ఈ నెల 16న పాలమూరు-రంగారెడ్డి వెట్‌ రన్‌ ప్రారంభించనున్న సీఎం | Palamuru rangareddy Lift Irrigation CM KCR To Launch Wet Run | Sakshi
Sakshi News home page

ఈ నెల 16న పాలమూరు-రంగారెడ్డి వెట్‌ రన్‌.. ప్రారంభించనున్న సీఎం

Published Wed, Sep 6 2023 5:04 PM | Last Updated on Wed, Sep 6 2023 7:42 PM

Palamuru rangareddy Lift Irrigation CM KCR To Launch Wet Run - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచంలోనే భారీ పంపులతో ఎత్తిపోతలకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సిద్ధమైంది. ఈ నెల 16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్ ప్రారంభం కానుంది. నార్లాపూర్ ఇన్‌టేక్‌ వద్ద స్విచ్ ఆన్ చేసి కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. వెట్‌ రన్‌లో భాగంగా రెండు కిలో మీటర్ల దూరంలోని నార్లపూర్ రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోయనుంది. ఈ సందర్భంగా కృష్ణమ్మ తల్లికి కేసీఆర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 

వెట్‌రన్‌ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనుండగా.. సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. పాలమూరు రంగారెడ్డి జిల్లాలలోని పల్లె పల్లె నుంచి ప్రజలు, గ్రామ సర్పంచులు హాజరవ్వనున్నారు. ఎత్తిపోతల కృష్ణమ్మ జలాలను కలశాలతో ప్రతి గ్రామానికి తీసుకుపోయి ఈనెల  17 న ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలలోని ప్రతీ గ్రామంలో దేవుళ్ళ పాదాలకు  అభిషేకం చేయనున్నారు.  

ఈ మేరకు సచివాలయంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రోజెక్ట్‌పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ అధికారులు హాజరయ్యారు.
చదవండి: పెద్దపల్లిలో మావోయిస్టు లేఖ కలకలం.. బీఆర్‌ఎస్‌ నేతలకు వార్నింగ్‌!

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అడ్డంకులు తొలిగి కొలిక్కి వచ్చినందుకు గ్రామాల్లోని దేవాలయాల్లో స్వామివారి పాదాలను పాలమూరు జలాలతో అభిషేకం చేసి మన మొక్కులు చెల్లించుకుందామంటూ సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. దక్షిణ తెలంగాణకు పండుగ రోజని పేర్కొన్నారు. ఎన్నో మొక్కులు మొక్కితే,  దైవకృపతో,  ఇంజనీర్ల కృషితో, పాలమూరు ఎత్తిపోతల పథకం అడ్డంకులు అధిగమించి సాకారమైందన్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన స్ఫూర్తితో పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయాలని కేసీఆర్‌ తెలిపారు. పట్టుదలతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను కొలిక్కి తేవడానికి జరిగిన కృషిలో కీలక పాత్ర పోషించిన సీఎంఓ అధికారులకు, ఇరిగేషన్ ఉన్నతాధికారులకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ అనుమతులతో పాటు అనేక అడ్డంకులను అధిగమించి చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో దక్షిణ తెలంగాణలోని పల్లె పల్లెకు తాగునీరు, సాగునీరు అందనున్నదని చెప్పారు. బంగారు తెలంగాణ లక్ష్యం సంపూర్ణం కానున్నదని కేసీఆర్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement