విలీనాలకు బ్యాంకులే ముందుకు రావాలి
♦ విలీనం అవసరమూ ఉండాలి
♦ ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రంగరాజన్
న్యూఢిల్లీ: అవసరాన్ని బట్టే బ్యాంకుల విలీనాలు జరగాలని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ సి.రంగరాజన్ అభిప్రాయపడ్డారు. ఈ విలీనాలకు సంబంధించి తగు ప్రతిపాదనలతో బ్యాంకులే ముందుకు రావాల ని ఆయన సూచించారు. ‘విలీనం అవసరమనే పరిస్థితులుండాలి. అలాగే స్వయంగా బ్యాంకు ల నుంచే అలాంటి ప్రతిపాదనలు రావాలి‘ అని మంగళవారం నాబార్డ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో ఆయన చెప్పారు. ఇటీవలే ఎస్‌బీఐలో 5 అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకు విలీనం కాగా.. భారీ బ్యాంకుల ఏర్పాటు చేసే దిశగా మరికొన్నింటిని విలీనం చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్న నేపథ్యంలో రంగరాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
మరోవైపు, మొండిబాకీల (ఎన్‌పీఏ) సమస్య పరిష్కారానికి సంబంధించి ప్రక్షాళన కసరత్తు జరిగి తీరాల్సిందేనని రంగరాజన్ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో బ్యాంకులు కొంత వదులుకోక తప్పదని (హెయిర్‌కట్) కూడా ఆయన పేర్కొన్నారు. ఎన్‌పీఏకి తగిన పరిష్కారం కనుగొనకుండా ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడం, పెట్టుబడులను ఆకర్షించడం మొదలైన విషయాల్లో ముందుకెళ్లలేమని రంగరాజన్ తెలిపారు. ఎన్‌పీఏ పరిష్కార ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం ఏడాది సమయమైనా పడుతుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో రూ. 8 లక్షల కోట్ల మేర మొండి బకాయిలు పేరుకుపోగా.. వీటిలో సుమారు రూ. 6 లక్షల కోట్లు .. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే ఉన్నాయి. దీంతో.. మొత్తం మొండి బకాయిల్లో దాదాపు పాతిక శాతం కట్టాల్సిన 12 కంపెనీల ఖాతాలను గుర్తించిన ఆర్‌బీఐ వాటిపై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవాల్సిందిగా బ్యాంకులను ఆదేశించిన సంగతి తెలిసిందే.