శనగ, పెసర పంటలు వేసేలా రైతులను సన్నద్ధం చేస్తున్నారు.
ప్రత్యామ్నాయ పంటలను కొనే దిక్కేది?
తెలంగాణ కోటి ఎకరాల మాగాణ అని చెప్పి ఇప్పుడు వరి వద్దంటే ఎలా? సాగునీరు ఉన్న ప్రాంతాల్లో వరి తప్ప మరేం సాగు చేయగలరు? వరి వద్దనడం అశాస్త్రీయం. అయినా ప్రత్యామ్నాయ పంటలు అంటూ.. వేరుశనగ, పొద్దుతిరుగుడు వంటివి చూపిస్తున్నారు. వాటిని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఇప్పటివరకు ముందుకు రాలేదు. రెండు, మూడు జిల్లాలకే పరిమితమైన వేరుశనగను కొనడానికే అప్పట్లో ప్రభుత్వం నానాయాతన పడింది. ఇప్పుడు అన్ని జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేస్తే కొనే పరిస్థితి ఉంటుందా? ప్రభుత్వం ఈ అంశంపై వ్యవసాయ నిపుణులు, రైతు సంఘాలతో చర్చించి రైతులకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటే బాగుండేది. ప్రత్యామ్నాయంగా కనీసం కూరగాయల సాగును ప్రోత్సహించినా బాగుండేది.
– టి.సాగర్, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రైతు సంఘం
Comments
Please login to add a commentAdd a comment