రైతు రుణమాఫీ నిబంధనలపై ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి విధించిన షరతులు రైతుల పాలిట ఉరితాళ్లుగా బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అభివరి్ణంచారు. ఈ నిబంధనలు రైతాంగాన్ని వంచనకు, మోసానికి గురిచేసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల శాపనార్ధాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగలడం ఖాయమన్నారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా గతంలో షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని ఇచి్చన మాటకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ మాదిరిగా రేవంత్ రెడ్డి కూడా అద్దాల మేడలో కూర్చొని, తనకు ఐదేళ్లపాటు అధికారం ఇచ్చారనే ఆహంకారంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రూ.34 వేల కోట్ల రైతుల రుణమాఫీని బేషరతుగా చేస్తామన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు నిబంధనల పేరుతో హల్లికి హల్లి సున్నకు సున్నా అన్నట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అతి తక్కువ కాలంలో ప్రజాక్షేత్రంలో రే వంత్ ప్రభుత్వం నమ్మకం కోల్పోయిందన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై సీఎం రేవంత్‌కు ఉన్న ధ్యాస రైతు రుణమాఫీ, రూ.500 బోనస్, ఆడబిడ్డలకు రూ.2500, రూ.4వేల పెన్షన్, ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి రూ.4 వేలు, కాలేజీ పిల్లలకు స్కూటీలు.. వంటి హామీలను అమలు చేయడంపై లేదన్నారు. ఫిరాయింపుల పర్వం చూస్తుంటే కేసీఆర్ జుట్టు నుంచి రేవంత్‌రెడ్డి పుట్టినట్టు ఉందని ఎద్దేవాచేశారు.
రేవంత్‌రెడ్డి చదువుకున్నారా? లేదా?
‘తెల్లరేషన్ కార్డు ఎవరికి ఇస్తారు. రేవంత్‌రెడ్డి చదువుకున్నాడా? లేదా? మూడున్నర ఎకరాల తరిపొలం, ఏడు ఎకరాల కుష్కి పొలం ఉన్నవారికి మాత్రమే తెల్లరేషన్ కార్డు వస్తుంది. తెల్ల రేషన్ కార్డులు ఇవ్వక పదేళ్లు అవుతుంది. మీరు వచ్చి ఏడు నెలలు అవుతున్నా ఒక్క కార్డు ఇవ్వలేదు. రేషన్ కార్డు పేరుతో సగం మందికి, ఆదాయపన్ను పేరుతో 20%మందికి, రీ షెడ్యూల్ పేరుతో ఇంకొంత మందికి రుణమాఫీ ఎగ్గొడుతున్నారు. పొమ్మనక పొగబెట్టడం, ఎగబెట్టుడు తప్ప ఇంకొకటి లేదు’అని ఈటల ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment