మాట్లాడక తప్పని సమయం | Justice L Narasimha Reddy Writes Guest Column On Governor constitutional Duties | Sakshi
Sakshi News home page

మాట్లాడక తప్పని సమయం

Published Wed, Sep 11 2019 12:47 AM | Last Updated on Wed, Sep 11 2019 12:47 AM

Justice L Narasimha Reddy Writes Guest Column On Governor constitutional Duties - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో ఘటనలను 2009 నుంచి సన్నిహితంగా పరిశీలిస్తూ వచ్చినవారికి అప్పట్లో పాలనాయంత్రాంగం తరపున వచ్చిన ప్రకటనలు, పరిశీలనలు సచివాలయం నుంచి కాకుండా రాజ్‌భవన్‌ నుంచే ఎక్కువగా వచ్చాయన్న విషయం గుర్తుండే ఉంటుంది. ఉద్యమకారుల్ని రెచ్చగొడుతూ, చేసిన ఈ ప్రకటనలే తెలంగాణలో డజన్ల కొద్దీ్ద అమాయక విద్యార్థులు, యువకుల ఆత్మహత్యలకు దారితీశాయి. ఆనాడు కాస్తంత మానవత్వం ప్రదర్శించి ఉంటే వందలాదిమంది ప్రాణాలను కాపాడి ఉండవచ్చు. రాజ్‌భవన్‌ ప్రకటనల తీవ్రత, కాఠిన్యం ఆనాడు అత్యంత నిరంకుశ పోలీసు అధికారులను కూడా షాక్‌కు గురిచేశాయి.

భారత రాజ్యాంగంలో గవర్నర్‌ వ్యవస్థకు ఎంతో ప్రముఖ స్థానం ఉంది. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం, ప్రతి కార్యనిర్వాహక ఆదేశం గవర్నర్‌ పేరుతోనే జారీ అవుతుంది. శాసనసభలో ఆమోదించిన చట్టాలు గవర్నర్‌ ఆమోదం పొందిన తర్వాతే అమలులోకి వస్తాయి. పాలనాయంత్రాంగంలో సంక్షోభ, ఘర్షణ తలెత్తిన సమయాల్లో గవర్నర్‌ నిర్వహించే పాత్ర కీలకం. గవర్నర్ల పరిణతి, అనుభవంతో కూడిన మార్గదర్శకత్వం సాధారణ పరిస్థితిని నెలకొల్పడానికి తోడ్పడతాయని అనేక ఉదాహరణలు చెబుతున్నాయి.

రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య వారధిగా గవర్నర్‌ విధులు ఉంటాయి. సంబంధిత రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిణామాలు నెలకొన్నప్పుడు కేంద్రానికి అక్కడి గవర్నర్లు ఇచ్చే నిజాయతీతో కూడిన, సత్యసమ్మతమైన నివేదికలు చాలా విలువైనవి. ఇలాంటి పరిణామాలను చాలామంది గవర్నర్లు జాగరూకంగా పరిశీలిస్తారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గతంలో చాలావరకు అత్యున్నత ప్రమాణాలు, ప్రభావాలు నెలకొల్పిన గవర్నర్లనే చూసింది.

అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా వ్యవహరించిన సి.రంగరాజన్‌ అసాధారణ వ్యక్తిత్వం కలవారు. ఆయన అద్భుత విజయాలు సాధించిన ఆర్థికవేత్త. అదే సమయంలో నమ్రత కలిగిన పెద్దమనిషి కూడా. 2003లో హైదరాబాద్‌లో సుప్రసిద్ధ ఆర్థికవేత్తల కాన్ఫరెన్స్‌ జరిగింది. దానికి ముఖ్య అతిథిగా సి.రంగరాజన్‌ కీలక ప్రసంగం చేశారు. అదృష్టవశాత్తూ ఆ సదస్సుకు నేను హాజరయ్యాను. ఆయన ప్రసంగానికి ఎంత ఆకర్షితుడినయ్యానంటే తర్వాత ఆయనకు ఉత్తరం రాస్తూ, నాలాంటి సాధారణమైన వ్యక్తులు కూడా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సంక్లిష్ట భావనలను ఆయన ప్రసంగం విన్న తర్వాత అర్థం చేసుకోగలుగుతారని రాశాను.

ఆయన ఎంతో దయతో తన పాండిత్య స్థాయిని ఏమాత్రం ప్రదర్శించకుండా నాకు సమాధానం రాశారు. తెలంగాణ కోసం ఆందోళన నేపథ్యంలో 2009లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దాదాపుగా తీవ్ర సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలోనే అప్పట్లో చత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి బదిలీ అయ్యారు. ఉద్యమ సెగలు కొంతవరకు హైకోర్టును కూడా తాకాయి. ఆ సమయంలో నేను రెండు ముఖ్యమైన కేసులు చేపట్టాల్సి వచ్చింది. మొదటిది.. తెలంగాణ ప్రాంతంలోని విద్యా సంస్థలకు విడిగా సెల వులు ప్రకటించడానికి సంబంధించింది. సెలవులు ప్రకటించాల్సివస్తే మొత్తం రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నిటికీ వర్తించాలని నేను ఆదేశాలి చ్చాను. ఒక నిర్దిష్ట ప్రాంతానికి మాత్రమే సెలవులు ప్రకటిస్తే అది ఆ ప్రాంత విద్యార్థులకు నష్టదాయకం అవుతుందన్నది నా భావన.

రెండోది.. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థినులను పోలీ సులు అవమానించి, వేధించిన ఘటనకు సంబంధించింది. సీనియర్‌ పోలీసు అధికారి సమక్షంలోనే విద్యార్థినులను మగపోలీసులు శారీరకంగా వేధింపులకు గురిచేశారని, అదే అధికారి ఒక జర్నలిస్టు మోటర్‌ సైకిల్‌పై మూత్రవిసర్జన చేయవలసిందిగా పోలీసులకు ఆదేశించారని వార్తాపత్రికలు నివేదించాయి. ఆగ్రహావేశాలను రేకెత్తించిన ఈ ఘట నపై రిట్‌ పిటిషన్‌ దాఖలై నా పరిశీలనకు వచ్చింది. సంబంధిత పోలీసు అధికారికి సమన్లు పంపి ఈ ఘటనపై తన వివరణను కోరాను. విచారణ క్రమంలో, విద్యార్థినులపై అలాంటి అనాగరికమైన, మతిహీనమైన చర్యలను ఎవరి ఆదేశాలతో చేపట్టారని ఆ అధికారిని ప్రశ్నించాను.

తర్వాత అతడు కోర్టుకు క్షమాపణలు చెప్పారు. ఆ విచారణ సంచలనం కలిగించింది. ఆ తర్వాత కొన్ని రోజులకు, జస్టిస్‌ నిసార్‌ అహ్మద్‌ కక్రు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా నియమితులయ్యారు. రాజభవన్‌లో జరిగిన ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి సాంప్రదాయానుసారం హైకోర్టు న్యాయమూర్తులు, మొత్తం మంత్రిమండలి, మాజీ న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం ముగిశాక తేనీరు అందించారు. హైకోర్టు జడ్డీలందరూ ఎల్‌ ఆకారంలో కూర్చున్నారు. నేను ఒక మూలన కూర్చున్నాను. జడ్జీలను ఒకరి తర్వాత ఒకరుగా గవర్నర్‌కు పరిచయం కార్యక్రమం జరిగింది. నా వంతు వచ్చినప్పుడు ఆయన ఆగి నిలబడి కింద పేర్కొన్న రీతిలో చర్చ మొదలెట్టారు: 

గవర్నర్‌ : ఓ.. మీరు జస్టిస్‌ నరసింహారెడ్డి గారు కదూ. నా పేరూ అదే. మీకు తెలుసా, రెండు కత్తులు ఒకే ఒరలో ఇమడవు.
నేను: (ఆమాటలు విని దాదాపుగా షాక్‌ తిన్నాను) సర్, మీరు గవర్నర్, నేను జడ్జిని. మనం రెండు కత్తులుగా ఉండే సమస్య ఎక్కడుంది? కనీసం నేనయితే వాటిలో ఒక కత్తిని కాను.
గవర్నర్‌ : మిస్టర్‌ రెడ్డీ, మీకు తెలుసు, నా నేపథ్యం, నా చరిత్ర చాలా చెడ్డవి.
నేను : నా దృష్టిలో మీరు ఉన్నత పదవిలో ఉన్నవారు, అలా కాకుండా మరొకరయితే అది మీకు మాత్రమే సంబంధించిన విషయం.
గవర్నర్‌ : మనం ఇక ఈ విషయం మర్చిపోదాం.
నేను : చర్చను మొదలెట్టింది మీరు. తర్వాతే జరగాల్సింది మీరే నిర్ణయించాలి మరి.

తర్వాత ఆయన ముందుకెళ్లారు. నా పక్కనే ఉన్న జస్టిస్‌ విలాస్‌ అప్జల్‌ పుర్కార్, జస్టిస్‌ ఆర్‌. కాంతారావు దీంతో దిగ్భ్రాంతి చెందారు, ఆశ్చర్యపోయారు. గవర్నర్‌ నుంచి ఇలాంటి ప్రవర్తనను తాము ఊహించలేదన్నారు. కాస్సేపు ముఖ్యమంత్రి, స్పీకర్‌ వద్ద కూర్చున్న తర్వాత గవర్నర్‌ నేరుగా నావద్దకే వచ్చారు. ‘సమాజాన్ని మెరుగుపర్చడం కోసం మనం కలిసి పని చేయవచ్చు కదా’ అన్నారు. ఒక జడ్జికి, గవర్నరుకి మధ్య ఉమ్మడి అంశాలు ఏవీ ఉండవనీ.. ప్రజలకు, మానవీయ అంశాలకు సంబంధించి గవర్నర్లే జోక్యం చేసుకున్న ఘటనలున్నాయని నేను సమాధానమిచ్చాను.

ఈ సందర్భంగా 1970లలో ఏపీ గవర్నర్‌గా వ్యవహరించిన శ్రీమతి శారదా ముఖర్జీ ఉదాహరణను కూడా గుర్తు చేశాను. తెలంగాణ రాష్ట్రంకోసం పోరాడుతున్న ఉద్యమకారులపై మోపిన కొన్ని కేసులకు సంబంధించి కోర్టులో నా స్పందనను గవర్నర్‌ ఇష్టపడకపోయి ఉండవచ్చునని భావించాను. అలాకాని పక్షంలో ఒక సిట్టింగ్‌ జడ్జి పట్ల అంత నిర్దయగా, అగౌరవకరంగా గవర్నర్‌ వ్యవహరించడానికి తగిన కారణమే లేదు. అప్పటినుంచి అనేక సందర్భాల్లో అవకాశం ఉన్నప్పటికీ నేను ఎన్నడూ రాజ్‌భవన్‌లోకి ప్రవేశించలేదు.

2009 నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఘటనలను సన్నిహితంగా పరి శీలిస్తూ వచ్చినవారికి అప్పట్లో పాలనాయంత్రాంగం తరపున  వచ్చిన ప్రకటనలు, పరిశీలనలు సచివాలయం నుంచి కాకుండా రాజ్‌భవన్‌ నుంచే ఎక్కువగా వచ్చాయన్న విషయం గుర్తుండే ఉంటుంది. అన్నిటికంటే విషాదకరమైన అంశం ఏమిటంటే, ఘర్షణను రెచ్చగొడుతూ, అణచివేత స్వభావంతో చేసిన ఈ ప్రకటనలే తెలంగాణలో డజన్ల కొద్ది అమాయక విద్యార్థులు, యువకుల ఆత్మహత్యలకు దారి తీశాయన్నదే. ఆ సమయంలో కాస్తంత మానవత్వం ప్రదర్శించి ఉంటే వందలాదిమంది ప్రాణాలను కాపాడి ఉండవచ్చు.

రాజ్‌భవన్‌ నుంచి వచ్చిన ప్రకటనల తీవ్రత, కాఠిన్య వైఖరి ఆనాడు అత్యంత నిరంకుశ పోలీసు అధికారులను కూడా షాక్‌కు గురిచేశాయి. తెలంగాణలో దాదాపు వెయ్యిమంది విద్యార్థులు, యువత మరణాల విషయంలో రాజ్‌భవన్‌ బాధ్యతను ఏరకంగానూ తోసిపుచ్చలేము. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌ నరసింహన్‌ కొన్ని సమయాల్లో తాను లక్ష్మీ నరసింహుడిలా వ్యవహరించేవాడినని చెప్పుకొచ్చారు. దాంట్లో వాస్తవం ఉంది మరి. తేడా ఏమిటంటే, లక్ష్మీ నరసింహ స్వామి ఆగ్రహం ప్రహ్లాదుని కాపాడటానికి అయితే, మన గవర్నర్‌ ఆగ్రహం ప్రహ్లాదుడి వంటి పిల్లల చావుకు కారణమైంది.

ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు తమ పార్టీ సభ్యత్వాలను, హోదాను అట్టిపెట్టుకుంటూనే ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన తరహా ఘటనలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలలో మాత్రమే జరగడం గమనార్హం. నరసింహన్‌ గవర్నర్‌గా ఉన్న సమయంలోనే ఇలాంటివి జరిగాయి. అలాంటి చేరికలను అనుమతించవచ్చా అని అప్పట్లో లీగల్‌ సలహా కోరతానని గవర్నర్‌ చిన్న ప్రకటన చేసి ఉంటే తర్వాత కాలంలో తెలుగుప్రజలు ఎదుర్కొన్న రాజకీయ అప్రతిష్టకు అవకాశం ఉండేది కాదు. అలా ఫిరాయించిన వ్యక్తులచేత ప్రమాణ స్వీకారం చేయడానికి ఆయన ప్రదర్శించిన సంసిద్ధత.. రాజకీయ బేరసారాలను పరాకాష్టకు తీసుకుపోవడమే కాకుండా, పార్టీ ప్రాతిపదికన జరిగే ఎన్నికల్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నార్థకం చేసింది. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌ వాస్తవంగానే పనికిరానిదైపోయింది.

ప్రజాస్వామ్యంలో, ప్రజాజీవితంలో ఉన్న వారు ఒక సమస్యతో వ్యవహరించేటప్పుడు తమ మధ్య ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ శత్రువైఖరి కలిగి ఉండరాదని అందరూ భావిస్తారు. ఇది నిజమే కావచ్చు కానీ సుదీర్ఘకాలంపాటు ఉద్యమాన్ని నిర్మించి నడిపిన నాయకుడు, ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నించిన రాజ్యాంగపరమైన అధికారి .. ఆ తర్వాతకాలంలో పరస్పరం ప్రశంసలు గుప్పించుకునేలా మారిపోవడం రాజకీయ విశ్లేషకులతో సహా పలువురిని షాక్‌కు గురిచేసింది. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌కు, తర్వాత తెలంగాణ రాష్ట్రానికి గవర్నరుగా వ్యవహరించిన ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ హయాంను ఒక చరిత్రకారుడు లేక రాజకీయ విశ్లేషకుడు తప్పక పరిశీలించాల్సి ఉంటుంది. 

నా ఈ వ్యాసం ఉద్దేశం, రాసిన సమయం గురించి ఎవరైనా ఆశ్చ ర్యపడవచ్చు. కానీ ఇది నా విధి, ఒక పౌరుడిగా మాట్లాడే హక్కు నాకుందన్నదే దీనికి సమాధానం. ఇక ఈ సమయంలో ఎందుకు రాయడం అంటారా.. ఈ వ్యాసాన్ని ముందే రాసి గవర్నర్‌ పదవి ప్రతిష్టను, గౌరవాన్ని దెబ్బతీయకూడదన్నదే నా ఉద్దేశం.


వ్యాసకర్త : జస్టిస్‌ ఎల్‌. నరసింహారెడ్డి,
సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ చైర్మన్‌
పట్నా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement