పంటల ‘చిత్రపటం’ రెడీ | TS Government Exercises On Cultivation Plan To Meet The Needs Of The State | Sakshi
Sakshi News home page

పంటల ‘చిత్రపటం’ రెడీ

Published Sun, May 24 2020 1:27 AM | Last Updated on Sun, May 24 2020 9:00 AM

TS Government Exercises On Cultivation Plan To Meet The Needs Of The State - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నియంత్రిత సాగు ద్వారా రాష్ట్ర వ్యవసాయరంగ ముఖచిత్రాన్ని మార్చాలనే ఆలోచనతో ఉన్న ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది. పంటలవారీగా రాష్ట్ర ప్రజల అవసరాలు, వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో సాగుచేయాల్సిన పంటల చిత్రపటాన్ని సిద్ధం చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌తోపాటు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పంటలను దృష్టిలో ఉంచుకొని స్థానిక అవసరాలను పరిపూర్ణంగా తీర్చేలా సాగు ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగానే ఈ వానాకాలం నుంచి పత్తి, కంది, పామాయిల్‌తోపాటు నూనెగింజల పంటల వైపు సర్కారు మొగ్గుచూపుతోందని అధికార వర్గాలంటున్నాయి.

ఈ పంటలకు తగిన డిమాండ్‌ ఉన్నా రాష్ట్రంలో సాగు, దిగుబడి తక్కువగా ఉన్నాయని, ఈ పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచడం ద్వారా రాష్ట్ర అవసరాలను తీర్చుకొనేలా ప్రభుత్వం ముందుకెళ్తోందని తెలుస్తోంది. డిమాండ్‌కన్నా ఎక్కువ దిగుబడి ఉన్న వరి, మొక్కజొన్న లాంటి పంటలకు కొంత బ్రేక్‌ ఇవ్వాలనే ఆలోచనతో సంప్రదాయబద్ధంగా ఈ పంటలను సాగుచేస్తున్న రైతాంగాన్ని ఇతర పంటల వైపు మళ్లించేలా చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ, ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా ఇచ్చిన నివేదికలను అంచనా వేస్తూ రాష్ట్రంలో ఏ పంట ఏయే ప్రాంతాల్లో సాగు చేయాలనే విషయమై సీఎం కేసీఆర్‌ భారీ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే జియోగ్రాఫిక్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (జీఐఎస్‌) ఆధారంగా ఏయే జిల్లాల్లో ఎంత పంట సాగు చేస్తున్నారు? మొత్తం పంటల సాగు విస్తీర్ణంలో ఏ జిల్లాల వాటా ఎంత ఉంటోంది? ఏయే జిల్లాల్లో పంట మార్పిడి విధానాలు అవసరమవుతాయనే దానిపై వ్యవసాయశాఖతోపాటు ఆ రంగానికి చెందిన నిపుణులతో సీఎం సమాలోచనలు చేస్తున్నారు.

పంటలవారీగా ప్రభుత్వ ఆలోచన ఇలా..
పత్తి: అధికారిక లెక్కల ప్రకారం గతేడాది వానాకాలం సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 54.45 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. కానీ ఈ వానాకాలం సీజన్‌లో దీన్ని 65.70 ఎకరాలకు పెంచాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. ఇందుకు ప్రధానంగా 3–4 అంశాలు కారణమవుతున్నాయి. నాణ్యత ఆధారంగా దేశంలో ఎంత పత్తి పండినా కొనుగోలు చేసేందుకు కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనికితోడు ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కుల తయారీకి పత్తి అనుబంధ ఉత్పత్తులు అవసరం. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఈ పంటకు డిమాండ్‌ వస్తోంది. దుస్తుల తయారీకి 64 శాతం, గృహాలంకరణలకు 28 శాతం, పారిశ్రామిక వినియోగానికి 8 శాతం పత్తి అవసరమవుతోంది. ఈ నేపథ్యంలోనే డిమాండ్‌ ఆధారంగా పత్తి సాగును ఈసారి 11.25 లక్షల ఎకరాల్లో అదనంగా చేపట్టేలా చర్యలు తీసుకుంటోంది.

పప్పు ధాన్యాలు (కంది): దేశంలో పప్పుధాన్యాల వార్షిక వినియోగం 27–28 మిలియన్‌ టన్నులుకాగా 2019–20 వ్యవసాయ సంవత్సరంలో 23 మిలియన్‌ టన్నుల దిగుబడి జరిగింది. దేశవ్యాప్తంగా అవసరమైన మరో 5.6 లక్షల టన్నులను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. రాష్ట్రంలో పప్పుధాన్యాల డిమాండ్‌కు, దిగుబడికి భారీ తేడా కనిపిస్తోంది. ఏటా రాష్ట్రంలో 11.7 లక్షల టన్నుల పప్పుధాన్యాలు అవసరమవగా కేవలం 5.6 లక్షల టన్నుల దిగుబడే వస్తోంది. దీంతో పప్పుధాన్యాల సాగు పెంచాలని, ముఖ్యంగా రాష్ట్ర భౌగోళిక, సాగునీటి పరిస్థితులకు అనుగుణంగా కంది సాగును ప్రోత్సహించాలనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గత వానాకాలంలో 7.38 లక్షల ఎకరాల్లో కంది సాగు చేపట్టగా ఈసారి దాన్ని 15 లక్షల ఎకరాలకు పెంచాలని యోచిస్తోంది.

పామాయిల్‌: ఏటా రూ. 69 వేల కోట్ల విలువైన పామాయిల్‌ దిగుమతులు దేశానికి వస్తున్నాయి. ఇండోనేసియా, మలేసియాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దేశానికి అవసరమైన మరో 9–10 మిలియన్‌ టన్నుల పామాయిల్‌ కావాలంటే ప్రస్తుతం సాగవుతున్న దానికంటే 70 లక్షల ఎకరాల్లో ఈ పంటను సాగు చేయాల్సి ఉంది. ప్రస్తుతం కేవలం 3 లక్షల ఎకరాల్లోనే ఇది సాగవుతోంది. రాష్ట్రంలో ఖమ్మం, కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 48,594 ఎకరాల్లో 9,929 మంది రైతులే పామాయిల్‌ సాగు చేస్తున్నారు. ఈ పంట సాగు చేపట్టిన నాలుగో ఏడాది నుంచి ఎకరానికి రూ. 82 వేల నుంచి రూ. 1.23 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఈ నాలుగేళ్లలో పత్తి, మిరప, పసుపు, కంది, సోయాబీన్, శనగ, పెసరలతోపాటు ఇతర కూరగాయలను సాగు చేసుకోవచ్చు. వెదురు, చందనం లాంటి గట్టు పంటలను కూడా సాగు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో రూ. 130.90 కోట్ల వ్యయంతో 50 వేల ఎకరాల్లో రాష్ట్రంలో పామాయిల్‌ సాగు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం సాగవుతున్న 50 వేల ఎకరాలను లక్ష ఎకరాలకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది.

నూనెగింజలు: ప్రపంచంలో 90 శాతం ఆముదం నూనె మన దేశంలోనే ఉత్పత్తి అవుతోంది. దేశం ఉత్పత్తి చేసే ఆముదం నూనెలో 75 శాతం గుజరాత్‌లోనే పండిస్తున్నారు. రాష్ట్రంలో వనపర్తి, నారాయణపేట్, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోనే దీన్ని సాగుచేస్తున్నారు. ప్రస్తుతం సాగవుతున్న దానికన్నా అదనంగా 1.4 లక్షల ఎకరాల్లో ఆముదం సాగుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో సాగవుతున్న 0.65 లక్షల ఎకరాలను కనీసం 1.50 లక్షల ఎకరాలకు పెంచాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది.

వరి: రాష్ట్రంలో సాగునీటి సౌకర్యం అభివృద్ధి చెందడంతో వరి సాగు ఎక్కువవుతోంది. 2019 వానాకాలంలో ఏకంగా 41.60 లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. అయితే ఈసారి దాన్ని 40 లక్షలకు పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులోనూ 25 లక్షల ఎకరాల్లో ఫైన్‌ వెరైటీ ధాన్యం, మరో 15 లక్షల ఎకరాల్లో ముతక వెరైటీలను సాగు చేయించాలనుకుంటోంది. రాష్ట్ర జనాభాకు అనుగుణంగా ఏడాదికి 90 లక్షల టన్నుల ధాన్యం అవసరంకాగా 2019–20లో ఏకంగా 1.93 కోట్ల టన్నుల దిగుబడి వచ్చింది. అదే విధంగా ఏడాదికి సరిపడా మొక్కజొన్న నిల్వలు ఉన్నందున ఈ పంట సాగు చేయకుండా రైతులకు నచ్చచెప్పాలని, ఈ పంట సాగు చేస్తున్న రైతులకు పంటమార్పిడి విధానంపై ప్రత్యేక కౌన్సెలింగ్‌ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి ప్రత్యామ్నాయంగా జొన్నలు, సజ్జలతోపాటు కందులు, పెసల వంటి పప్పుధాన్యాలు, పత్తి, వేరుశనగ లాంటి నూనెగింజల సాగును ప్రోత్సహించాలని యోచిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement