సాక్షి, హైదరాబాద్/కంటోన్మెంట్: రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇచ్చినట్టు నిరూపిస్తే, తాను ముక్కు నేలకు రాసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రాష్ట్ర బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. రైతాంగానికి నిరంతర విద్యుత్ ఇస్తున్నట్టు అబిడ్స్ చౌరస్తాలో, సచివాలయంలో నిరూపించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై తాను ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు.గురువారం ఈటల మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ది అబద్ధాల ప్రభుత్వమనీ, చెప్పేదానికి చేసే దానికి ఏమాత్రం సంబంధం లేదని మండిపడ్డారు.
కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతిపై నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులను పోలీసులు విచక్షణారహితంగా కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్ చేసిన ద్రోహం వల్ల రైతన్నలు అప్పులపాలయ్యారనీ, రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల బకాయిలు ఎగ్గొట్టే వారనే ముద్ర తెలంగాణ రైతుల పైన పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హోంగార్డులకు సీఎం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఈటల డిమాండ్ చేశారు. ఆసరా పింఛన్ల మంజూరు, కొత్త కేటాయింపు అంశాల్లో సంబంధిత పీఆర్ మంత్రికే ప్రమేయం లేకుండా పోయిందని ఈటల ఎద్దేవా చేశారు.
కేసీఆర్‌ను గద్దె దింపుతాం
40 నియోజకవర్గాల్లో కీలకంగా ఉన్న ముదిరాజ్‌లకు ఒక్క ఎమ్మెల్యే సీటు ఇవ్వకుండా వారిని అవమానించి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన సీఎం కేసీఆర్‌ను గద్దె దించుతామని ఈటల రాజేందర్ అన్నారు.
హైదరాబాద్ తొలిమేయర్, ముదిరాజ్ మహాసభ వ్యవస్థాపకుడు కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ 130 వ జయంతి సందర్భంగా జూబ్లీ బస్‌స్టేషన్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు లు అర్పించారు. కృష్ణస్వామి హైదరాబాద్ ప్లాన్ ఇచ్చిన మేధావి, రచయిత, కవి అని కొనియాడారు. ప్రొఫెసర్ గాలి వినోద్, బండ ప్రకాశ్ ముదిరాజ్, కేంద్ర మాజీ మంత్రి సర్వేసత్యనారాయణ, బీఆర్‌ఎస్ మల్కాజ్‌గిరి పార్లమెంట్ ఇన్‌చార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment