Justice L. Narasimha reddy
-
న్యాయవ్యవస్థ గౌరవం కోసమే వైదొలిగా..: జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు వందలాది కమిషన్లు నియమించాయని.. ఏ కమిషన్ ప్రెస్‌మీట్ పెట్టలేదో చెప్పాలని జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ‘విద్యుత్’ కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకొన్న అనంతరం ఆయన ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఊహాజనిత వార్తలకు అడ్డుకట్ట వేయడానికే తాను మీడియా సమావేశం నిర్వహించాల్సి వచ్చిందని చెప్పారు. తాను మీడియా సమావేశం నిర్వహించకుండా ఉంటే బాగుండేదని సీజేఐ ధర్మాసనం అభిప్రాయపడిందన్నారు. ఏదైనా అంశంపై విచారణ అంటేనే బహిరంగ విచారణ అని అర్ధమని చెప్పారు. ఈ విషయంపై తాను వాదనలు చేయొచ్చని, కానీ ఒక విశ్రాంత న్యాయమూర్తిగా న్యాయవ్యవస్థ గౌరవం కాపాడాలనే ఉద్దేశంతో ఈ అంశం లోతుల్లోకి వెళ్లలేదని వివరించారు. థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి సంబంధించి సూపర్ క్రిటికల్ టెక్నాలజీ కాకుండా సబ్ క్రిటికల్ టెక్నాలజీ వల్ల కాలుష్య ప్రభావం ఉంటుందని అభిప్రాయాలు వచ్చాయని.. దీనిపై విచారణ చేయాల్సి ఉందని మాత్రమే తాను మీడియా సమావేశంలో చెప్పానని వివరించారు. సాధారణంగా కోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో న్యాయమూర్తి కొందరి అభిప్రాయాలతో ఏకీభవించినట్టు కనిపిస్తుందని.. కానీ తుది తీర్పు మాత్రమే పరిగణనలోకి వస్తుందని గుర్తుచేశారు. నోటీసులేమీ ఇవ్వలేదు.. విచారణ అంశానికి సంబంధించి వాంగ్మూలాలు తీసుకోవడం కమిషన్ ఆఫ్ ఎంక్వైరీలో భాగమని జస్టిస్ నరసింహారెడ్డి చెప్పారు. అయినా తానేమీ మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వలేదని, లేఖ రూపంలోనే అభిప్రాయాలు తెలపాలని కోరానని వివరించారు. బీఆర్కేఆర్ భవనంలో జస్టిస్ పినాకి చంద్రఘోష్ కార్యాలయం రోజు విడిచి రోజు ప్రెస్‌మీట్ నిర్వహించడంపై అభ్యంతరాలు ఎందుకు లేవని ప్రశ్నించారు. అక్కడికి వచ్చిన విలేకరులు.. మా కార్యాలయం విషయంలో ఊహాజనిత వార్తలు రాస్తుండటంతో వాటికి అడ్డుకట్ట వేసేందుకే ప్రెస్‌మీట్ పెట్టినట్టు చెప్పారు. కమిషన్ ప్రెస్‌మీట్ నిర్వహించడం తప్పు అయితే చాలా కమిషన్లను కొట్టివేయాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. తన నివేదిక పూర్తి దశకు చేరుకుందని, ప్రభుత్వానికి అందజేద్దామనుకున్నా.. సుప్రీంకోర్టులో కేసు దృష్ట్యా సరికాదని భావించి ఆగానని తెలిపారు. -
TG: పవర్ కమిషన్‌కు సుప్రీంకోర్టు షాక్
సాక్షి,న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన విద్యుత్ కమిషన్‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కమిషన్‌ను రద్దు చేయాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం(జులై 16) విచారణ జరిపింది. పిటిషన్‌ను విచారించిన సందర్భంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కమిషన్ చైర్మన్ రిటైర్డ్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డిని మార్చాలని బెంచ్ ఆదేశించింది. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ ఎల్.నర్సింహారెడ్డి తీరుపై సీజేఐ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రెస్‌మీట్ పెట్టి విచారణకు సంబంధించిన విషయాలపై ఓపెన్‌గా ఎలా మాట్లాడతారని సీజేఐ ప్రశ్నించారు.న్యాయమూర్తి విచారణ చేయడమే కాకుండా నిష్పక్షపాతంగా ఉన్నట్లు కనిపించాలని వ్యాఖ్యానించారు. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చైర్మన్‌ను మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నట్లు తెలిసింది. లంచ్ తర్వాత కొత్త చైర్మన్ ఎవరనేది చెబుతామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో పిటిషన్ విచారణను లంచ్ తర్వాతకు కోర్టు వాయిదా వేసింది. విచారణలో కేసీఆర్ తరపున సీనియర్న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించగా తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. అడ్వకేట్ జనరల్‌తో సీఎం రేవంత్ మంతనాలు .. కొత్త చైర్మన్ ఎవరనేదానిపై చర్చ పవర్ కమిషన్ చైర్మన్ ఎల్.నర్సింహారెడ్డిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ సచివాలయంలో కలెక్టర్ల సమావేశంలో ఉన్నారు. ఆదేశాల గురించి తెలియగానే కలెక్టర్ల సమావేశ హాల్ నుంచి వెళ్లి అడ్వకేట్ జనరల్(ఏజీ) సుదర్శన్‌రెడ్డితో మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త చైర్మన్‌గా ఎవరిని నియమించాలన్నదానిపై సీఎం ఏజీతో చర్చిస్తున్నట్లు సమాచారం. -
విచారణ పూర్తికాక ముందే తీర్పు ఎలా చెబుతారు?
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడా నష్టం జరగలేదని, ఆ విషయంలో ఏ విచారణకైనా సిద్ధమని రాష్ట్ర మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. ఆదివారం తెలంగాణభవన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ ఒప్పందాలపై విచారణకు ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వేసిందని, కమిషన్ సందేహాలకు కేసీఆర్ బహిరంగంగా సమాధానం ఇచ్చారన్నారు. కమిషన్ ఉద్దేశం వేరేలా ఉందని, వాదన వినకుండా, విచారణ చేయకుండా తీర్పు ఇచ్చేలా కనిపిస్తోందని విమర్శించారు.నరసింహారెడ్డికి విచారణ అర్హత లేదని, కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని మాజీ సీఎం కేసీఆర్ సూచించారని చెప్పారు. వివరణ ఇచ్చేందుకు ఈ నెల 30 వరకు అవకాశం ఇవ్వాలని అడిగితే ఇవ్వలేదని, 15 లోపే వివరణ ఇవ్వాలని చెప్పారన్నారు. కానీ 11వ తేదీన నరసింహారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణవాదిగా నరసింహారెడ్డికి పేరు ఉందని, చీకట్లో ఉన్న తెలంగాణను వెలుగుల తెలంగాణగా మార్చిన కేసీఆర్‌పై ఆయనకు సానుభూతి ఉంటుందనుకున్నామని, కానీ ఆయన తీరు అలా లేదని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే విద్యుత్ కొనుగోళ్ల అంశంపై కాంగ్రెస్, బీజేపీ నేతలకు అసెంబ్లీలో సమాధానం ఇచ్చామని, ఈఆర్సీ ముందు కాంగ్రెస్, బీజేపీ నేతలు తమ వాదనలు వినిపించారన్నారు.కాంగ్రెస్, బీజేపీ నేతల అభిప్రాయాలను నరసింహారెడ్డి మీడియా సమావేశంలో చెప్పారని, విచారణ పూర్తి కాకముందే తీర్పు ఎట్లా చెబుతారని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక కమిషన్లు రద్దు అయ్యాయని, ఈఆర్సీ స్వతంత్ర కమిషన్ అని, అది ఇచి్చన తీర్పు ఫైనల్ అన్నారు. ఈఆర్సీ తీర్పు ఇచ్చాక కమిషన్ ఎట్లా వేస్తారని నరసింహారెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. కమిషన్ బాధ్యతల నుంచి నరసింహారెడ్డి తప్పుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతో బహిరంగంగా విద్యుత్ ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. విద్యుత్ కొనుగోలులో కేసీఆర్ మాజీ సీఎం రమణ్‌సింగ్‌కు ఏమైనా లంచం ఇచ్చారా.బీజేపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఎక్కువ రేటుకు విద్యుత్ కొన్నాయని, తెలంగాణ మాత్రం యూనిట్‌కు రూ.3.90 పెట్టి విద్యుత్ తీసుకున్నట్టు వివరించారు. దేశంలో ఏ కమిషన్ మధ్యలో లీకులు ఇవ్వలేదని తెలిపారు. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశామని, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెం, విజయవాడ, ఆరీ్టపీసీ నుంచి సబ్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారానే విద్యుత్ ఉత్పత్తి అవుతుందని వివరించారు.పారదర్శకతతోనే ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్ఈఎల్కు భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాలను అప్పగించినట్టు తెలిపారు. కేసీఆర్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన దొంగలంతా ఏకమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి కేసీఆర్‌పై కుట్రలు చేస్తున్నాయని, రేవంత్‌రెడ్డి మోదీ లైన్లో పని చేస్తున్నారని ఆరోపించారు. కోమటిరెడ్డి మాటలను పట్టించుకోమని, పీసీసీ పదవి డబ్బులతో రేవంత్ తెచ్చుకున్నాడని కోమటిరెడ్డి అనలేదా అని జగదీశ్‌రెడ్డి గుర్తు చేశారు. -
పవర్ కమిషన్ ఉద్దేశం వేరేలా ఉంది: జగదీష్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడా నష్టం జరగలేదని.. ఏ విచారణకైనా సిద్ధమని శాసనసభలోనే చెప్పామని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘‘విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ వేసింది. గత ప్రభుత్వం చేసిన ఒప్పందాలపై విచారణ చేస్తుంది. ప్రభుత్వ పెద్దలు, బీజేపీ పెద్దలు కొన్ని సందేహాలు లేవనెత్తారు. అసెంబ్లీలో అన్నిటికీ సమాధానం ఇచ్చామని, శ్వేత పత్రాలు కూడా విడుదల చేశాం’’ అని చెప్పారు.‘‘జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్‌ను వేసింది. నిన్న కేసిఆర్ వివరణ కోరారు. కమిషన్ సందేహాలకు కేసీఆర్ సమాధానం ఇచ్చారు. పవర్ కమిషన్ ఉద్దేశం వేరేలా కనిపిస్తోంది. కమిషన్ పాత్ర పైన కూడా మాట్లాడారు. వాదన వినకుండా విచారణ కాకముందే తీర్పు ఇచ్చేలా ఉన్నాయని, మీకు ఆ అర్హత లేదని మీరు కమిషన్ బాధ్యత నుంచి తప్పుకోవాలని కేసిఆర్ సూచించారు. అన్ని ఆధారాలు చూపించారు.’’ అని జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘కేసిఆర్‌కు ఆ హక్కు ఉంది. 30 వరకు అవకాశం ఇవ్వాలని అడిగితే లేదు 15నే కావాలని అడిగితే ఇచ్చారు. జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి మారిపోయారు. తెలంగాణ వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు మారిపోయారు. చీకట్లో ఉన్న తెలంగాణను వెలుగుల తెలంగాణగా మార్చిన కేసిఆర్ పట్ల నర్సింహారెడ్డికి సానుభూతి ఉంటుందనుకున్నాం. కానీ ఆయన తీరు అలా లేదు. తన అభిప్రాయం ముందే మీడియా ముందు చెప్తున్నాడు. ఇది తప్పు’’ అని జగదీష్‌రెడ్డి అన్నారు. -
మాట్లాడక తప్పని సమయం
ఆంధ్రప్రదేశ్‌లో ఘటనలను 2009 నుంచి సన్నిహితంగా పరిశీలిస్తూ వచ్చినవారికి అప్పట్లో పాలనాయంత్రాంగం తరపున వచ్చిన ప్రకటనలు, పరిశీలనలు సచివాలయం నుంచి కాకుండా రాజ్‌భవన్ నుంచే ఎక్కువగా వచ్చాయన్న విషయం గుర్తుండే ఉంటుంది. ఉద్యమకారుల్ని రెచ్చగొడుతూ, చేసిన ఈ ప్రకటనలే తెలంగాణలో డజన్ల కొద్దీ్ద అమాయక విద్యార్థులు, యువకుల ఆత్మహత్యలకు దారితీశాయి. ఆనాడు కాస్తంత మానవత్వం ప్రదర్శించి ఉంటే వందలాదిమంది ప్రాణాలను కాపాడి ఉండవచ్చు. రాజ్‌భవన్ ప్రకటనల తీవ్రత, కాఠిన్యం ఆనాడు అత్యంత నిరంకుశ పోలీసు అధికారులను కూడా షాక్‌కు గురిచేశాయి. భారత రాజ్యాంగంలో గవర్నర్ వ్యవస్థకు ఎంతో ప్రముఖ స్థానం ఉంది. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం, ప్రతి కార్యనిర్వాహక ఆదేశం గవర్నర్ పేరుతోనే జారీ అవుతుంది. శాసనసభలో ఆమోదించిన చట్టాలు గవర్నర్ ఆమోదం పొందిన తర్వాతే అమలులోకి వస్తాయి. పాలనాయంత్రాంగంలో సంక్షోభ, ఘర్షణ తలెత్తిన సమయాల్లో గవర్నర్ నిర్వహించే పాత్ర కీలకం. గవర్నర్ల పరిణతి, అనుభవంతో కూడిన మార్గదర్శకత్వం సాధారణ పరిస్థితిని నెలకొల్పడానికి తోడ్పడతాయని అనేక ఉదాహరణలు చెబుతున్నాయి. రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య వారధిగా గవర్నర్ విధులు ఉంటాయి. సంబంధిత రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిణామాలు నెలకొన్నప్పుడు కేంద్రానికి అక్కడి గవర్నర్లు ఇచ్చే నిజాయతీతో కూడిన, సత్యసమ్మతమైన నివేదికలు చాలా విలువైనవి. ఇలాంటి పరిణామాలను చాలామంది గవర్నర్లు జాగరూకంగా పరిశీలిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో చాలావరకు అత్యున్నత ప్రమాణాలు, ప్రభావాలు నెలకొల్పిన గవర్నర్లనే చూసింది. అవిభక్త ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా వ్యవహరించిన సి.రంగరాజన్ అసాధారణ వ్యక్తిత్వం కలవారు. ఆయన అద్భుత విజయాలు సాధించిన ఆర్థికవేత్త. అదే సమయంలో నమ్రత కలిగిన పెద్దమనిషి కూడా. 2003లో హైదరాబాద్‌లో సుప్రసిద్ధ ఆర్థికవేత్తల కాన్ఫరెన్స్ జరిగింది. దానికి ముఖ్య అతిథిగా సి.రంగరాజన్ కీలక ప్రసంగం చేశారు. అదృష్టవశాత్తూ ఆ సదస్సుకు నేను హాజరయ్యాను. ఆయన ప్రసంగానికి ఎంత ఆకర్షితుడినయ్యానంటే తర్వాత ఆయనకు ఉత్తరం రాస్తూ, నాలాంటి సాధారణమైన వ్యక్తులు కూడా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సంక్లిష్ట భావనలను ఆయన ప్రసంగం విన్న తర్వాత అర్థం చేసుకోగలుగుతారని రాశాను. ఆయన ఎంతో దయతో తన పాండిత్య స్థాయిని ఏమాత్రం ప్రదర్శించకుండా నాకు సమాధానం రాశారు. తెలంగాణ కోసం ఆందోళన నేపథ్యంలో 2009లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపుగా తీవ్ర సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలోనే అప్పట్లో చత్తీస్‌గఢ్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న ఈఎస్ఎల్ నరసింహన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ అయ్యారు. ఉద్యమ సెగలు కొంతవరకు హైకోర్టును కూడా తాకాయి. ఆ సమయంలో నేను రెండు ముఖ్యమైన కేసులు చేపట్టాల్సి వచ్చింది. మొదటిది.. తెలంగాణ ప్రాంతంలోని విద్యా సంస్థలకు విడిగా సెల వులు ప్రకటించడానికి సంబంధించింది. సెలవులు ప్రకటించాల్సివస్తే మొత్తం రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నిటికీ వర్తించాలని నేను ఆదేశాలి చ్చాను. ఒక నిర్దిష్ట ప్రాంతానికి మాత్రమే సెలవులు ప్రకటిస్తే అది ఆ ప్రాంత విద్యార్థులకు నష్టదాయకం అవుతుందన్నది నా భావన. రెండోది.. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థినులను పోలీ సులు అవమానించి, వేధించిన ఘటనకు సంబంధించింది. సీనియర్ పోలీసు అధికారి సమక్షంలోనే విద్యార్థినులను మగపోలీసులు శారీరకంగా వేధింపులకు గురిచేశారని, అదే అధికారి ఒక జర్నలిస్టు మోటర్ సైకిల్‌పై మూత్రవిసర్జన చేయవలసిందిగా పోలీసులకు ఆదేశించారని వార్తాపత్రికలు నివేదించాయి. ఆగ్రహావేశాలను రేకెత్తించిన ఈ ఘట నపై రిట్ పిటిషన్ దాఖలై నా పరిశీలనకు వచ్చింది. సంబంధిత పోలీసు అధికారికి సమన్లు పంపి ఈ ఘటనపై తన వివరణను కోరాను. విచారణ క్రమంలో, విద్యార్థినులపై అలాంటి అనాగరికమైన, మతిహీనమైన చర్యలను ఎవరి ఆదేశాలతో చేపట్టారని ఆ అధికారిని ప్రశ్నించాను. తర్వాత అతడు కోర్టుకు క్షమాపణలు చెప్పారు. ఆ విచారణ సంచలనం కలిగించింది. ఆ తర్వాత కొన్ని రోజులకు, జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమితులయ్యారు. రాజభవన్లో జరిగిన ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి సాంప్రదాయానుసారం హైకోర్టు న్యాయమూర్తులు, మొత్తం మంత్రిమండలి, మాజీ న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం ముగిశాక తేనీరు అందించారు. హైకోర్టు జడ్డీలందరూ ఎల్ ఆకారంలో కూర్చున్నారు. నేను ఒక మూలన కూర్చున్నాను. జడ్జీలను ఒకరి తర్వాత ఒకరుగా గవర్నర్‌కు పరిచయం కార్యక్రమం జరిగింది. నా వంతు వచ్చినప్పుడు ఆయన ఆగి నిలబడి కింద పేర్కొన్న రీతిలో చర్చ మొదలెట్టారు: గవర్నర్ : ఓ.. మీరు జస్టిస్ నరసింహారెడ్డి గారు కదూ. నా పేరూ అదే. మీకు తెలుసా, రెండు కత్తులు ఒకే ఒరలో ఇమడవు. నేను: (ఆమాటలు విని దాదాపుగా షాక్ తిన్నాను) సర్, మీరు గవర్నర్, నేను జడ్జిని. మనం రెండు కత్తులుగా ఉండే సమస్య ఎక్కడుంది? కనీసం నేనయితే వాటిలో ఒక కత్తిని కాను. గవర్నర్ : మిస్టర్ రెడ్డీ, మీకు తెలుసు, నా నేపథ్యం, నా చరిత్ర చాలా చెడ్డవి. నేను : నా దృష్టిలో మీరు ఉన్నత పదవిలో ఉన్నవారు, అలా కాకుండా మరొకరయితే అది మీకు మాత్రమే సంబంధించిన విషయం. గవర్నర్ : మనం ఇక ఈ విషయం మర్చిపోదాం. నేను : చర్చను మొదలెట్టింది మీరు. తర్వాతే జరగాల్సింది మీరే నిర్ణయించాలి మరి. తర్వాత ఆయన ముందుకెళ్లారు. నా పక్కనే ఉన్న జస్టిస్ విలాస్ అప్జల్ పుర్కార్, జస్టిస్ ఆర్. కాంతారావు దీంతో దిగ్భ్రాంతి చెందారు, ఆశ్చర్యపోయారు. గవర్నర్ నుంచి ఇలాంటి ప్రవర్తనను తాము ఊహించలేదన్నారు. కాస్సేపు ముఖ్యమంత్రి, స్పీకర్ వద్ద కూర్చున్న తర్వాత గవర్నర్ నేరుగా నావద్దకే వచ్చారు. ‘సమాజాన్ని మెరుగుపర్చడం కోసం మనం కలిసి పని చేయవచ్చు కదా’ అన్నారు. ఒక జడ్జికి, గవర్నరుకి మధ్య ఉమ్మడి అంశాలు ఏవీ ఉండవనీ.. ప్రజలకు, మానవీయ అంశాలకు సంబంధించి గవర్నర్లే జోక్యం చేసుకున్న ఘటనలున్నాయని నేను సమాధానమిచ్చాను. ఈ సందర్భంగా 1970లలో ఏపీ గవర్నర్‌గా వ్యవహరించిన శ్రీమతి శారదా ముఖర్జీ ఉదాహరణను కూడా గుర్తు చేశాను. తెలంగాణ రాష్ట్రంకోసం పోరాడుతున్న ఉద్యమకారులపై మోపిన కొన్ని కేసులకు సంబంధించి కోర్టులో నా స్పందనను గవర్నర్ ఇష్టపడకపోయి ఉండవచ్చునని భావించాను. అలాకాని పక్షంలో ఒక సిట్టింగ్ జడ్జి పట్ల అంత నిర్దయగా, అగౌరవకరంగా గవర్నర్ వ్యవహరించడానికి తగిన కారణమే లేదు. అప్పటినుంచి అనేక సందర్భాల్లో అవకాశం ఉన్నప్పటికీ నేను ఎన్నడూ రాజ్‌భవన్‌లోకి ప్రవేశించలేదు. 2009 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఘటనలను సన్నిహితంగా పరి శీలిస్తూ వచ్చినవారికి అప్పట్లో పాలనాయంత్రాంగం తరపున వచ్చిన ప్రకటనలు, పరిశీలనలు సచివాలయం నుంచి కాకుండా రాజ్‌భవన్ నుంచే ఎక్కువగా వచ్చాయన్న విషయం గుర్తుండే ఉంటుంది. అన్నిటికంటే విషాదకరమైన అంశం ఏమిటంటే, ఘర్షణను రెచ్చగొడుతూ, అణచివేత స్వభావంతో చేసిన ఈ ప్రకటనలే తెలంగాణలో డజన్ల కొద్ది అమాయక విద్యార్థులు, యువకుల ఆత్మహత్యలకు దారి తీశాయన్నదే. ఆ సమయంలో కాస్తంత మానవత్వం ప్రదర్శించి ఉంటే వందలాదిమంది ప్రాణాలను కాపాడి ఉండవచ్చు. రాజ్‌భవన్ నుంచి వచ్చిన ప్రకటనల తీవ్రత, కాఠిన్య వైఖరి ఆనాడు అత్యంత నిరంకుశ పోలీసు అధికారులను కూడా షాక్‌కు గురిచేశాయి. తెలంగాణలో దాదాపు వెయ్యిమంది విద్యార్థులు, యువత మరణాల విషయంలో రాజ్‌భవన్ బాధ్యతను ఏరకంగానూ తోసిపుచ్చలేము. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ నరసింహన్ కొన్ని సమయాల్లో తాను లక్ష్మీ నరసింహుడిలా వ్యవహరించేవాడినని చెప్పుకొచ్చారు. దాంట్లో వాస్తవం ఉంది మరి. తేడా ఏమిటంటే, లక్ష్మీ నరసింహ స్వామి ఆగ్రహం ప్రహ్లాదుని కాపాడటానికి అయితే, మన గవర్నర్ ఆగ్రహం ప్రహ్లాదుడి వంటి పిల్లల చావుకు కారణమైంది. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు తమ పార్టీ సభ్యత్వాలను, హోదాను అట్టిపెట్టుకుంటూనే ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన తరహా ఘటనలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో మాత్రమే జరగడం గమనార్హం. నరసింహన్ గవర్నర్‌గా ఉన్న సమయంలోనే ఇలాంటివి జరిగాయి. అలాంటి చేరికలను అనుమతించవచ్చా అని అప్పట్లో లీగల్ సలహా కోరతానని గవర్నర్ చిన్న ప్రకటన చేసి ఉంటే తర్వాత కాలంలో తెలుగుప్రజలు ఎదుర్కొన్న రాజకీయ అప్రతిష్టకు అవకాశం ఉండేది కాదు. అలా ఫిరాయించిన వ్యక్తులచేత ప్రమాణ స్వీకారం చేయడానికి ఆయన ప్రదర్శించిన సంసిద్ధత.. రాజకీయ బేరసారాలను పరాకాష్టకు తీసుకుపోవడమే కాకుండా, పార్టీ ప్రాతిపదికన జరిగే ఎన్నికల్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నార్థకం చేసింది. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ వాస్తవంగానే పనికిరానిదైపోయింది. ప్రజాస్వామ్యంలో, ప్రజాజీవితంలో ఉన్న వారు ఒక సమస్యతో వ్యవహరించేటప్పుడు తమ మధ్య ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ శత్రువైఖరి కలిగి ఉండరాదని అందరూ భావిస్తారు. ఇది నిజమే కావచ్చు కానీ సుదీర్ఘకాలంపాటు ఉద్యమాన్ని నిర్మించి నడిపిన నాయకుడు, ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నించిన రాజ్యాంగపరమైన అధికారి .. ఆ తర్వాతకాలంలో పరస్పరం ప్రశంసలు గుప్పించుకునేలా మారిపోవడం రాజకీయ విశ్లేషకులతో సహా పలువురిని షాక్‌కు గురిచేసింది. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌కు, తర్వాత తెలంగాణ రాష్ట్రానికి గవర్నరుగా వ్యవహరించిన ఈఎస్ఎల్ నరసింహన్ హయాంను ఒక చరిత్రకారుడు లేక రాజకీయ విశ్లేషకుడు తప్పక పరిశీలించాల్సి ఉంటుంది. నా ఈ వ్యాసం ఉద్దేశం, రాసిన సమయం గురించి ఎవరైనా ఆశ్చ ర్యపడవచ్చు. కానీ ఇది నా విధి, ఒక పౌరుడిగా మాట్లాడే హక్కు నాకుందన్నదే దీనికి సమాధానం. ఇక ఈ సమయంలో ఎందుకు రాయడం అంటారా.. ఈ వ్యాసాన్ని ముందే రాసి గవర్నర్ పదవి ప్రతిష్టను, గౌరవాన్ని దెబ్బతీయకూడదన్నదే నా ఉద్దేశం. వ్యాసకర్త : జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్ పట్నా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి -
హెచ్‌సీయూ చాన్స్‌లర్‌గా జస్టిస్ నర్సింహారెడ్డి
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) చాన్స్‌లర్‌గా జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి నియమితులయ్యా రు. హెచ్‌సీయూ విజిటర్‌గా పదవి రీత్యా కొనసాగే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వర్సిటీ చాన్స్‌లర్‌ను నియమించారు. ఇప్పటివరకు చాన్స్‌లర్‌గా ఉన్న డాక్టర్ సి.రంగరాజన్ స్థానంలో నియమితులైన జస్టిస్ నర్సింహారెడ్డి ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగనున్నారు. కాగా, జస్టిస్ నర్సింహారెడ్డి ప్రస్తుతం సెంటర్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) చైర్మన్‌గా పనిచేస్తున్నారు. 2001 నుంచి 2015 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా, అనంతరం పట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా, మాస్టర్స్ ఇన్ ఇంటర్నేషనల్ లా డిగ్రీలను పొందారు. -
దాశరథి పురస్కార ప్రదానం
హైదరాబాద్ : తెలంగాణ నా కోటి రతనాల వీణ అన్న మహాకవి దాశరథి వ్యాఖ్య తెలంగాణ ఉద్యమంలో సాహసోపేతంగా స్ఫూర్తిని నింపిందని హైకోర్ట్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సంఘసేవ, సాంస్కృతిక సంస్థల సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం సుల్తాన్‌బజార్‌లోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయంలో మహాకవి దాశరథి 89వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ భాష సాంస్కృతిక అధ్యక్షుడు తెలుగు శాఖ ఏవీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ గంటా జలంధర్‌రెడ్డికి దాశరథి పురస్కార ప్రదానం ముఖ్యఅతిధి జస్టిస్ నరసింహా రెడ్డి చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో సంఖ్యా శాస్త్ర నిపుణులు దైవజ్ఞ శర్మ, ఉత్తమ ఉపాధ్యాయిని హైమావతిభీమన్న, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఏపీ చాప్టర్ అధ్యక్షుడు గున్నా రాజేందర్‌రెడ్డి, ప్రముఖ రచయిత ఘనపురం దేవేందర్, రూరల్ డెవలప్మెంట్ అసిస్టెంట్ డెరెక్టర్ ఎస్.గోవర్థన్‌రెడ్డి, సంస్థ అధ్యక్షుడు ఎ.సురేం దర్, చైర్మన్ సుంకర జయప్రకాష్ నారాయణ, కన్వీనర్ దయాకర్ రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యఅతిథిగా జస్టిస్ నరసింహారెడ్డి చేతుల మీదగా దాశరథి కుమారుడు దాశరథి లక్ష్మణ్, దాశరధి కుమార్తె ఇందిర, అల్లుడు గౌరి శంకర్లను ఘనంగా సన్మానించారు.