
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా సంక్రమణ తగ్గుముఖం పడుతున్న సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయి. పాజిటివ్ కేసుల నమోదులో రోజురోజుకూ తగ్గుదల కనిపిస్తోంది. శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటలలో 1,20,529 కొత్త కోవిడ్ కేసులు వచ్చాయి. ఇది గత 58 రోజులలో అత్యల్పం. వరుసగా 9 రోజులుగా... రోజుకు 2 లక్షలలోపే కేసులు నమోదవుతున్నాయి. కాగా దేశంలో గత 24 గంటల్లో 3,380మంది కరోనాతో మరణించడంతో వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 3,44,082కు చేరింది. యాక్టివ్ కేసులూ క్రమేపీ తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 15,55,248గా ఉంది. గత 5 రోజులుగా ఈ సంఖ్య 20 లక్షలలోపే ఉంది. యాక్టివ్ కేసులు 5.42% తగ్గాయి.
వరుసగా 23 రోజులు రికవరీలే ఎక్కువ
వరుసగా 23వ రోజు కరోనా కొత్త కేసులకంటే కొత్త రికవరీల సంఖ్యే ఎక్కువగా ఉంది. గత 24 గంటలలో 1,97,894 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. మొత్తంగా కోవిడ్ బారినపడి కోలుకున్న వారి సంఖ్య 2,67,95,549కు చేరింది. దీంతో రికవరీ రేటు 93.38% కి పెరిగింది. దేశంలో కోవిడ్ పరీక్షల సంఖ్య పెరుగుతూ ఉండగా వారపు పాజిటివిటీ తగ్గుతున్న ధోరణి కనబడుతోంది. ప్రస్తుతం వారపు పాజిటివిటీ 6.89% కాగా రోజువారీ పాజిటివిటీ 5.78% గా నమోదైంది. 12 రోజులుగా ఇది 10% లోపే ఉంటూ వస్తోంది. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఇచ్చిన మొత్తం వ్యాక్సిన్ డోసుల సంఖ్య 22.78 కోట్లు దాటింది.
Comments
Please login to add a commentAdd a comment