C Rangarajan
-
రేటు పెంపు కొనసాగించక తప్పదు
కోల్‌కతా: ద్రవ్యోల్బణం కట్టడికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రస్తుత కఠిన ద్రవ్య పరపతి విధానం కొనసాగించక తప్పదని మాజీ గవర్నర్ సీ రంగరాజన్ పేర్కొన్నారు. దేశంలోకి విదేశీ పెట్టుబడులు తిరిగి పుంజుకుంటే, రూపాయి బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. భారత్ కోరుకుంటున్న 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్య సాధనకు వచ్చే ఐదేళ్లూ ఆర్థిక వ్యవస్థ 8 నుంచి 9 శాతం పురోగతి సాధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రామకృష్ణ మిషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కల్చర్‌లో సమర్‌కాంతి పాల్ స్మారక ప్రసంగంలో రంగరాజన్ పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనవి... ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశం ఏడు శాతం వృద్ధి సాధిస్తే, అది హర్షణీయమైన అంశమే. ► ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో (మే నుంచి 1.4 శాతం పెంపుతో ప్రస్తుతం 5.40 శాతం) పెంపు విధానాన్ని కొనసాగించాలి. అభివృద్ధి చెందిన దేశాలు సైతం రేట్ల పెంపు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మరిన్ని రేటు పెంపు చర్యలు కొనసాగుతాయని భావిస్తున్నా. ► దేశం నుంచి పెట్టుబడులు తరలిపోవడం వల్లే డాలర్ మారకంలో రూపాయి విలువ 79 నుంచి 80 శ్రేణిలో పతనమైంది. ఇప్పుడు తిరిగి పెట్టుబడులు పుంజుకుంటున్నాయి. దీనితో దేశీయ కరెన్సీ విలువ మళ్లీ బలోపేతం అవుతుందని భావిస్తున్నాం. పలు నెలలపాటు ఎడతెగని అమ్మకాల తర్వాత, ఆగస్టు 2022లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల నుంచి రూ. 22,000 కోట్ల పెట్టుబడులు దేశంలోకి వచ్చాయి. ► 27 నుంచి 28 శాతానికి పడిపోయిన పెట్టుబడులు రేటు 33 శాతానికి పెరగాల్సిన అవసరం ఉంది. మొత్తం పెట్టుబడుల్లో ప్రైవేటు రంగం పెట్టుబడులు కూడా భారీగా పెరగాలి. ► విద్యుత్, వ్యవసాయం, మార్కెటింగ్, కార్మిక వంటి కీలక రంగాల్లో సంస్కరణలు కొనసాగాలి. ఆర్థికాభివృద్ధిలో ఇది కీలకం. 1990లలో చేపట్టిన సంస్కరణ చర్యలు ‘మంచి సమన్వయంతో, విస్తృత ప్రాతిపదికన జరిగాయి. ► దేశం మరింత పురోగతి సాధించడానికి కేంద్రం–రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం. వృద్ధి ప్రక్రియలో రెండు వర్గాలూ భాగాస్వాములే. ► కొత్త టెక్నాలజీకి అనుగుణంగా సవాళ్లను, ఉపాధి కల్పనకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించాలి. ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం మంచిదే, కానీ... శిలాజ ఇంధన వినియోగం తగ్గింపుతో ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం ప్రయోజనకరంగా ఉంటుందని రంగరాజన్ పేర్కొన్నారు. అయితే దేశం ఈవీల కోసం ఇతర ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని విశ్లేషించారు. దీనికితోడు ప్రస్తుత పరిస్థితులు, అంశాల ప్రాతిపదికన ఉపాధి రంగంపై ఈ తీవ్ర ప్రభావం వుండే వీలుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ అభిప్రాయడ్డారు. -
‘5 ట్రిలియన్ ఎకానమీ.. అబ్బో కష్టమే’
భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న తీరుపై ఆర్థిక వేత్త, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ సీ రంగరాజన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కోవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడంలో సరైన నిర్ణయాలు తీసుకోకుంటే మరో ఆర్థిక ముప్పు తప్పదని హెచ్చరించారు. ఇక్ఫాయ్లో జరిగిన ఓ సదస్సులో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో కరోనా సంక్షోభం తలెత్తడానికి ముందు వరకు భారత ఆర్థిక వ్యవస్థ ఆశాజనకంగానే ఉందన్నారు. 2019లో 2.3 ట్రిలియన్ డాలర్లతో దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండేందని, అప్పుడు ఆర్థిక వృద్ధి రేటు 9 శాతంతో కొనసాగిందని గుర్తు చేసుకున్నారు . అదే స్పీడు మరో ఐదేళ్లు కొనసాగి ఉంటే 2025 నాటికి ఇండియా ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకుని ఉండేది అని రంగరాజన్ అన్నారు. పరిష్కారం అయ్యేవి భారత ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుకుని ఉంటే దేశంలో నెలకొన్ని ఎన్నో సామాజిక రుగ్మతలకు పరిష్కారం లభించేంది. అట్టడుగు వర్గాలకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యేవన్నారు. కానీ కరోనా ఎఫెక్ట్ వల్ల అనుకున్న లక్ష్యాన్ని ఇప్పుడు సాధించడం కష్టమేననంటూ ఆయన అభిప్రాయపడ్డారు. కీలకం కరోనా మొదటి వేవ్ ప్రజల ఆరోగ్యం మీదకంటే దేశ ఆర్థిక వ్యవస్థను బాగా దెబ్బ తీసిందని, సెకండ్ వేవ్ ఆర్థిక వ్యవస్థ కంటే ప్రజల ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపిందని రంగరాజన్ అన్నారు. మొత్తంగా కరోనా వల్ల రోజువారి కూలీల జీవితం దుర్భరంగా మారిందన్నారు. ప్రస్తుతం వారికి ఉపాధి దొరకడం, జీవించడం కష్టంగా మారిపోయాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు తేరుకోవాలి మన ఆర్థిక సమస్యలు తీరాలంటే ఇప్పుడున్న వృద్ధి రేటు సరిపోదని, కచ్చితంగా పెంచాల్సిందేనని రంగరాజన్ అభిప్రాయపడ్డారు. మరోవైపు కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్నారు. దాన్ని కాచుకుంటూ ఎకానమినీ బలోపేతం చేయాలన్నారు. అది జరగాలంటే ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తూనే దానికి సమాంతరంగా వైద్య ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు మెరుగు కావాలని, అక్కడ పెట్టుబడులు పెరగాలని ఆయన సూచించారు. చదవండి : ఆర్బీఐ భారీ ఊరట.. ప్రస్తుతానికి యథాతథ స్థితి! మానిటరీ పాలసీ కమిటీ కీలక నిర్ణయాలివే! -
మాట్లాడక తప్పని సమయం
ఆంధ్రప్రదేశ్‌లో ఘటనలను 2009 నుంచి సన్నిహితంగా పరిశీలిస్తూ వచ్చినవారికి అప్పట్లో పాలనాయంత్రాంగం తరపున వచ్చిన ప్రకటనలు, పరిశీలనలు సచివాలయం నుంచి కాకుండా రాజ్‌భవన్ నుంచే ఎక్కువగా వచ్చాయన్న విషయం గుర్తుండే ఉంటుంది. ఉద్యమకారుల్ని రెచ్చగొడుతూ, చేసిన ఈ ప్రకటనలే తెలంగాణలో డజన్ల కొద్దీ్ద అమాయక విద్యార్థులు, యువకుల ఆత్మహత్యలకు దారితీశాయి. ఆనాడు కాస్తంత మానవత్వం ప్రదర్శించి ఉంటే వందలాదిమంది ప్రాణాలను కాపాడి ఉండవచ్చు. రాజ్‌భవన్ ప్రకటనల తీవ్రత, కాఠిన్యం ఆనాడు అత్యంత నిరంకుశ పోలీసు అధికారులను కూడా షాక్‌కు గురిచేశాయి. భారత రాజ్యాంగంలో గవర్నర్ వ్యవస్థకు ఎంతో ప్రముఖ స్థానం ఉంది. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం, ప్రతి కార్యనిర్వాహక ఆదేశం గవర్నర్ పేరుతోనే జారీ అవుతుంది. శాసనసభలో ఆమోదించిన చట్టాలు గవర్నర్ ఆమోదం పొందిన తర్వాతే అమలులోకి వస్తాయి. పాలనాయంత్రాంగంలో సంక్షోభ, ఘర్షణ తలెత్తిన సమయాల్లో గవర్నర్ నిర్వహించే పాత్ర కీలకం. గవర్నర్ల పరిణతి, అనుభవంతో కూడిన మార్గదర్శకత్వం సాధారణ పరిస్థితిని నెలకొల్పడానికి తోడ్పడతాయని అనేక ఉదాహరణలు చెబుతున్నాయి. రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య వారధిగా గవర్నర్ విధులు ఉంటాయి. సంబంధిత రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిణామాలు నెలకొన్నప్పుడు కేంద్రానికి అక్కడి గవర్నర్లు ఇచ్చే నిజాయతీతో కూడిన, సత్యసమ్మతమైన నివేదికలు చాలా విలువైనవి. ఇలాంటి పరిణామాలను చాలామంది గవర్నర్లు జాగరూకంగా పరిశీలిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో చాలావరకు అత్యున్నత ప్రమాణాలు, ప్రభావాలు నెలకొల్పిన గవర్నర్లనే చూసింది. అవిభక్త ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా వ్యవహరించిన సి.రంగరాజన్ అసాధారణ వ్యక్తిత్వం కలవారు. ఆయన అద్భుత విజయాలు సాధించిన ఆర్థికవేత్త. అదే సమయంలో నమ్రత కలిగిన పెద్దమనిషి కూడా. 2003లో హైదరాబాద్‌లో సుప్రసిద్ధ ఆర్థికవేత్తల కాన్ఫరెన్స్ జరిగింది. దానికి ముఖ్య అతిథిగా సి.రంగరాజన్ కీలక ప్రసంగం చేశారు. అదృష్టవశాత్తూ ఆ సదస్సుకు నేను హాజరయ్యాను. ఆయన ప్రసంగానికి ఎంత ఆకర్షితుడినయ్యానంటే తర్వాత ఆయనకు ఉత్తరం రాస్తూ, నాలాంటి సాధారణమైన వ్యక్తులు కూడా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సంక్లిష్ట భావనలను ఆయన ప్రసంగం విన్న తర్వాత అర్థం చేసుకోగలుగుతారని రాశాను. ఆయన ఎంతో దయతో తన పాండిత్య స్థాయిని ఏమాత్రం ప్రదర్శించకుండా నాకు సమాధానం రాశారు. తెలంగాణ కోసం ఆందోళన నేపథ్యంలో 2009లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపుగా తీవ్ర సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలోనే అప్పట్లో చత్తీస్‌గఢ్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న ఈఎస్ఎల్ నరసింహన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ అయ్యారు. ఉద్యమ సెగలు కొంతవరకు హైకోర్టును కూడా తాకాయి. ఆ సమయంలో నేను రెండు ముఖ్యమైన కేసులు చేపట్టాల్సి వచ్చింది. మొదటిది.. తెలంగాణ ప్రాంతంలోని విద్యా సంస్థలకు విడిగా సెల వులు ప్రకటించడానికి సంబంధించింది. సెలవులు ప్రకటించాల్సివస్తే మొత్తం రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నిటికీ వర్తించాలని నేను ఆదేశాలి చ్చాను. ఒక నిర్దిష్ట ప్రాంతానికి మాత్రమే సెలవులు ప్రకటిస్తే అది ఆ ప్రాంత విద్యార్థులకు నష్టదాయకం అవుతుందన్నది నా భావన. రెండోది.. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థినులను పోలీ సులు అవమానించి, వేధించిన ఘటనకు సంబంధించింది. సీనియర్ పోలీసు అధికారి సమక్షంలోనే విద్యార్థినులను మగపోలీసులు శారీరకంగా వేధింపులకు గురిచేశారని, అదే అధికారి ఒక జర్నలిస్టు మోటర్ సైకిల్‌పై మూత్రవిసర్జన చేయవలసిందిగా పోలీసులకు ఆదేశించారని వార్తాపత్రికలు నివేదించాయి. ఆగ్రహావేశాలను రేకెత్తించిన ఈ ఘట నపై రిట్ పిటిషన్ దాఖలై నా పరిశీలనకు వచ్చింది. సంబంధిత పోలీసు అధికారికి సమన్లు పంపి ఈ ఘటనపై తన వివరణను కోరాను. విచారణ క్రమంలో, విద్యార్థినులపై అలాంటి అనాగరికమైన, మతిహీనమైన చర్యలను ఎవరి ఆదేశాలతో చేపట్టారని ఆ అధికారిని ప్రశ్నించాను. తర్వాత అతడు కోర్టుకు క్షమాపణలు చెప్పారు. ఆ విచారణ సంచలనం కలిగించింది. ఆ తర్వాత కొన్ని రోజులకు, జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమితులయ్యారు. రాజభవన్లో జరిగిన ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి సాంప్రదాయానుసారం హైకోర్టు న్యాయమూర్తులు, మొత్తం మంత్రిమండలి, మాజీ న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం ముగిశాక తేనీరు అందించారు. హైకోర్టు జడ్డీలందరూ ఎల్ ఆకారంలో కూర్చున్నారు. నేను ఒక మూలన కూర్చున్నాను. జడ్జీలను ఒకరి తర్వాత ఒకరుగా గవర్నర్‌కు పరిచయం కార్యక్రమం జరిగింది. నా వంతు వచ్చినప్పుడు ఆయన ఆగి నిలబడి కింద పేర్కొన్న రీతిలో చర్చ మొదలెట్టారు: గవర్నర్ : ఓ.. మీరు జస్టిస్ నరసింహారెడ్డి గారు కదూ. నా పేరూ అదే. మీకు తెలుసా, రెండు కత్తులు ఒకే ఒరలో ఇమడవు. నేను: (ఆమాటలు విని దాదాపుగా షాక్ తిన్నాను) సర్, మీరు గవర్నర్, నేను జడ్జిని. మనం రెండు కత్తులుగా ఉండే సమస్య ఎక్కడుంది? కనీసం నేనయితే వాటిలో ఒక కత్తిని కాను. గవర్నర్ : మిస్టర్ రెడ్డీ, మీకు తెలుసు, నా నేపథ్యం, నా చరిత్ర చాలా చెడ్డవి. నేను : నా దృష్టిలో మీరు ఉన్నత పదవిలో ఉన్నవారు, అలా కాకుండా మరొకరయితే అది మీకు మాత్రమే సంబంధించిన విషయం. గవర్నర్ : మనం ఇక ఈ విషయం మర్చిపోదాం. నేను : చర్చను మొదలెట్టింది మీరు. తర్వాతే జరగాల్సింది మీరే నిర్ణయించాలి మరి. తర్వాత ఆయన ముందుకెళ్లారు. నా పక్కనే ఉన్న జస్టిస్ విలాస్ అప్జల్ పుర్కార్, జస్టిస్ ఆర్. కాంతారావు దీంతో దిగ్భ్రాంతి చెందారు, ఆశ్చర్యపోయారు. గవర్నర్ నుంచి ఇలాంటి ప్రవర్తనను తాము ఊహించలేదన్నారు. కాస్సేపు ముఖ్యమంత్రి, స్పీకర్ వద్ద కూర్చున్న తర్వాత గవర్నర్ నేరుగా నావద్దకే వచ్చారు. ‘సమాజాన్ని మెరుగుపర్చడం కోసం మనం కలిసి పని చేయవచ్చు కదా’ అన్నారు. ఒక జడ్జికి, గవర్నరుకి మధ్య ఉమ్మడి అంశాలు ఏవీ ఉండవనీ.. ప్రజలకు, మానవీయ అంశాలకు సంబంధించి గవర్నర్లే జోక్యం చేసుకున్న ఘటనలున్నాయని నేను సమాధానమిచ్చాను. ఈ సందర్భంగా 1970లలో ఏపీ గవర్నర్‌గా వ్యవహరించిన శ్రీమతి శారదా ముఖర్జీ ఉదాహరణను కూడా గుర్తు చేశాను. తెలంగాణ రాష్ట్రంకోసం పోరాడుతున్న ఉద్యమకారులపై మోపిన కొన్ని కేసులకు సంబంధించి కోర్టులో నా స్పందనను గవర్నర్ ఇష్టపడకపోయి ఉండవచ్చునని భావించాను. అలాకాని పక్షంలో ఒక సిట్టింగ్ జడ్జి పట్ల అంత నిర్దయగా, అగౌరవకరంగా గవర్నర్ వ్యవహరించడానికి తగిన కారణమే లేదు. అప్పటినుంచి అనేక సందర్భాల్లో అవకాశం ఉన్నప్పటికీ నేను ఎన్నడూ రాజ్‌భవన్‌లోకి ప్రవేశించలేదు. 2009 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఘటనలను సన్నిహితంగా పరి శీలిస్తూ వచ్చినవారికి అప్పట్లో పాలనాయంత్రాంగం తరపున వచ్చిన ప్రకటనలు, పరిశీలనలు సచివాలయం నుంచి కాకుండా రాజ్‌భవన్ నుంచే ఎక్కువగా వచ్చాయన్న విషయం గుర్తుండే ఉంటుంది. అన్నిటికంటే విషాదకరమైన అంశం ఏమిటంటే, ఘర్షణను రెచ్చగొడుతూ, అణచివేత స్వభావంతో చేసిన ఈ ప్రకటనలే తెలంగాణలో డజన్ల కొద్ది అమాయక విద్యార్థులు, యువకుల ఆత్మహత్యలకు దారి తీశాయన్నదే. ఆ సమయంలో కాస్తంత మానవత్వం ప్రదర్శించి ఉంటే వందలాదిమంది ప్రాణాలను కాపాడి ఉండవచ్చు. రాజ్‌భవన్ నుంచి వచ్చిన ప్రకటనల తీవ్రత, కాఠిన్య వైఖరి ఆనాడు అత్యంత నిరంకుశ పోలీసు అధికారులను కూడా షాక్‌కు గురిచేశాయి. తెలంగాణలో దాదాపు వెయ్యిమంది విద్యార్థులు, యువత మరణాల విషయంలో రాజ్‌భవన్ బాధ్యతను ఏరకంగానూ తోసిపుచ్చలేము. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ నరసింహన్ కొన్ని సమయాల్లో తాను లక్ష్మీ నరసింహుడిలా వ్యవహరించేవాడినని చెప్పుకొచ్చారు. దాంట్లో వాస్తవం ఉంది మరి. తేడా ఏమిటంటే, లక్ష్మీ నరసింహ స్వామి ఆగ్రహం ప్రహ్లాదుని కాపాడటానికి అయితే, మన గవర్నర్ ఆగ్రహం ప్రహ్లాదుడి వంటి పిల్లల చావుకు కారణమైంది. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు తమ పార్టీ సభ్యత్వాలను, హోదాను అట్టిపెట్టుకుంటూనే ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన తరహా ఘటనలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో మాత్రమే జరగడం గమనార్హం. నరసింహన్ గవర్నర్‌గా ఉన్న సమయంలోనే ఇలాంటివి జరిగాయి. అలాంటి చేరికలను అనుమతించవచ్చా అని అప్పట్లో లీగల్ సలహా కోరతానని గవర్నర్ చిన్న ప్రకటన చేసి ఉంటే తర్వాత కాలంలో తెలుగుప్రజలు ఎదుర్కొన్న రాజకీయ అప్రతిష్టకు అవకాశం ఉండేది కాదు. అలా ఫిరాయించిన వ్యక్తులచేత ప్రమాణ స్వీకారం చేయడానికి ఆయన ప్రదర్శించిన సంసిద్ధత.. రాజకీయ బేరసారాలను పరాకాష్టకు తీసుకుపోవడమే కాకుండా, పార్టీ ప్రాతిపదికన జరిగే ఎన్నికల్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నార్థకం చేసింది. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ వాస్తవంగానే పనికిరానిదైపోయింది. ప్రజాస్వామ్యంలో, ప్రజాజీవితంలో ఉన్న వారు ఒక సమస్యతో వ్యవహరించేటప్పుడు తమ మధ్య ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ శత్రువైఖరి కలిగి ఉండరాదని అందరూ భావిస్తారు. ఇది నిజమే కావచ్చు కానీ సుదీర్ఘకాలంపాటు ఉద్యమాన్ని నిర్మించి నడిపిన నాయకుడు, ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నించిన రాజ్యాంగపరమైన అధికారి .. ఆ తర్వాతకాలంలో పరస్పరం ప్రశంసలు గుప్పించుకునేలా మారిపోవడం రాజకీయ విశ్లేషకులతో సహా పలువురిని షాక్‌కు గురిచేసింది. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌కు, తర్వాత తెలంగాణ రాష్ట్రానికి గవర్నరుగా వ్యవహరించిన ఈఎస్ఎల్ నరసింహన్ హయాంను ఒక చరిత్రకారుడు లేక రాజకీయ విశ్లేషకుడు తప్పక పరిశీలించాల్సి ఉంటుంది. నా ఈ వ్యాసం ఉద్దేశం, రాసిన సమయం గురించి ఎవరైనా ఆశ్చ ర్యపడవచ్చు. కానీ ఇది నా విధి, ఒక పౌరుడిగా మాట్లాడే హక్కు నాకుందన్నదే దీనికి సమాధానం. ఇక ఈ సమయంలో ఎందుకు రాయడం అంటారా.. ఈ వ్యాసాన్ని ముందే రాసి గవర్నర్ పదవి ప్రతిష్టను, గౌరవాన్ని దెబ్బతీయకూడదన్నదే నా ఉద్దేశం. వ్యాసకర్త : జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్ పట్నా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి -
రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: రైతు రుణమాఫీపై ఆర్బీఐ మాజీ గవర్నర్లు వైవీ రెడ్డి, రంగరాజన్లు కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ రుణాల మాఫీ ఆర్థికవ్యవస్థ, పరపతి సంస్కృతికి మంచిది కాదని ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి వ్యాఖ్యానించారు. రుణమాఫీ పూర్తిగా రాజకీయ నిర్ణయమని, దీన్ని దీర్ఘకాలంలో సమర్ధించలేమని స్పష్టం చేశారు. దేశంలో ప్రతి రాజకీయ పార్టీ ఆయా రాష్ట్రాల్లో రుణమాఫీని ప్రకటిస్తున్నాయని అన్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ సీ రంగరాజన్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. రుణమాఫీ బదులు అప్పులు తిరిగి చెల్లించేందుకు రైతులకు సుదీర్ఘ సమయం ఇవ్వడంతో పాటు వాయిదా చెల్లింపును నిలిపివేయడం, నిర్దిష్ట సంవత్సరానికి వడ్డీ తగ్గించడం వంటి ప్రత్యామ్నాయాలు మెరుగైనవని ఆయన సూచించారు. కరువు పరిస్థితుల్లో వడ్డీ చెల్లింపులు మాఫీ చేయడం, రుణాల చెల్లింపుకు దీర్ఘకాలం ఉండేలా రీషెడ్యూల్ చేయడం మంచిదని చెప్పారు. ఈ చర్యలు ఎలాంటి ఫలితాలు ఇవ్వనప్పుడే రుణమాఫీకి ప్రభుత్వాలు మొగ్గుచూపాలన్నారు. పంజాబ్, యూపీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీ ప్రకటించిన క్రమంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ల వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
విలీనాలకు బ్యాంకులే ముందుకు రావాలి
♦ విలీనం అవసరమూ ఉండాలి ♦ ఆర్బీఐ మాజీ గవర్నర్ రంగరాజన్ న్యూఢిల్లీ: అవసరాన్ని బట్టే బ్యాంకుల విలీనాలు జరగాలని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ సి.రంగరాజన్ అభిప్రాయపడ్డారు. ఈ విలీనాలకు సంబంధించి తగు ప్రతిపాదనలతో బ్యాంకులే ముందుకు రావాల ని ఆయన సూచించారు. ‘విలీనం అవసరమనే పరిస్థితులుండాలి. అలాగే స్వయంగా బ్యాంకు ల నుంచే అలాంటి ప్రతిపాదనలు రావాలి‘ అని మంగళవారం నాబార్డ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో ఆయన చెప్పారు. ఇటీవలే ఎస్బీఐలో 5 అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకు విలీనం కాగా.. భారీ బ్యాంకుల ఏర్పాటు చేసే దిశగా మరికొన్నింటిని విలీనం చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్న నేపథ్యంలో రంగరాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, మొండిబాకీల (ఎన్పీఏ) సమస్య పరిష్కారానికి సంబంధించి ప్రక్షాళన కసరత్తు జరిగి తీరాల్సిందేనని రంగరాజన్ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో బ్యాంకులు కొంత వదులుకోక తప్పదని (హెయిర్‌కట్) కూడా ఆయన పేర్కొన్నారు. ఎన్‌పీఏకి తగిన పరిష్కారం కనుగొనకుండా ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడం, పెట్టుబడులను ఆకర్షించడం మొదలైన విషయాల్లో ముందుకెళ్లలేమని రంగరాజన్ తెలిపారు. ఎన్పీఏ పరిష్కార ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం ఏడాది సమయమైనా పడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో రూ. 8 లక్షల కోట్ల మేర మొండి బకాయిలు పేరుకుపోగా.. వీటిలో సుమారు రూ. 6 లక్షల కోట్లు .. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే ఉన్నాయి. దీంతో.. మొత్తం మొండి బకాయిల్లో దాదాపు పాతిక శాతం కట్టాల్సిన 12 కంపెనీల ఖాతాలను గుర్తించిన ఆర్బీఐ వాటిపై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవాల్సిందిగా బ్యాంకులను ఆదేశించిన సంగతి తెలిసిందే. -
ఐదుగురికి ‘సంసద్ రత్న’
చెన్నై: ఐదుగురు ఎంపీలు శనివారం రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ సి. రంగరాజన్ చేతుల మీదుగా ‘సంసద్ రత్న’ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డులను ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్, ఈ మ్యాగజైన్ ప్రీసెన్స్ అందించాయి. వీరిలో రాజస్తాన్‌కు చెందిన పి.పి. చౌదరి(బీజేపీ), మహారాష్ట్రకు చెందిన హీనా విజయ్‌కుమార్ గావిట్(బీజేపీ), శ్రీరంగ్‌అప్పా బర్నే(శివసేన), రాజీవ్ సతాల్(కాంగ్రెస్), షిరూర్(శివసేన) ఉన్నారు. షిరూర్ మినహా నలుగురూ తొలిసారి లోక్‌సభకి ఎన్నికైన వారు. మాజీ రాష్ట్రపతి కలాం పేరిట ఈ అవార్డులు ఇస్తున్నారు. అవార్డు విజేతలు క్రమం తప్పకుండా పార్లమెంటుకు హాజరై 300-500 ప్రశ్నలను లేవనెత్తారు. -
హెచ్‌సీయూ చాన్సలర్‌గా రంగరాజన్
ప్రముఖ ఆర్థికవేత్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ డాక్టర్ సీ రంగరాజన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (సెంట్రల్) చాన్సలర్‌గా నియమితులయ్యారు. విజటర్ హోదాలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. హెచ్‌సీయూ 11వ చాన్సలర్‌గా రంగరాజన్ పేరును ఖరారుచేసి ఆ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. గతంలో రిజర్వు బ్యాంకు గవర్నర్, పార్లమెంటు సభ్యుడుగానూ పనిచేసిన రంగరాజన్ తమిళనాడుకు చెందినవారు. తిరుచిరాపల్లి నేషనల్ కాలేజీలో చదువుకున్న ఆయన లయోలా కాలేజ్ (మద్రాస్ యూనివర్సిటీ) నుంచి కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి ఎకనామిక్స్‌లో పీహెచ్డీ పట్టాపుచ్చుకున్నారు. అనంతరం చాలా ఏళ్లపాటు అధ్యాపక వృత్తిలో కొనసాగారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాతోపాటు ఐఐఎం- అహ్మదాబాద్‌లో పాఠాలు చెప్పారు. మైక్రో ఎకనామిక్స్‌పై ఆయన రాసిన పుస్తకాలే.. ప్రస్తుతం పలు బిజినెస్ మేనేజ్ మెంట్ స్కూళ్లు పాఠ్యాంశాలయ్యాయి. ఆర్థిక శాస్త్రంలో రంగరాజన్ ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వాలు అనేక ఉన్నత పదవులు ఆయనకు కట్టబెట్టాయి. ప్రధాన మంత్రి ఆర్థిక సలహామండలికి చైర్మన్‌గా, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్కు అధ్యక్షుడిగా, సీఆర్ రావు అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ చైర్మన్‌గా పనిచేసిన ఆయన.. 1992 నుంచి 1997 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా.. 1997 నుంచి నుంచి 2003 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా వ్యవహరించారు. అదే సమయంలో ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల గవర్నర్ గా అదనపు బాధ్యతలు చేపట్టారు. 2002 సంవత్సరంలో భారత ప్రభుత్వం రెండో అత్యున్నత పౌర పురస్కారం 'పద్మ విభూషన్'తో ఆయనను సత్కరించింది. -
వచ్చే ఏడాది ఆరంభంలోవడ్డీరేట్లు తగ్గుతాయ్..
పసిడిపై మరిన్ని ఆంక్షలు ఉండకపోవచ్చు సైబర్ సెక్యూరిటీ పెరగాలి... ప్రధాని ఆర్థిక సలహామండలి మాజీ చైర్మన్ రంగరాజన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్బీఐ వచ్చే ఆర్థిక ఏడాది ప్రారంభంలో వడ్డీరేట్లు తగ్గించే అవకాశం ఉందని ప్రధాన మంత్రి ఆర్థిక సలహావుండలి మాజీ చైర్మన్ సి.రంగరాజన్ తెలిపారు. ధరలు దిగిరావడం ప్రకారం చూస్తే వడ్డీరేట్లు తగ్గుతాయన్న అంశంలో ఎటువంటి సందేహం లేనప్పటికీ కరెన్సీ మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందన్నారు. గత ఆర్బీఐ పాలసీలో వడ్డీరేట్లు తగ్గుతాయన్న స్పష్టమైన సంకేతాలను ఇచ్చినప్పటికీ ప్రస్తుత పరిస్థితులను చూస్తే వచ్చే ఏడాది ఏ క్షణమైనా వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉందన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఐడీఆర్‌బీటీ నిర్వహించిన పదవ అంతర్జాతీయ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సెక్యూరిటీ సదస్సులో రంగరాజన్ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా కలిసిన విలేకరులతో ఆయున మాట్లాడుతూ అంతర్జాతీయుంగా ముడి చమురు ధరలు తగ్గడం వల్ల దిగుమతి ఆధారిత దేశమైన భారత్ ప్రయోజనం పొందుతుందని, ఇదే సమయుంలో గల్ఫ్ దేశాల్లో పనిచేసేవారు కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. చవుురు ధరలు తగ్గుతుండటంతో గతేడాది కంటే కరెంట్ అకౌంట్ లోటు తగ్గుతుందన్న అంచనాలకు బంగారం దిగుమతులు అడ్డుకట్ట వేశాయున్నారు. గతేడాది వలే జీడీపీలో కరెంట్ అకౌంట్ లోటు 1.7 శాతానికి పరిమితమయ్యే అవకాశాలున్నాయున్నారు. బంగారం దిగువుతులు పెరిగినా వీటిని అరికట్టడానికి వురిన్ని ఆంక్షలు విధించే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నారు. అంతకువుుందు సమావేశంలో రంగరాజన్ మాట్లాడుతూ దొంగనోట్ల కంటే సైబర్ నేరాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రవూదకరంగా మారాయన్నారు. రోజు రోజుకూ ఆన్లైన్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ పెంచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో 50 కోట్ల బ్యాంకు ఖాతాలు ఉండగా, రోజుకు 100 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. ఇంకా దేశంలో ఇంటర్నెట్ వినియోగం తక్కువగా ఉందని, రానున్న కాలంలో ఇది మరింత పెరగనుండటంతో ఆన్లైన్ లావాదేవీల్లో రక్షణాత్మకమైన చర్యలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రవుంలో ఐడీఆర్‌బీటీ డెరైక్టర్ ఎ.ఎస్.రామశాస్త్రితో పాటు వివిధ దేశాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
70 బిలియన్ డాలర్లలోపే క్యాడ్: రంగరాజన్
చెన్నై: ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) 70 బిలియన్ డాలర్ల లోపే ఉంటుందన్న అభిప్రాయాన్ని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ సీ రంగరాజన్ సోమవారం పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. డాలర్ మారకంలో రూపాయి విలువ సైతం స్థిరపడిన సంకేతాలు కనిపిస్తున్నట్లు తెలిపారు. క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్ (ఎఫ్ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీ) మినహా దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారక ద్రవ్య నిల్వల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని క్యాడ్‌గా పరిగణిస్తారు. గత ఆర్థిక సంవత్సరం ఈ పరిమాణం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 4.8 శాతం (88.2 బిలియన్ డాలర్లు). ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ పరిమాణాన్ని 3.7 శాతానికి (77 బిలియన్ డాలర్లు) కట్టడి చేయాలని కేంద్రం భావిస్తోంది. ముఖ్యంగా బంగారం దిగుమతుల కట్టడి ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తోంది. -
మొండి బకాయిల భారం మరింత తీవ్రం!
న్యూఢిల్లీ: బ్యాంకుల మొండిబకాయిల (ఎన్పీఏ) భారం మరింత పెరిగే ప్రమాదం ఉందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (పీఎంఈఏసీ) చైర్మన్ సీ. రంగరాజన్ విశ్లేషించారు. ఆర్థిక మందగమన పరిస్థితులు దీనికి కారణమని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో బుధవారం జరిగిన ప్రభుత్వరంగ (పీఎస్‌యూ) బ్యాంకులు-ఆర్థిక సంస్థల ప్రధాన నిఘా(సీవీఓ), సీబీఐ అధికారుల 5వ వార్షిక సదస్సును ఉద్దేశించి రంగరాజన్ ప్రసంగించారు. మొండి బకాయిల విషయంలో బ్యాంకులు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఆర్థిక పరిణామాలను బ్యాంకులు ఎప్పటికప్పుడు అంచనావేసుకుంటూ తగిన చర్యలతో ముందుకు పోవాలని పేర్కొన్నారు. 2010లో రూ.59,924 కోట్లుగా ఉన్న బ్యాంకుల మొండిబకాయిలు 2012లో రూ. 1,17,262 కోట్లకు పెరిగిపోయాయని సిన్హా పేర్కొన్నారు. బ్యాంక్ మొండి బకాయిలపై సీబీఐ దర్యాప్తు ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి భారీ స్థాయిలో రుణాలను ఎగవేసిన వారిపై దర్యాప్తు ప్రారంభించామని సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా బుధవారం చెప్పారు. భారీగా రుణ ఎగవేతలకు సంబంధించి 30 అకౌంట్లను గుర్తించామని, ఈ 30 అకౌంట్ల కారణంగా బ్యాంకుల మొండి బకాయిలు వేల కోట్లకు పెరిగిపోయాయని ఆయన పేర్కొన్నారు. ఈ అకౌంట్ల వివరాలను వెల్లడిస్తే దర్యాప్తు దారితప్పే అవకాశాలున్నాయని వివరించారు. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సంబంధించిన చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ల ఐదవ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. మోసాలు, మొండి బకాయిలను గుర్తించడంలో బ్యాంకులు చేస్తున్న జాప్యం కారణంగా వాటిని ట్రాక్ చేయడం, రుణాలను రికవరీ చేయడం తదితర అంశాలపై ప్రభావం పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్‌ల వృద్ధిలతో పాటే బ్యాంకింగ్ మోసాలు కూడా పెరిగిపోయాయని చెప్పారు.