సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి సీజన్ విద్యుత్ డిమాండ్ 15,500 మెగావాట్లకు పెరిగే అవకాశముందని, ఆ మేరకు సరఫరా చేసేందుకు రాష్ట్ర విద్యుత్ సంస్థలు సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. శుక్రవారం ఉదయం రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ రికార్డుస్థాయి లో పెరిగి 14,017 మెగావాట్లుగా నమోదైంది. గతేడాది డిసెంబర్‌లో నమోదైన అత్యధిక విద్యుత్ డిమాండ్ 10,935 మెగావాట్లను మించిపోయింది.
యాసంగి పంటల కోసం రైతాంగం పెద్ద మొత్తంలో విద్యుత్ వినియోగిస్తుండటంతోనే డిసెంబర్‌లో ఎన్నడూ లేనివిధంగా విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిందని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది మార్చిలో నమోదైన 14,160 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ ఇప్పటివరకు అత్యధిక రికార్డు కాగా, రానున్న ఫిబ్రవరి, మార్చి రోజుల్లో 15,500 మెగావాట్లకు పెరగనుందని అంచనా వేస్తున్నామని తెలిపారు.
ఈ మేరకు విద్యుత్ సరఫరాకు సిద్ధం కావా లని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు వెల్లడించారు. వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ సరఫరాను కొనసాగించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొంతమంది రైతులు ఇంకా ఆటో స్టార్టర్లను వినియోగిస్తుండటంతో విద్యుత్ వృథా అవుతోందని, క్షేత్రస్థాయిలో నిరంతరం నిఘా ఉంచి వీటిని తొలగించడానికి చర్యలు తీసుకోవాలని విద్యుత్ ఇంజనీర్లను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment