ఉత్పాదనలో ఈరెండింటినీ అధిమించాలి: మంత్రి | Singireddy Niranjan Reddy Review Meeting On Agriculture Production In Hyderabad | Sakshi
Sakshi News home page

వ్యవసాయి విధానంపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష

Published Wed, May 20 2020 5:30 PM | Last Updated on Wed, May 20 2020 5:37 PM

Singireddy Niranjan Reddy Review Meeting On Agriculture Production In Hyderabad - Sakshi

(ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్ : మానవ వనరులు, సాగు భూమి పుష్కలంగా ఉన్న మనం అమెరికా, చైనాలను అధిగమించలేకపోతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సమగ్ర వ్యవసాయ విధానంపై జిల్లాల రైతుబంధు సమితి అధ్యక్షులు, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ ఉన్నతాధికారులు, శాస్త్రవేతలతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... వ్యవసాయంలో చారిత్రక మార్పుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పాదనలలో చైనా, అమెరికాలను మనం అధిగమించాలన్నారు. అమెరికాలో వ్యవసాయం చేసేవారు 30 శాతం నుంచి 3 శాతానికి పడిపోయినా వారు అగ్రస్థానంలోనే ఉన్నారన్నారు. మన దేశంలో 60 శాతం జనాభా వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల మీదే ఆధారపడిందని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే సీఎం కేసీఆర్‌ 6 ఏళ్లుగా వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. (రైతులకు కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలి: ఉత్తమ్‌)

కావునా రైతుబంధు సమితి అధ్యక్షులు, శాస్త్రవేత్తలు నూతన వ్యవసాయ విధానంపై క్షేత్రస్థాయి అభిప్రాయాలను, అనుభవాలను పంచుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. కాగా క్షేత్రస్థాయిలో రైతుల అభిప్రాయాలు ఎంతో ముఖ్యమని మన ఆహార అవసరాలకు అవసరమైన పంటలు పండిస్తున్నారన్నారు. కానీ ప్రపంచానికి అవసరమైన, ఆదాయాన్ని ఇచ్చే పంటలను మనం పండించాల్సి ఉందని  పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి రైతాంగానిది దిక్కుతోచని పరిస్థితి.. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ రైతు సానుకూల నిర్ణయాలు తీసుకున్నారుని తెలిపారు. అంబలి కేంద్రాలతో ఆకలి తీర్చుకున్న తెలంగాణ ఆరేళ్లలో అన్నపూర్ణగా మారిందన్నారు. కుదేలైన సేద్యాన్ని కుదుటపరిచి దీని మీద బతకగలం అన్న విశ్వాసాన్ని కేసీఆర్‌ రైతులకు కలిగించారిని పేర్కొన్నారు. 42 శాతం జీడీపీ వ్యవసాయరంగం నుండే వస్తుందని, అర్థికవేత్తలు 14.5 శాతం అంటారు కానీ వ్యవసాయ అనుబంధరంగాలు కలిపితే 42 శాతం ఉంటుందని చెప్పారు. (మంత్రులకు, ఎమ్మెల్యేలకు సజ్జల లేఖ)

ఆర్థిక నిపుణులు ఎందుకు వ్యవసాయరంగంపై పెట్టే పెట్టుబడులను చిన్నచూపు చూస్తున్నారో అర్థం కాదన్నారు. 52 శాతం రైతులు అప్పుల్లో ఉంటారన్నది నిపుణుల నివేదిక సారాంశమని, వారు అప్పుల ఊబి నుంచి బయటకు రావాలనే సీఎం కేసీఆర్ వ్యవసాయరంగంలో విప్లవాత్మక పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. మొగులు వైపు తెలంగాణ రైతు ఎదురు చూడొద్దని,  సమయం వచ్చిందంటే అరక కట్టాలన్నారు. ఇక గోదావరి, కృష్ణ నదుల వల్ల రైతులు ఇబ్బందులు పడొద్దనే కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణం ప్రతిష్టాత్మకంగా చేపట్టారన్నారు. రైతులు మార్చి చివరి నాటికి యాసంగి వరికోతలు పూర్తయ్యేలా సాగుచేస్తే అకాల వర్షాల మూలంగా నష్టపోయే పరిస్థితి తప్పుతుందని సూచించారు. తెలంగాణ ఆహార సెజ్‌లను ఏర్పాటుకు కేసీఆర్ నిర్ణయించారు.. త్వరలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు భారీ ఎత్తున వస్తాయని తెలిపారు. దీనికి సంబంధించిన విధాన నిర్ణయం కేసీఆర్‌ త్వరలో ప్రకటిస్తారని వెల్లడించారు. (డబుల్‌ బెడ్‌రూం నిర్మాణాలపై కేటీఆర్‌ సమీక్ష)

మార్కెట్లో ధర లేదని అమ్మితే లగేజీ ఛార్జీలు రావని కూరగాయల గంపలను రైతులు బస్సులోనే వదిలేసి పోయిన ఎన్నో సంఘటనలు ఉద్యమంలో తాము ప్రత్యక్ష్యంగా చూశామన్నారు. సన్నబియ్యం పండించి అందరికి అందించే రైతన్న దొడ్డు బియ్యం తినే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి నుంచి రైతు బయటకు రావాలనే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ జెండాపట్టి రాష్ట్రాన్ని సాధించామన్నారు. ఇప్పుడు రైతుల కోసం పని చేస్తున్నామని, ఇంతకుమించిన అదృష్టం ఏముంటుందని ఈ దేశం ఏర్పడినప్పటి నుండి వ్యవసాయ రంగంలో హరిత, శ్వేత, నీలి,పసుపు  తదితర రకాల విప్లవాలు వచ్చాయని ఆయన వ్యాఖ్యానించారు. మనం మరో విప్లవం దిశగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అదే నియంత్రిత సమగ్ర వ్యవసాయమన్నారు. కాగా ఈ సమావేశంలో రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి, వీసీ ప్రవీణ్ రావు, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement