‘విద్యుత్’ కమిషన్ నుంచి తప్పుకున్న తర్వాత జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి
కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వలేదు.. లేఖ రూపంలోనే అభిప్రాయాలు కోరా
ఊహాజనిత వార్తలకు అడ్డుకట్ట వేయడానికే ప్రెస్‌మీట్ పెట్టాను జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ప్రెస్‌మీట్లు పెట్టడంపై అభ్యంతరాలు ఎందుకు లేవు
తన నివేదిక పూర్తి దశకు చేరిందని.. సుప్రీంలో కేసు వల్ల ప్రభుత్వానికి ఇవ్వలేదని వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు వందలాది కమిషన్లు నియమించాయని.. ఏ కమిషన్ ప్రెస్‌మీట్ పెట్టలేదో చెప్పాలని జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ‘విద్యుత్’ కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకొన్న అనంతరం ఆయన ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఊహాజనిత వార్తలకు అడ్డుకట్ట వేయడానికే తాను మీడియా సమావేశం నిర్వహించాల్సి వచ్చిందని చెప్పారు. తాను మీడియా సమావేశం నిర్వహించకుండా ఉంటే బాగుండేదని సీజేఐ ధర్మాసనం అభిప్రాయపడిందన్నారు. ఏదైనా అంశంపై విచారణ అంటేనే బహిరంగ విచారణ అని అర్ధమని చెప్పారు.
ఈ విషయంపై తాను వాదనలు చేయొచ్చని, కానీ ఒక విశ్రాంత న్యాయమూర్తిగా న్యాయవ్యవస్థ గౌరవం కాపాడాలనే ఉద్దేశంతో ఈ అంశం లోతుల్లోకి వెళ్లలేదని వివరించారు. థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి సంబంధించి సూపర్ క్రిటికల్ టెక్నాలజీ కాకుండా సబ్ క్రిటికల్ టెక్నాలజీ వల్ల కాలుష్య ప్రభావం ఉంటుందని అభిప్రాయాలు వచ్చాయని.. దీనిపై విచారణ చేయాల్సి ఉందని మాత్రమే తాను మీడియా సమావేశంలో చెప్పానని వివరించారు. సాధారణంగా కోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో న్యాయమూర్తి కొందరి అభిప్రాయాలతో ఏకీభవించినట్టు కనిపిస్తుందని.. కానీ తుది తీర్పు మాత్రమే పరిగణనలోకి వస్తుందని గుర్తుచేశారు.
నోటీసులేమీ ఇవ్వలేదు..
విచారణ అంశానికి సంబంధించి వాంగ్మూలాలు తీసుకోవడం కమిషన్ ఆఫ్ ఎంక్వైరీలో భాగమని జస్టిస్ నరసింహారెడ్డి చెప్పారు. అయినా తానేమీ మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వలేదని, లేఖ రూపంలోనే అభిప్రాయాలు తెలపాలని కోరానని వివరించారు. బీఆర్‌కేఆర్ భవనంలో జస్టిస్ పినాకి చంద్రఘోష్ కార్యాలయం రోజు విడిచి రోజు ప్రెస్‌మీట్ నిర్వహించడంపై అభ్యంతరాలు ఎందుకు లేవని ప్రశ్నించారు.
అక్కడికి వచ్చిన విలేకరులు.. మా కార్యాలయం విషయంలో ఊహాజనిత వార్తలు రాస్తుండటంతో వాటికి అడ్డుకట్ట వేసేందుకే ప్రెస్‌మీట్ పెట్టినట్టు చెప్పారు. కమిషన్ ప్రెస్‌మీట్ నిర్వహించడం తప్పు అయితే చాలా కమిషన్లను కొట్టివేయాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. తన నివేదిక పూర్తి దశకు చేరుకుందని, ప్రభుత్వానికి అందజేద్దామనుకున్నా.. సుప్రీంకోర్టులో కేసు దృష్ట్యా సరికాదని భావించి ఆగానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment