అనిల్‌కుమార్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో జగదీశ్‌రెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్: ‘వ్యవసాయానికి ఉచిత విద్యుత్ మా ప్రభుత్వ పాలసీ. ఈ విషయానికి సంబంధించి కొందరు తెలిసీ తెలియక మాట్లాడుతున్నారు. వాటిని నేను పట్టించుకోను. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ పథకం నిలబడాలి. గ్రామీణ ప్రాంతాలు, రైతులు బాధలు తొలగిపోయి వంద శాతం బాగుండాలి..’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. భూముల డిజిటలైజేషన్ కోసం తెచ్చిన ధరణిని సమస్యగా చిత్రీకరించేందుకు కొన్ని దుష్టశక్తులు పనిచేస్తున్నాయని విమర్శించారు. ధరణితో భూముల మీద యజమానులకు సంపూర్ణ అధికారం వచ్చిందని చెప్పారు.
ఈ అధికారాన్ని మీ వద్దే పెట్టుకుంటారా? లేక వదిలేసుకుంటారా? అనేది మీరే నిర్ణయించుకోవాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో భారత్ రాష్ట్ర సమితిలో చేరారు. అనిల్‌కుమార్ రెడ్డితో పాటు ఆయన వెంట వచ్చిన అనుచరులకు కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
లోతుగా ఆలోచించిన తర్వాతే..
‘తెలంగాణ ఉద్యమంతో పాటు రాష్ట్ర సాధనను ఒక టాస్క్‌గా తీసుకుని పనిచేశాం. మాకు రాజకీయం ఒక టాస్క్ లాంటిది. నేను సిద్దిపేట శాసనసభ్యుడిగా పనిచేసిన నాటి నుంచి మొదలుకుని తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు కరెంటు విషయంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు వర్ణనాతీతం. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు అధికారులతో జరిపిన చర్చల ద్వారా సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు తదితర మౌలిక వసతుల్లో సమతుల్యత సాధించాం.
ప్రభుత్వ సంపూర్ణ మద్దతు ఉంటే 24 గంటల ఉచిత విద్యుత్ సాధ్యమవుతుందనే అధికారుల వాదనకు కట్టుబడి, పూర్తిస్థాయిలో అండగా నిలిచి ఏడెనిమిది నెలల్లోనే విద్యుత్ సరఫరా లేక ఏర్పడిన దుష్పరిణామాలను సరిదిద్దాం.ఏడు గంటల పాటు ఒకేమారు వ్యవసాయ అవసరాలకు విద్యుత్ ఇవ్వడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకునే 24 గంటల కరెంటుకు మొగ్గు చూపాం. గ్రిడ్ కుప్పకూలకుండా అవసరమైన సమయంలో విద్యుత్ కొనుగోలుకు అవసరమైన విచక్షణాధికారం అధికారులకు ఇవ్వడంతో పాటు సాంకేతిక అంశాలపై అవగాహన ఉండదనే ఉద్దేశంతో ట్రాన్స్‌కో, జెన్‌కో తదితర సంస్థల నుంచి ఐఏఎస్ అధికారులను తొలగించాం.
విద్యుత్ అంశంపై ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించిన తర్వాతే తొమ్మిదేళ్లుగా అమలు చేస్తున్నాం. మూడు గంటల కరెంటు అంటే రైతులు తిడుతున్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, ధాన్యం కొనుగోలు అంశంపై ఆర్థికవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నా గ్రామీణ ప్రాంతాలు కుదుటపడే వరకు కొనసాగిస్తాం. దీంతో ఆర్థికాభివృద్ధి జరిగి తెలంగాణ అన్ని రంగాల్లోనూ అగ్రస్థానానికి చేరుతుంది.
ధాన్యం ప్రాసెసింగ్.. జపాన్ కంపెనీతో చర్చలు
ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు, చెక్‌డ్యాంలు తదితరాలతో భూగర్భ జలాలు పెరిగి పంటల దిగుబడి పెరిగింది. తెలంగాణలో ఇసుక పండినట్లు 3 కోట్ల టన్నుల ధాన్యం వస్తుండటంతో గిర్నీల సామర్ధ్యం కూడా సరిపోవడం లేదు. 2.5 కోట్ల టన్నుల ధాన్యం ప్రాసెసింగ్ కోసం జపాన్ సటాకా కంపెనీతో మాట్లాడుతున్నాం. నేను రైతుబిడ్డగా సిద్దిపేట మార్కెట్‌లో పడిగాపులు పడిన రోజులను దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు వేస్తున్నాం..’అని సీఎం చెప్పారు.
భూములపై సర్వాధికారాలు యజమానులకు..
‘వీఆర్వోలు భూముల వివరాలు గందరగోళం చేశారు. ధరణి ద్వారా భూముల డిజిటలైజేషన్‌తో వాటిపై సర్వాధికారాలు యజమానుల చేతికి వచ్చాయి. రాష్ట్రంలోని 2.76 కోట్ల ఎకరాల్లో 1.56 కోట్ల భూమి ఇప్పటికే ధరణిలోకి వచ్చింది. ధరణి మూలంగా రైతుబంధు, భూమికి రక్షణ, ధాన్యం కొనుగోలు వంటివి సులభంగా సాధ్యమవుతాయి. ఇప్పుడు రాష్ట్రంలో భూముల విలువ ఎంతో పెరిగింది. ధరణి లేకపోతే శాంతిభద్రతల సమస్యలు తలెత్తేవి. కొందరు చెప్తున్నట్లు ధరణి తీసేస్తే మళ్లీ లంచాలు మొదలవుతాయి..’అని కేసీఆర్ అన్నారు.
జోడెడ్ల బండిలా ముందుకు తీసుకెళ్లండి
‘భువనగిరిలో ఇద్దరూ పోటీ పడి డబ్బులు తగలేయొద్దు. చెరి ఒక పదవి తీసుకుని జోడెడ్ల బండిలా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లండి.. అని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, అనిల్ కుమార్‌రెడ్డికి చెప్పా. కోడె లేగల మాదిరిగా వెలపల, దాపల సమానంగా ఉంటే కచ్చురంగా బాగా ముందుకు పోతుంది. అనిల్‌కుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు నాదే బాధ్యత. నాకు ఫిబ్రవరిలో 70 ఏళ్లు వస్తాయి. రేపటి తెలంగాణను పాలించేది మీరే. దారి చూపించి వెళతా..’అని కేసీఆర్ అన్నారు. సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితో పాటు ప్రభు త్వ విప్‌లు బాల్క సుమన్, గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, కె.ప్రభాకర్‌రెడ్డి, గ్యాదరి కిషోర్, భాస్కర్‌రావు, రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహారాష్ట్రలో రెండేళ్లలో ఉచిత విద్యుత్: కేసీఆర్
మహారాష్ట్రలో రైతు ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. మహారాష్ట్రలోని వివిధ పారీ్టలకు చెందిన 76 మంది సర్పంచ్‌లు కూడా సోమవారం బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వ్యవసాయంతో పాటు అనేక రంగాల్లో అభివృద్ధి చెంది దేశానికే ఆదర్శంగా నిలిచామని సీఎం చెప్పారు.
మహారాష్ట్రలో కూడా రైతులు, ప్రజల జీవన ప్రమాణాలు మారాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా పరిశీలించాల్సిందిగా సర్పంచ్‌లకు సూచించారు. వారిని తెలంగాణ గ్రామాల పర్యటనకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని ఆదేశించారు. బీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో మహారాష్ట్ర అమరావతి డివిజన్ నుంచి బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీతో పాటు రైతు సంఘటన, వంచిత్ బహుజన్ అఘాడీ, షెట్కారీ సంఘటనతో పాటు వివిధ పారీ్టలకు చెందిన 76 మంది సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, మహారాష్ట్ర మీడియా యూనియన్ ప్రతినిధులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment