
న్యూఢిల్లీ: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులతో వ్యవసాయ, గృహ రుణాల్లో వచ్చే ఐదేళ్ల కాలంలో రుణ ఎగవేతలు 30 శాతానికి చేరుకోవచ్చని బీసీజీ సంస్థ అంచనా వేస్తోంది. పారిశ్రామిక విప్లవానికి ముందు నాటి రోజులతో పోల్చి చూస్తే ఉష్ణోగ్రతలు సగటున 1.2 డిగ్రీల మేర పెరిగాయని, ఇది తీర ప్రాంతాల్లో వరదలు, వ్యవసాయ ఉత్పత్తి క్షీణతకు దారితీస్తున్నట్టు తెలిపింది. ఈ తరహా తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులతో తలసరి ఆదాయం తగ్గినట్టు తెలిపింది.
షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల రుణాల్లో సగం మేర ప్రకృతిపై ఆధారపడి ఉంటాయని, ప్రకృతి విపత్తులు వాటి లాభాలపై ప్రభావం చూపిస్తాయని బీసీజీ వివరించింది. 2030 నాటికి దేశంలోని 42 జిల్లాలు సగటున రెండు డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతల పెరుగుదలను ఎదుర్కొంటాయని, ఈ ప్రకారం వచ్చే ఐదేళ్లలో 321 జిల్లాలపై ఉష్ణోగ్రతల ప్రభావం ఉంటుందని తెలిపింది. వాతావరణ మార్పులతో బ్యాంక్‌లకు 150 బిలియన్ డాలర్ల (రూ.12.9 లక్షల కోట్లు) మేర వార్షికంగా వ్యాపార అవకాశాలు రానున్నట్టు బీసీజీ సంస్థ అంచనా వేసింది. పర్యావరణ అనుకూల ఇంధనాలకు సంబంధించి ఈ మేరకు రుణ వితరణ అవకాశాలు లభిస్తాయని పేర్కొంది. 2070 నాటికి సున్నా కర్బన ఉద్గారాల విడుదల (తటస్థ స్థాయి) లక్ష్యాన్ని చేరుకోవడం కేవలం ప్రభుత్వ నిధులు ఒక్కటితోనే సాధ్యపడదని గుర్తు చేసింది.
ఇదీ చదవండి: ఈపీఎఫ్‌వోలో కొత్తగా 16 లక్షల మందికి చోటు
భారీ పెట్టుబడులు అవసరం
‘భారత్ బొగ్గు, చమురు వినియోగాన్ని తగ్గించి పునరుత్పాదక ఇంధన వనరుల పెంపు పట్ల అంకిత భావాన్ని ప్రదర్శించింది. ఈ విధమైన ఇంధన పరివర్తనానికి ఏటా 150–200 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు అవసరం. కానీ దేశంలో ప్రస్తుతం వాతావరణ సంబంధిత రుణ వితరణలు 40–60 బిలియన్ డాలర్లుగానే ఉంటున్నాయి. మరో 100–150 బిలియన్ డాలర్లు అవసరం’ అని బీసీజీ ఎండీ, పార్ట్‌నర్ అభినవ్ భన్సాల్ తెలిపారు. ఇది బ్యాంక్‌లకు గణనీయమైన అవకాశాలను తీసుకొస్తుందంటూ.. ఇందులో ఎక్కువ భాగం 2030–40 మధ్య కాలంలో ఆచరణ రూపం దాల్చొచ్చని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment