చెన్నై: ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) 70 బిలియన్ డాలర్ల లోపే ఉంటుందన్న అభిప్రాయాన్ని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ సీ రంగరాజన్ సోమవారం పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
డాలర్ మారకంలో రూపాయి విలువ సైతం స్థిరపడిన సంకేతాలు కనిపిస్తున్నట్లు తెలిపారు. క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్ (ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీ) మినహా దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారక ద్రవ్య నిల్వల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని క్యాడ్‌గా పరిగణిస్తారు. గత ఆర్థిక సంవత్సరం ఈ పరిమాణం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 4.8 శాతం (88.2 బిలియన్ డాలర్లు). ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ పరిమాణాన్ని 3.7 శాతానికి (77 బిలియన్ డాలర్లు) కట్టడి చేయాలని కేంద్రం భావిస్తోంది. ముఖ్యంగా బంగారం దిగుమతుల కట్టడి ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తోంది.