ఇక్కడే సంక్రాంతి... ఇప్పుడే సంతోషం | YS Jagan govt prepared for distribution of Homes for the Poor scheme | Sakshi
Sakshi News home page

ఇక్కడే సంక్రాంతి... ఇప్పుడే సంతోషం

Published Thu, Dec 31 2020 4:32 AM | Last Updated on Thu, Dec 31 2020 4:32 AM

YS Jagan govt prepared for distribution of Homes for the Poor scheme - Sakshi

కృష్ణా జిల్లా వణుకూరులో పేదల కోసం సిద్ధం చేసిన ఇళ్ల స్థలాల లేఅవుట్‌

ముగ్గులేస్తాం..గొబ్బెమ్మలు పెడతాం..ఇక్కడే సంక్రాంతి చేసుకుంటాం రోజంతా ఇక్కడే గడుపుతాం..ఇళ్ల స్థలాల లబ్ధిదారుల్లో అవధుల్లేని ఆనందం తమ బతుకు చిత్రం మారిపోతుందనే విశ్వాసం జగనన్నను తమ గుండెల్లో పెట్టుకుంటామంటూ ఉద్వేగం
–  ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన

‘మేం ఈసారి సంక్రాంతి పండుగ ఇక్కడే చేసుకుంటాం. ముగ్గులేసి, గొబ్బెమ్మలు పెడతాం. రోజంతా ఇక్కడే గడుపుతాం. ఇంత ఆనందాన్ని జీవితంలో ఎప్పుడూ అనుభవించలేదు..’ ఉప్పొంగుతున్న సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతూ వణుకూరు దళితవాడ మహిళలు చేసిన వ్యాఖ్యలివి. ‘ఇన్నాల్టికి నిజమైన సంక్రాంతి చూస్తున్నాం బాబూ...’ అని వనిత అంటుండగానే, ‘మేం ఇక లక్షాధికారులం..’ అంది మరియమ్మ. ‘ఇన్నాళ్టికి బతుకు మీదే నమ్మకం వచ్చింది సార్‌...’ అంటూ తన కూతుర్ని హత్తుకుంది లలిత.

సాక్షి, అమరావతి: వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘నవరత్నాలు– పేదలందరికీ ఇళ్ళు’ పథకం వారిలో కోటి ఆశలు రేకెత్తిస్తోంది. జీవితంపై నమ్మకం పెంచుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే వారి బతుకు చిత్రాన్నే మార్చేస్తోంది. పనికెళ్ళకపోతే పస్తులుండే పేదల ఊరు వణుకూరు. విజయవాడకు కూతవేటు దూరంలో ఉండే ఈ గ్రామం ఇప్పుడు సంబరాల్లో మునిగితేలుతోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా ఈ గ్రామంలో దాదాపు 18 వేల పైచిలుకు ఇళ్ళ స్థలాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. వణుకూరుతో పాటు విజయవాడలోని పలు ప్రాంతాల లబ్ధిదారుల కోసం ఇక్కడ దాదాపు 400 ఎకరాల్లో స్థలాలు ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ బృందం అక్కడ క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్ళింది. ఇళ్ల స్థలాల్లో ఉన్నవారితో పాటు వణుకూరు గ్రామస్తులు కొందర్ని పలుకరించింది. 

మా పేదరికం పోయింది..
వణుకూరుకు సరిగ్గా అర కిలోమీటర్‌ దూరంలోనే ఉన్న ఆ ప్రాంతానికి పొద్దున్నుంచీ సూర్యాస్తమయం వరకు ఇళ్ల స్థలాల లబ్ధిదారులు వచ్చి పోతూనే ఉన్నారు. ‘మీరు ఎక్కడ్నుంచి? ఏం చేస్తారు? మీ ఫోన్‌ నంబర్‌ ఇవ్వండి?’ అంటూ ఒకర్నొకరు పరిచయం చేసుకుంటున్నారు. ప్లాట్ల దగ్గర నిలబడి సెల్ఫీలు దిగుతున్నారు. ఎవరికి ఏ ప్లాట్‌ ఇస్తారో తెలియదుగానీ లబ్ధిదారులు మాత్రం అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి అది తమ ఊరని మురిసిపోతున్నారు. విజయవాడలో టైలర్‌ పనిచేసే బొడుగు దీప్తి కుటుంబ సమేతంగా అక్కడి వచ్చింది. ‘ఈ సంక్రాంతితో మా పేదరికం పోయింది. ఇంతమందితో కలసి ఇక్కడ గొప్పగా బతుకుతాననే నమ్మకం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది..’ అని ఆనందంతో చెప్పింది. 12 ఏళ్ళ చిన్నారి నిహారిక తన తండ్రితో సెల్ఫీ దిగుతూ .. ‘పూరిగుడిసెలో నా పుస్తకాలు తడిచిపోయేవి. సొంత ఇల్లు వచ్చాక నా బుక్స్‌ అన్నీ ఓ షెల్ఫ్‌లో పెట్టుకుంటా. రోజూ దాబా మీదకెక్కి చదువుకుంటా..’ అంటూ ముసిముసి నవ్వులు నవ్వింది. 

జగనన్నే మాకు దేవుడు
‘మనకి ప్లాటొచ్చిందమ్మా... పండక్కి రండి’ అంటూ ఆటోనగర్‌లో ఉంటున్న వీరన్న తన అల్లుడికి ఫోన్‌ చేసి ఆనందం పంచుకున్నాడు. కొత్త ప్లాట్ల దగ్గర వాట్సాప్‌ వీడియో కాల్‌లో ఆ ప్రాంతాన్ని చూపించాడు. ‘మాకు జగనన్నే దేవుడు... అందుకే వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టుకున్నాం’ అని టెన్త్‌ చదువుతున్న సంకల్ప తన వద్ద ఉన్న ఫోన్‌ చూపిస్తూ చెప్పింది. ‘ఇంతకాలం మురికివాడలో బతుకు .. ఇప్పుడిక కొత్త వెలుగు’ అంటూ సంజయ్‌ అక్కడి పరిసరాలను ఫోన్‌లో చిత్రీకరించాడు.  

ఇన్నాళ్లకు ఇల్లొచ్చింది..
‘ఇదయ్యా ఇప్పటిదాకా మా బతుకు’ .. వణుకూరు ఎస్సీ కాలనీలో తన గుడిసె చూపిస్తూ చెప్పింది బుర్రె ప్రసన్న. గడ్డితో కప్పుకోవడమే కష్టంగా ఉన్న ఆ గుడిసెలోనే ఆ కుటుంబం ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటోంది. ఇల్లివ్వమని కొన్నేళ్ళుగా నేతల చుట్టూ తిరుగుతూనే ఉన్నామని చెప్పిందామె. తన అత్త బతికుండగా సొంతింటి కోసమే తపించిందని,  ‘ఈ ప్రభుత్వం వచ్చాక ఇల్లొచ్చింది. ఆమె బతికుంటే మురిసిపోయేది’ అని కన్నీళ్ళు దిగమింగుకుంటూ చెప్పింది. మరో రెండు అడుగులు వేస్తే కృపారావు ఇల్లు కన్పించింది. చుట్టూ పిచ్చి మొక్కలు. అటు వెళ్తుంటే పందులెదురొచ్చాయి. ఇంట్లోకి పాములు రావడం సర్వసాధారణమంట. ఇదే విషయమై కృపారావును కదిలిస్తే.. ’మాకేంటి సార్‌... ఇప్పుడు మాకు ప్లాట్‌ వచ్చింది. మా బాధలన్నీ తీరిపోయాయి’ అంటూ తన భార్య వనిత పడుతున్న ఆనందాన్ని పదేపదే చెప్పారు. 

ప్రభుత్వం భరోసా ఇచ్చింది
ఆటో నడిపే నేను ఇంటి అద్దె కట్టడానికే కష్టపడుతున్నా. ఇక ఎదిగే పిల్లలకు ఏమిస్తాననే మనాది ఇప్పటిదాకా ఉండేది. ఇప్పుడు నామీద నాకే నమ్మకం వచ్చింది. కాదు ప్రభుత్వం ఆ నమ్మకం కల్పించింది. ఇలాంటి వాతావరణంలో ఇల్లు వస్తుందని ఊహించుకుంటేనే చెప్పలేని ఆనందం కలుగుతోంది. ఇక్కడ నుంచి పోరంకికి ఆటో నడుపుకుంటా. 
– కామినేని సాంబయ్య, ఆటో డ్రైవర్‌

నమ్మకాన్ని జగనన్న నిజం చేశాడు
పొద్దస్తమానం టైలరింగ్‌తో కష్టపడే నా భార్య, నేను ఎప్పటికైనా సొంతింట్లో ఉంటామా? అన్పించేది. కానీ జగనన్న ఎన్నికల్లో చెప్పినప్పుడే నమ్మకం కలిగింది. ఇప్పుడు అది నిజమైంది. 
– బొడుగు లోకేష్, ఆర్టీసీ కాలనీ

పేరు రాసుకెళ్లారు.. ఇల్లొచ్చిందని చెప్పారు
ఎన్నో ఏళ్లుగా కన్పించిన ప్రతి నాయకుడినీ ఇంటి కోసం వేడుకున్నాం. ఎవరూ కనికరించలేదు. ఇటీవల గ్రామ వాలంటీర్‌ ఇంటికొచ్చి పేరు రాసుకెళ్ళారు. తర్వాత నీకు ఇల్లొచ్చిందని చెప్పారు. ప్రజల కోసం పనిచేసే జగనన్నను మా గుండెల్లో పెట్టుకుని పూజిస్తాం.    
    –బుర్రె ప్రసన్న, వణుకూరు

ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది
ఎలాంటి రాజకీయ ఒత్తిడీ లేకుండా మా చేతుల మీదుగా పేదవాళ్ళను లబ్ధిదారులుగా ఎంపిక చేయడం చాలా సంతృప్తిగా ఉంది. ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది.     
    – సాయి దీప్తి, వలంటీర్‌ 

పట్టాల పండుగ.. ఆనందం నిండగ..
రాష్ట్రవ్యాప్తంగా ఆరో రోజూ ఇళ్ల పట్టాల పంపిణీ
‘అందరికీ చోటు ఇస్తేనే అది సమాజం అనిపించుకుంటుంది. అందరికీ మంచి చేస్తేనే అది ప్రభుత్వం అనిపించుకుంటుంది. అన్ని కులాలు, మతాలు ఉంటేనే రాజధాని అవుతుంది. అటువంటి సమాజాన్ని, ప్రభుత్వాన్ని, రాజధానిని మీ అందరి చల్లని దీవెనలతో నిరి్మంచుకుందాం’ అంటూ సీఎం వైఎస్‌ జగన్‌  శ్రీకారం చుట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ ఆరో రోజైన బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో కొనసాగింది. పట్టాలు అందుకున్న అక్కచెల్లెమ్మలు.. ఎన్నో ఏళ్లుగా కలగానే మిగిలిన సొంతిల్లు ఇన్నాళ్లకు దక్కిందంటూ భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్సార్‌ జిల్లాలో బుధవారం 6,223 మందికి ఇళ్ల పట్టాలివ్వగా..ఇప్పటివరకు పట్టాలు అందుకున్న వారి సంఖ్య 50,809కి చేరింది. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా పాల్గొన్నారు.

అనంతపురం జిల్లాలో బుధవారం  4,598 మందికి పట్టాలను అందజేశారు. కర్నూలు జిల్లాలో బుధవారం 8,023 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో బుధవారం 3,451 ఇళ్ల  పట్టాలను పంపిణీ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బుధవారం 5,331 మందికి ఇళ్ల పట్టాలు, 309 మందికి టిడ్కో ఇళ్ల పత్రాలు అందజేశారు. మంత్రి గౌతంరెడ్డి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో బుధవారం 3,727 మందికి పట్టాలు అందజేయగా.. ఇప్పటివరకు 23,695 మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందారు. కొత్తపట్నం మండలం అల్లూరులో హౌసింగ్‌ కాలనీ నిర్మాణానికి మంత్రి బాలినేని భూమి పూజ చేశారు. గుంటూరు జిల్లాలో బుధవారం 13,909 మందికి ఇళ్ల పట్టాలు, 262 మందికి టిడ్కో ఇళ్లకు పత్రాలు అందజేశారు. జిల్లాలో ఇప్పటివరకు 57,325 ఇంటి పట్టాలు, 287 టిడ్కో ఇళ్లు పంపిణీ చేశారు. హోం మంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు.

కృష్ణా జిల్లాలో బుధవారం 8,642 మందికి ఇళ్ల పట్టాలను ఇవ్వగా.. ఇప్పటివరకు పట్టాలు పొందిన వారి సంఖ్య 55,428కు చేరింది. మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో బుధవారం జరిగిన కార్యక్రమంలో 7,637 మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు. ఇప్పటి వరకు 56,372 మంది లబ్ధి పొందారు. కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో బుధవారం 5,704 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా.. ఇప్పటివరకు లబ్ధి పొందిన వారి సంఖ్య 54,542కు చేరింది. మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో బుధవారం 3,764 మందికి పట్టాల్ని పంపిణీ చేయగా..ఇప్పటివరకు లబి్ధదారుల సంఖ్య 29,764కు చేరింది. విశాఖ జిల్లాలో బుధవారం 30,444 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి పట్టాలు అందజేశారు.  

టీడీపీకి ఓటేసినా..జగనన్న పట్టా ఇచ్చారు
నేను వైఎస్సార్‌సీపీకి ఓటేయలేదు. ఎప్పుడూ టీడీపీకే ఓటేశా. మా నాన్న, భర్త తెలుగుదేశం పార్టీయే. అయినా మాకు ఇల్లు రాలేదు. జగనన్న మాకు ఇంటి పట్టా ఇచ్చి.. ఇల్లు కూడా కట్టిస్తున్నారు. వైఎస్సార్‌ చేయూత పథకం కింద ఇప్పటికే రూ.18,750 వచ్చాయి. నూతిలో కప్పలా మనం ఉన్నదే ప్రపంచం కాదని నా భర్తకు చెబుతా. గొప్ప నాయకుడిని దేవుడిచ్చాడని చెబుతా. 
– షేక్‌ సరోజిని, 23వ వార్డు, తెనాలి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement