సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో 10 రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి వ్యాప్తి మళ్లీ ఉధృతమవుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా 46 జిల్లాల్లో గత కొన్ని వారాలుగా కరోనా పాజిటివిటీ రేటు 10 శాతం కంటే అధికంగా నమోదవుతోందని వెల్లడించింది. వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ఆయా జిల్లాల్లో ఆంక్షలను కఠినతరం చేయాలని, జనం గుంపులుగా చేరకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, సామూహిక కార్యక్రమాలకు అనుమతి ఇవ్వొద్దని సూచించింది. మరో 53 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 నుంచి 10 శాతం మధ్య నమోదవుతోందని పేర్కొంది. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని రాష్ట్రాలకు తెలియజేసింది. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న జిల్లాల్లో నిర్లక్ష్యం వీడకపోతే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
80 శాతానికి పైగా ఐసోలేషన్‌లోనే..
కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక సహా 10 రాష్ట్రాల్లో కరోనా తాజా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ శనివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ రాష్ట్రాలు కోవిడ్ కేసుల్లో పెరుగుదలను లేదా పాజిటివిటీ పెరుగుదలను రిపోర్ట్ చేస్తున్నాయి. అందువల్ల ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ నియంత్రణ చర్యల గురించి చర్చించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ కవరేజీ, వెంటిలేటర్లు, పీఎస్‌ఏ ప్లాంట్లు, ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్ల అందుబాటుపై సమీక్షించారు. ఈ 10 రాష్ట్రాల్లో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయని అధికారులు చెప్పారు. 10 రాష్ట్రాల్లో 80 శాతానికి పైగా కరోనా బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారని, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఒకవేళ బాధితుల ఆరోగ్య పరిస్థితి క్షీణించి, ఆసుపత్రుల్లో చేర్చి వైద్య సేవలందించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైతే అధికారులు అందుకు సన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది.
సొంతంగా సెరో–సర్వేలు నిర్వహించండి
కరోనా పాజిటివిటీ రేటు 10 శాతం కంటే అధికంగా నమోదవుతున్న జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది. కరోనా వ్యాక్సినేషన్‌ను సంతృప్తికర స్థాయిలో నిర్వహించడం ద్వారా ఆయా జిల్లాల్లో ప్రజల ప్రాణాలను కాపాడవచ్చని వివరించింది. సాధ్యమైనంత ఎక్కువ మందికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని పేర్కొంది. పీఎస్‌ఏ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రైవేట్ ఆసుపత్రులకు ఆదేశాలివ్వాలని తెలిపింది. జిల్లాల వారీగా సొంతంగా సెరో–సర్వేలు నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ల ఉనికిని గుర్తించేందుకు ఇన్సకాగ్ (ఇండియన్ సార్స్–కోవ్–2 జినోమిక్స్ కన్సార్టియం) ల్యాబ్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవాలని పేర్కొంది.
వ్యాక్సినేషన్‌లో వయోధికులకు ప్రాధాన్యం: ఐసీఎంఆర్
కొత్తగా కరోనా వైరస్ బారిన పడుతున్న వారిలో 80 శాతం మంది 45–60 ఏళ్లలోపు వారేనని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ తెలిపారు. అందుకే కరోనా వ్యాక్సినేషన్‌లో వారికి ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించారు. సామూహిక వేడుకలు, కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ప్రజలకు హితవు పలికారు.
ప్యాకేజీ నుంచి రాష్ట్రాలకు రూ.1,827 కోట్లు విడుదల
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుర్చడానికి కేంద్ర సర్కారు కోవిడ్–19 ఎమర్జెన్సీ రెస్పాన్స్, హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్‌నెస్(ఈసీఆర్‌పీ–2) పేరిట ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేసింది. ఈ ప్యాకేజీ కింద రూ.12,185 కోట్లు కేటాయించింది. తాజాగా ఇందులో 15 శాతం.. అంటే రూ.1,827.8 కోట్లను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విడుదల చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మనసుఖ్ మాండవీయా తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు. ఈ నిధుల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌కు రూ.281.98 కోట్లు, బిహార్‌కు రూ.154 కోట్లు, రాజస్తాన్‌కు రూ.132 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.131 కోట్లు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment