సాక్షి, కృష్ణా: ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. ఈ నెల 24వ తేదీన గవర్నర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు రేపు(బుధవారం) అబ్దుల్ నజీర్, ఏపీకి రానున్నారు. సతీసమేతంగా సాయంత్రం ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్ పోర్టుకి చేరుకుంటారాయన.
ఏపీకి మూడో గవర్నర్‌గా సయ్యద్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు చేపట్టనున్నారు. కర్ణాటకకు చెందిన అబ్దుల్ నజీర్.. సుప్రీంకోర్టు మాజీ జడ్జి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేయకుండానే.. దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రమోషన్ పొందిన మూడో న్యాయమూర్తిగా ఆయనకు ఓ గుర్తింపు ఉంది. జనవరిలోనే ఆయన పదవీ విరమణ చేశారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నజీర్ పలు కీలక తీర్పులను వెల్లడించారు. ట్రిపుల్ తలాక్, అయోధ్య-బాబ్రీ మసీదు వివాదం, నోట్ల రద్దు, గోప్యత హక్కు వంటి కేసుల్లో తీర్పు వెలువరించిన ధర్మాసనంలో ఆయన ఒకరు. 2017లో వివాదాస్పద ట్రిపుల్ తలాక్ కేసును విచారించిన బహుళ ధర్మాసనంలో జస్టిస్ అబ్దుల్ నజీర్ ఏకైక మైనారిటీ న్యాయమూర్తి.
Comments
Please login to add a commentAdd a comment