భువనగిరి సభలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్.చిత్రంలో పైళ్ల శేఖర్‌రెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డి
సాక్షి, యాదాద్రి: ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రాష్ట్రంలో కరెంటు మాయమవుతుందని.. దళిత బంధు ఆగమవుతుందని బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. అన్నీ పోయి మళ్లీ దళారుల రాజ్యం వస్తుందన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజాశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. సభలో కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
‘‘రైతులను పైరవీకారుల పాలుచేసిన కాంగ్రెస్ రాజ్యం మళ్లీ రావాలా?.. మళ్లీ అదే పాట పాడాలా? రైతు సోదరులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. రైతుల భూముల మీద రైతులకే హక్కులుండాలని ధరణి పోర్టల్‌ను తెచ్చాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామంటున్నది. పొరపాటున అదే జరిగితే.. రైతులపై రాబందులు పడతారు. మళ్లీ కౌలు రైతులు, వీఆర్వోలు, మళ్లీ రికార్డుల కెక్కియ్యడం వంటి వాటితో రైతుల భూములన్నీ ఆగమైపోతయ్. అదే జరిగితే ఒకరి భూమి మరొకరి పేర్ల మీదకు వస్తుంది. మళ్లీ తహసీల్ ఆఫీసులు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉంటుంది.
మూడు గంటల కరెంటు చాలంటున్నరు
నేనూ రైతు బిడ్డనే.. వ్యవసాయం చేస్తా. ఒకప్పుడు కరెంటు లేదు, మంచినీళ్లు లేవు, సాగునీళ్లు లేవు. ఇవ్వాళ 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 24 గంటల కరెంటు ఎందుకు? మూడు గంటలు చాలు అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. దయచేసి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి ఓటు వేయాలి..’’ అని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రణాళికలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పించామని చెప్పారు. ఈ సభలో కేసీఆర్ 12 నిమిషాలు మాత్రమే ప్రసంగించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీత, చిరుమర్తి లింగయ్య తదితరులు సభలో పాల్గొన్నారు.
సభలో గుండెపోటుతో వ్యక్తి మృతి
భువనగిరి నియోజకవర్గంలోని భూదాన్ పోచంపల్లి మండలం జూలూరుకు చెందిన మెట్టు సత్తయ్య (55) బీఆర్‌ఎస్ కార్యకర్తలతో కలసి ఈ సభకు వచ్చారు. ఈ క్రమంలో ఆకస్మికంగా కుప్పకూలిపోయారు. పక్కనే ఉన్న వారు గమనించి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. సత్తయ్య వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తున్నారని, ఆయన భార్య ఇప్పటికే మృతిచెందారని, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారని స్థానికులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment