ఏది పడితే అది పండించొద్దు: సీఎం కేసీఆర్‌ | Telangana Govt Says Farmers Should Be Benefited If Follow Its Suggestions | Sakshi
Sakshi News home page

ఏది పడితే అది పండించొద్దు: సీఎం కేసీఆర్‌

Published Wed, May 13 2020 2:43 AM | Last Updated on Wed, May 13 2020 8:14 AM

Telangana Govt Says Farmers Should Be Benefited If Follow Its Suggestions - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ఏది పడితే అది పండించి, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు పంటలు వేసి, పండిన పంటలు మార్కెట్‌కు తీసుకొచ్చి కొనమంటే ఎవరూ కొనరు. అంగట్ల సరుకు పోసి ఆగం కావద్దు. డిమాండ్‌ ఉన్న పంటలే సాగు చేయాలి. అమ్ముడుపోయే సరుకే పండించాలి. రైతులు ఏ పంట వేస్తే లాభపడతారో ప్రభుత్వమే చెబుతుంది. ఆ పంటలకు మద్దతు ధర ఇస్తామంటోంది. ప్రభుత్వం ఇంత చొరవ చూపుతుంటే రైతులకు ఇంకా వేరే ఆలోచన ఎందుకుండాలి. 

రైతుల ఆలోచనల్లో నిర్మాణాత్మకమైన మార్పులు రావాలి’అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో పంట మార్పిడి, క్రాప్‌ కాలనీల ఏర్పాటుపై ఆయన మంగళవారం ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడానికి ప్రధాన కారణం.. అందరూ ఒకేరకమైన పంటలు పండించడమేనని పేర్కొన్నారు. 
(చదవండి: అక్రమం.. అడ్డుకోండి: సీఎం కేసీఆర్‌)

‘మార్కెట్‌ డిమాండ్‌కు తగ్గట్లు పంటలు పండించాలని నేను ఇవాళ చెప్పడంలేదు. 20 ఏళ్ల క్రితం నేను రవాణాశాఖ మంత్రిగా పనిచేసినప్పటి నుంచి చెబుతున్నా. ప్రధాని నరేంద్ర మోదీకి, గత వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌ సింగ్‌కు పంటల మార్పిడి, క్రాప్‌ కాలనీల ఏర్పాటు గురించి అనేక మార్లు చెప్పాను. ఇంతకు మించిన గత్యంతరం లేదు. అందరూ ఒకే పంట వేసే విధానం పోయి తీరాలి’అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. 

ఈ వర్షాకాలంతోనే ప్రారంభం...
ఈ వర్షాకాలంలో వరిపంటతో నియంత్రిత పద్ధతిలో పంట సాగు చేసే పద్ధతి ప్రారంభం కావాలని సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. ‘రాష్ట్రంలో ఈసారి 50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలి. ఇందులో సన్న, దొడ్డు రకాలుండాలి. పది లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనా రకాన్ని పండించాలి. ఏ ప్రాంతంలో ఏ రైతులు ఏ రకం పండించాలి? ఎంత విస్తీర్ణంలో పండించాలి? అనే విషయాలను త్వరలోనే ప్రభుత్వం వెల్లడిస్తుంది. ప్రభుత్వం చెప్పిన రకం పంటలు సాగు చేసిన రైతులకే రైతుబంధు ఇవ్వాలి. 

ఆ పంటలకే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలి’అని సమీక్షలో నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఇక ఈ వర్షాకాలంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి, 10 లక్షల ఎకరాల్లో కందులు పండించాలని సమీక్షలో నిర్ణయిం చారు. ఏ పంట ఎక్కడ పండించాలి? ఎంత పండిం చాలి? అనే వివరాలను అధికారులు త్వరలోనే వెల్లడిస్తారు. పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రాల్లో కూరగాయల సాగు చేయిం చాలని సర్కారు నిర్ణయించింది. ఏ ప్రాంతంలో ఎంత మేరకు.. ఏ కూరగాయలు పండించాలి? ఎంత విస్తీర్ణంలో పండించాలి? అనే విషయాలు కూడా రైతులకు సూచిస్తారు.
(చదవండి: సూపర్‌ స్ప్రెడర్లపై పోలీసు శాఖ నజర్‌)

సీడ్‌ రెగ్యులేటింగ్‌ అథారిటీ ఏర్పాటు..
రాష్ట్రంలో కొత్తగా సీడ్‌ రెగ్యులేటింగ్‌ అథారిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్కారు నిర్ణయించిన పంటలనే సాగు చేయాలని నిర్ణయించినందున, ఇకపై విత్తనాలు కూడా ప్రభుత్వం నిర్ణయించిన పంటలకు సంబంధించినవి మాత్రమే అమ్మాలి. దీనిపై విత్తన తయారీ సంస్థలకు, వ్యాపారులకు కచ్చితమైన ఆదేశాలు ఇస్తారు. ఈ విషయంలో విత్తన నియంత్రణ అథారిటీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. అవసరమైతే ఇప్పుడున్న విత్తన చట్టంలో మార్పులు తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీడ్‌ కంపెనీ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కావాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.

వ్యవసాయ శాఖ పునర్వ్యవస్థీకరణ
సమగ్ర వ్యవసాయ విధానానికి అనుగుణంగా వ్యవసాయ శాఖను పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ యూనివర్సిటీలో తెలంగాణలో పండించాల్సిన పంటలకు సంబంధించిన పరిశోధనలు ఎక్కువగా జరగాలని ఆదేశించింది. రైతుబంధు సమితిలు క్రియాశీలకంగా మారి వ్యవసాయ సంబంధమైన విషయాల్లో రైతులను సమన్వయ పరచాలని కోరింది. 

అలాగే రాష్ట్రంలో గోదాముల నిర్వహణ అంతా సులభంగా, ఏకోన్ముఖంగా జరగాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్కెటింగ్‌ శాఖను కూడా తెలంగాణలో అమలయ్యే వ్యవసాయ విధానానికి అనుగుణంగా మార్చాలని భావిస్తోంది. తెలంగాణలో పెద్ద ఎత్తున వరి పండుతుంది. ఆ వరిని బియ్యంగా మార్చడం కోసం రాష్ట్రంలో రైసు మిల్లుల సామర్ధ్యం బాగా పెరగాల్సి ఉంది. ఇందుకోసం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే రైస్‌ మిల్లుల యజమానుల సంఘం ప్రతినిధులతో సీఎం సమావేశం నిర్వహించనున్నారు.

15న క్షేత్ర స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌..
నియంత్రిత పద్ధతిలో పంట సాగు చేసే విధానంపై చర్చించేందుకు, తగు సూచనలు చేసేందుకు ఈ నెల 15న మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికా>రి, ఏడీఏ, జిల్లా రైతు బంధు అధ్యక్షుడు, విత్తనాభివృద్ధి సంస్థ అధికారి ఇందులో పాల్గొంటారు. మండల స్థాయిలో మండల వ్యవసాయాధికారి, ఏఈఓలు, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు, గ్రామాల రైతు బంధు సమితిల అధ్యక్షులు పాల్గొంటారు. 

కల్తీ, నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం 
నకిలీ, కల్తీ విత్తనాలు అమ్మేవారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు పర్యటించనున్నాయి. ఇంటెలిజెన్స్‌ వర్గాలు కూడా రాష్ట్రవ్యాప్తంగా నిఘా పెట్టాయి. నకిలీ, కల్తీ విత్తనాలు తయారు చేసేవారిని, అమ్మేవారిని వెంటనే గుర్తించి, పీడీ యాక్టు కింద కేసు నమోదు చేస్తారు. ముఖ్యంగా పత్తి, మిరప విత్తనాలు నకిలీవి ఎక్కువగా అమ్మే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం వాటి నిరోధానికి పటిష్ట చర్యలు తీసుకుంటోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement